Marri Rajashekar Reddy: హైదరాబాద్ శివార్లలో మర్రి రాజశేఖర్ రెడ్డి నిర్వహిస్తున్న రెండు కళాశాలల ఆవరణలోని కొన్ని నిర్మాణాలను జీహెచ్ఎంసీ అధికారులు గురువారం కూల్చివేశారు. దుండిగల్ లోని ఏరోనాటికల్ కళాశాల, ఎంఎల్ ఆర్ ఐటీఎం కళాశాలలోని రెండు శాశ్వత భవనాలు, ఆరు తాత్కాలిక షెడ్లను చెరువు స్థలంలో అక్రమంగా నిర్మించారన్న ఆరోపణలతో కూల్చివేశారు. రాజశేఖర్ రెడ్డి ఇటీవల జరిగిన ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. కాగా కాలేజీలో కూల్చివేతలను కవర్ చేసేందుకు శుక్రవారం ఆర్ టీవీ రిపోర్టర్ కాలేజీకి వెళ్లారు. అయితే మీడియాకు అనుమతి లేదంటూ అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది రిపోర్టర్‌ను అడ్డుకోవడమేకాకుండా కాలేజీ ప్రధాన ద్వారం పూర్తిగా మూసివేశారు.
ALSO READ: కాంగ్రెస్ తొలి జాబితా.. రాహుల్ గాంధీ పోటీ చేసేది అక్కడి నుంచే!
అంతేకాక అక్కడున్న సెక్యూరిటీ గార్డ్ మర్రి రాజశేఖర్ రెడ్డికి ఫోన్ చేశారు. దీంతో రెచ్చిపోయిన రాజశేఖర్ శేఖర్ రెడ్డి తమాషాలు చేస్తున్నావా? ఉద్యోగం పీకించేస్తానంటూ సెక్యూరిటీగార్డ్ ఫోన్ నుంచి రిపోర్టర్‌కు వార్నింగ్ ఇచ్చారు. అయితే ఈ రోజు కూల్చివేతలు ఏమన్న జరుగుతున్నాయా? లేవా? అని తెలుసుకోవాలని వచ్చామని రిపోర్టర్ చెప్పినప్పటికీ సెక్యూరిటీ గార్డ్ వీడియో ఆపాలంటూ పదే పదే హెచ్చరించారు.అంతేకాకుండా కెమెరా లాక్కునేందుకు కూడా ప్రయత్నం చేశారు. కూల్చివేతల వీడియోలు తీస్తుంటే ఆపాలంటూ బెదిరింపులకు దిగారు. రిపోర్టర్ ను గార్డులు బలవంతంగా బయటకు పంపించివేశారు. అయితే కాలేజీలో ఎలాంటి అక్రమ నిర్మాణాలు లేకుంటే మీడియా కవరేజీని అడ్డుకోవలసిన అవసరం ఏంటని, వాస్తవాలను ప్రజలకు తెలియజేయడానికి మీడియా ప్రయత్నిస్తే అడ్డుకోవడం సరికాదంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు.