ఎన్నికలు తరుముకొస్తున్న వేళ ..రాజస్థాన్ లో కాంగ్రెస్ కు ఎదురు దెబ్బ తగిలింది. ఎన్నో సంవత్సరాలుగా ఆ పార్టీకి సేవలు అందిస్తున్న జ్యోతి మీర్దా ఆ పార్టీని వీడి కమలం గూటికి చేరారు. ఆమెతో పాటుగా మాజీ ఐపీఎస్ అధికారి అయినటువంటి సవాయ్ సింగ్ చౌదరి కూడా ఆమెను అనుసరించారు.
వీరిద్దరూ బీజేపీ గూటికి చేరడంతో రాష్ట్రంలో హస్తానికి పెద్ద దెబ్బే తగిలిందని చెప్పవచ్చు. సోమవారం రాజస్థాన్ బీజేపీ అధ్యక్షుడు సీపీ జోషి సమక్షంలో ఇద్దరూ ఓ కార్యక్రమంలో బీజేపీ కండువాను కప్పుకున్నారు. రాజస్థాన్ లోని నాగౌర్ ప్రాంతంలో అటు జ్యోతి మీర్దాకు, సవాయ్ చౌదరిలకు మంచి పేరుంది.
ఇప్పుడు వీరిద్దరూ పార్టీ మారడంతో రాబోయే రోజుల్లో, ఎన్నికల్లో కాంగ్రెస్ కు పెద్ద దెబ్బే తగిలనట్లు తెలుస్తుంది.ఆ ప్రభావం కచ్చితంగా ఎన్నికల మీద ఉంటుందని తెలుస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఎన్నో సంవత్సరాల నుంచి సేవలు అందిస్తున్న నాథూరామ్ మీర్దా మనవరాలే జ్యోతి మీర్దా. వీరికి నాగౌర్ ప్రాంతంలో గట్టి పట్టుంది.
జ్యోతి మీర్దా 2009 లో తొలిసారి కాంగ్రెస్ పార్టీ తరుఫునుంచి నాగౌర్ లో పోటీ చేసి గెలిచారు. ఆ తరువాత 2014, 2019 ఎన్నికల్లో ఓటమి చవి చూశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయానికి కృషి చేస్తానని ఆమె చెప్పారు. రాష్ట్రంలో గట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో పాటు, కేంద్రంలో కూడా బీజేపీ వచ్చేందుకు పని చేస్తానని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ పార్టీ నేతలను, కార్యకర్తలను నిర్లక్ష్యం చేసిందని ఆమె ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వంలో, మోడీ నాయకత్వంలో భారత్ గణనీయంగా అభివృద్ధి చెందిందని ఆమె ప్రశంసించారు.