TTD : తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. ఇక నుంచి తిరుమల (Tirumala) లో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అత్యున్నత ప్రమాణాలతో పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని టీటీడీ ఈవో జే శ్యామలరావు (J Shyamala Rao) అధికారులను ఆదేశించారు. తిరుమల గోకులం విశ్రాంతి భవనంలో టీటీడీ జేఈవోలు గౌతమి, వీరబ్రహ్మం, ఆరోగ్య శాఖ అధికారులతో కలిసి ఈవో సమీక్షా సమావేశం నిర్వహించారు.
శానిటరీ మెటీరియల్స్, సిబ్బంది పనితీరు, యాంత్రీకరణ అనేక అంశాలపై ఈవో అధికారులతో సమీక్షించారు. అలాగే శానిటరీ ఇన్‌స్పెక్టర్లు పలు సమస్యలను ఈవోకు తెలియజేశారు. తిరుమలలో భక్తుల క్యూలు విస్తరించిన ప్రాంతంలో.. తగినంత మంది సిబ్బంది లేకపోవడం వల్ల పారిశుద్ధ్య పనితీరులో లోపం ఉందని వివరించారు.
అలాగే సమయానికి శానిటరీ మెటీరియల్స్ (Sanitary Materials) ను ఏజెన్సీలు సరిగ్గా సరఫరా చేయకపోవడం.. నాణ్యత లేని క్లీనింగ్ సామాన్ల సరఫరాచేయడం వంటి అంశాలను ప్రస్తావించారు. శానిటరీ ఇన్‌స్పెక్టర్లు చెప్పిన పలు సమస్యలను ఈవో విన్నారు. ఇక పై కాంట్రాక్టర్‌లను కఠినంగా హెచ్చరించాలని.. నిబంధనల ప్రకారం సరిపడా సిబ్బంది, మెటీరియల్ సరఫరా చేసి తిరుమలలో పరిశుభ్రత చర్యలను మెరుగుపరిచేందుకు మూడు రోజుల సమయం ఇవ్వాలని జేఈవోలకు ఈవో ఆదేశాలు జారీ చేశారు.