Medaram jathara: దక్షిణ భారత కుంభమేళాగా పేరుపొందిన మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు భక్తులు పోటెత్తారు. మేడారం భక్త జనసంద్రమైంది. కన్నెపల్లి నుంచి బయలుదేరిన సారలమ్మ అర్ధరాత్రి గద్దెకు చేరుకోవడంతో మహాజాతరకు అంకురార్పణ జరిగింది. బుధవారం ఉదయం 11 గంటల సమయంలో కన్నెపల్లి ఆలయంలో వడ్డెలు(పూజారులు) ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సాయంత్రం 6 గంటలకు పసుపు, కుంకుమ భరణి రూపంలో సారలమ్మను ఊరేగింపుగా తీసుకొని మేడారానికి తరలిచ్చారు. సమ్మక్క భర్త పగిడిద్దరాజు పూనుగొండ్ల నుంచి మంగళవారమే బయలుదేరి బుధవారం అర్ధరాత్రికి మేడారానికి చేరుకున్నారు. అలాగే ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని కన్నాయి గూడెం మండలంలోని కొండాయిలో కొలువైన గోవిందరాజులును గిరిజన పూజారులు బుధవారం రాత్రి గద్దె మీదకు చేర్చారు.
గురువారం సమ్మక్క రాక..
జాతర రెండవ రోజు (గురువారం) సమ్మక్కను గద్దెల మీదకు తీసుకురావడంతో అపూర్వ ఘట్టం ప్రారంభమవుతుంది. మేడారం మహాజాతరలో భక్తులంతా సమ్మక్క రాక కోసం ఎదురుచూస్తుంటారు. చిలుకలగుట్టలో కుంకుమ భరిణె రూపంలో ఉన్న సమ్మక్క తల్లిని గిరిజన పూజారులు, కోయదొరలు తీసుకొచ్చి గురువారం సాయంత్రం మేడారంలోని గద్దెపై ప్రతిష్ఠిస్తారు. ప్రభుత్వ లాంఛనాలతో ఈ కార్యక్రమం జరగనుండగా.. ములుగు జిల్లా ఎస్పీ మూడు రౌండ్లు తుపాకీ పేల్చి అమ్మను తీసుకొస్తున్నట్టుగా అధికారిక సంకేతాలు ఇస్తారు. రాత్రివేళ అమ్మవారిని గద్దెపైన ప్రతిష్టించిన అనంతరం భక్తులకు సమ్మక్క తల్లి దర్శన భాగ్యం కల్పిస్తారు.
తరలిరానున్న ప్రముఖులు..
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఫిబ్రవరి 23న అమ్మలను దర్శించుకోనున్నారు. గవర్నర్ తమిళిసై, సీఎం రేవంత్‌రెడ్డి కూడా అదే రోజు మేడారానికి విచ్చేయనున్నారు. జాతర సమయంలో కోటిన్నర మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకుంటారనేది సర్కారు అంచనా. అందుకు అనుగుణంగా భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు మంత్రులు సీతక్క, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్‌లు పలుమార్లు సమీక్షలు నిర్వహించారు. సీతక్క మేడారంలోనే ఉంటూ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.