మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రారెడ్డి బతికే ఉన్నారా? వారు చనిపోయారంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదా అంటే.. అవుననే సమాధానం వినిపిస్తోంది. మావోయిస్టు పార్టీ ఉత్తర సబ్ జోనల్ బ్యూరో అధికారికంగా విడుదల చేసిన ప్రకటనలో మావోయిస్టులు రాజిరెడ్డి, రామచంద్రరెడ్డి పార్టీకి టచ్‌లోనే ఉన్నారని, ఎటువంటి అనారోగ్య సమస్యలతోనూ బాధపడటం లేదంటూ వెల్లడించారు. దీంతో రాజిరెడ్డి, రామచంద్రరెడ్డి మృతిపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి.
మావోయిస్టు అగ్రనేత మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్ అనారోగ్యంతో బాధపడుతూ ఆగష్టు 18వ తేదీన చనిపోయారంటూ వార్తలొచ్చాయి. దండకారణ్యంలో రాజిరెడ్డి మృతిచెందారంటూ సామాజిక మాద్యమాల్లో ఓ వీడియో చక్కర్లు కొట్టింది. దీంతో రాజిరెడ్డి మృతి చెందారని అంతా భావించారు. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఎగ్లాస్‌పూర్ పరిధిలోని శాస్త్రులపల్లికి చెందిన రాజిరెడ్డి.. తొలితరం మావోయిస్టు నేతల్లో ఒకరు. పార్టీలో కార్యకర్తగా చేరిన రాజిరెడ్డి అంచెలంచెలుగా ఎదిగి ప్రస్తుతం కేంద్ర కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్నారు. కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్‌లతో కూడిన మావోయిస్టుల నైరుతి ప్రాంతీయ బ్యూరోలో విప్లవాత్మక ఉద్యమానికి ఇంఛార్జిగా రాజిరెడ్డి పని చేశారు. ఛత్తీస్‌గఢ్, ఒరిస్సా దండకారణ్యంలో కీలకంగా వ్యవహరించారు.
రాజిరెడ్డి మృతి చెందారంటూ వార్తలు వచ్చినప్పటికి ఆయన మృతిపై మావోయిస్టు పార్టీ అధికారిక ప్రకటన చేయకపోవడంతో ఆయన బతికే ఉన్నారా అంటూ ప్రచారం సాగుతున్న వేళ.. మావోయిస్టు పార్టీ ఉత్తర సబ్‌జోనల్ బ్యూరో అధికార ప్రతినిధి మంగ్లీ పేరుతో ఓ ప్రకటన విడుదలైంది. మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్ చనిపోలేదని ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో తమ నేతల ఆచూకీ కనిపెట్టేందుకు పోలీసులు ఆడిన కుట్రలో ఇది ఒక భాగమని మావోయిస్టు పార్టీ వెల్లడించింది. మావోయిస్ట్ నేతలు రాజిరెడ్డి, రాంచంద్రారెడ్డి క్షేమంగా ఉన్నారని తెలిపింది. తమ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేందుకు కొందరు పాలకులు పన్నిన కుట్రలో భాగంగా ఇద్దరు మావోయిస్టు నేతలు చనిపోయారంటూ ప్రకటించారని పార్టీ ప్రకటించింది. వారిద్దరి క్షేమ సమాచారం కోసం ఎదురు చూస్తున్న యావత్తు విప్లవ ఉద్యమ కారులకు, సంస్థలకు, వారి కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు ద్వారా క్లారిటీ ఇచ్చే ఉద్దేశంతో ఈ ప్రకటన జారీ చేస్తున్నట్లు మంగ్లీ తెలిపారు.
మావోయిస్టులు రాజిరెడ్డి, రాంచంద్రారెడ్డి చనిపోయారంటూ తెలుగు, హిందీ దినపత్రికల్లో వచ్చిన వార్తా కథనాల వెనక కేంద్ర ప్రభుత్వం, ఆయా రాష్ట్రాల పోలీసు వ్యవస్థ, ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారుల ప్రమేయం ఉన్నదని మావోయిస్టు పార్టీ ఆరోపించింది. ఈ అసత్య వార్తా కథనాల ద్వారా ప్రజలను అయోమయంలో ముంచెత్తాలని, విప్లవ విజయం పట్ల అవిశ్వాసం కల్గించడానికి, మా నాయకుల కదలికలు తెలుసుకోడం కోసం ఉద్దేశపూర్వకంగా ఈ అసత్య ప్రచారాన్ని తెరపైకి తెచ్చారంటూ మంగ్లి తెలిపారు. దీంతో రాజిరెడ్డి, రాంచంద్రారెడ్డి బతికే ఉంటే ఎక్కడ ఉన్నారు? వారి ఆచూకీ కనిపెట్టడం కోసం చనిపోయారనే ప్రచారం చేశారా అనే అనుమానాలు కలుగుతున్నాయి.