Middle Class Hero : రాజ్యసభ సభ్యుడిగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) పదవీకాలం ముగిసింది. 33 ఏళ్ల పాటు రాజ్యసభ ఎంపీగా ఉన్న మన్మోహన్ సింగ్ 2004-2014 వరకు యూపీఏ(UPA) ప్రభుత్వంలో దేశానికి ప్రధానిగా ఉన్నారు. మన్మోహన్ సింగ్ ఆర్థికవేత్త, విద్యావేత్త, బ్యూరోక్రాట్ కూడా. 1991 నుంచి 1996 వరకు పీవీ నరసింహారావు ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా ఉన్నారాయన. ఆర్థిక సంస్కరణల రూపశిల్పిగా మన్మోహన్ సింగ్ దేశం ఎప్పుడూ కీర్తిస్తూంటుంది. 91 ఏళ్ల మన్మోహన్ సింగ్ 1991 నుంచి 2024 వరకు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. మన్మోహన్ సింగ్ 1991లో తొలిసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1995, 2001, 2007, 2013లో తిరిగి ఎన్నికయ్యారు. 1998 నుంచి 2004 వరకు మన్మోహన్ సింగ్ రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది.
మన్మోహన్ సింగ్ ప్రయాణం:
మన్మోహన్ సింగ్ సెప్టెంబర్ 26, 1932న పంజాబ్ ప్రావిన్స్(Punjab Province) లోని గాహ్ అనే గ్రామంలో జన్మించారు. ఈ ప్రాంతం ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉంది. 1948లో పంజాబ్ విశ్వవిద్యాలయం నుంచి మెట్రిక్యులేషన్ పరీక్ష పూర్తి చేశారు మన్మోహన్. ఆయన విద్యా జీవితం పంజాబ్ నుంచి UKలోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి తీసుకువెళ్లింది. 1957లో కేంబ్రిడ్జ్ నుంచి ఎకనామిక్స్‌లో డిగ్రీని పొందారు. ఇక మన్మోహన్ సింగ్ ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ నుంచి కూడా డిగ్రీ పొందారు.
1971లో మన్మోహన్ సింగ్ భారత ప్రభుత్వ వాణిజ్య మంత్రిత్వ శాఖలో ఆర్థిక సలహాదారుగా చేరారు. 1972లో ఆర్థిక మంత్రిత్వ శాఖలో ముఖ్య ఆర్థిక సలహాదారుగా నియమితులయ్యారు మన్మోహన్ సింగ్ అనేక ప్రభుత్వ పదవులు నిర్వహించారు. వీరిలో ఆర్థిక మంత్రిత్వ శాఖలోని కార్యదర్శి పదవిలో కూడా కొనసాగారు. ప్రణాళికా సంఘం డిప్యూటీ చైర్మన్‌గా కూడా ఉన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) గవర్నర్‌గా పనిచేశారు. ప్రధానమంత్రికి సలహాదారుగా, యూనివర్సిటీ గ్రాంట్స్ కమీషన్ ఛైర్మన్‌గా తన మార్క్ చూపించారు మన్మోహన్ సింగ్. 1991-96 మధ్య భారత ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ ప్రవేశపెట్టిన సంస్కరణలను గుర్తు చేసుకుంటూ యావత్ దేశం సలాం చేస్తోంది. రిటైర్‌మెంట్ తర్వాతి జీవితం ఎంతో ఆనందంగా, ఆరోగ్యంగా సాగాలని కోరుకుంటోంది.