MP Mahua Moitra Revoked His Lok Sabha Membership : టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా(Mahua Moitra) లోక్‌సభ సభ్యత్వాన్ని పార్లమెంటు రద్దు చేసింది. డబ్బులు తీసుకోని లోక్‌సభ(Lok Sabha) లో ప్రశ్నలు అడిగారని మహువా గత కొన్ని రోజులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. లాగిన్ ఐడి, పాస్‌వర్డ్‌ను వేరేవాళ్లకి ఇచ్చినట్లు నిర్ధారణ అయ్యింది. అయితే ఎథిక్స్ కమిటీ రిపోర్ట్ ఆధారంగా ఈ అంశంపై లోక్‌సభలో చర్చ జరిగింది. చర్చ తర్వాత మహువా లోక్‌సభ సభ్యత్వాన్ని పార్లమెంట్ రద్దు చేసింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. మహువా మొయిత్రా లోక్‌సభలో ప్రశ్నలు అడిగేందుకు పారిశ్రామికవేత్త హీరానందాని నుంచి డబ్బులు తీసుకున్నారని ఇటీవల బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే ఆరోపించారు. దీంతో ఎథిక్స్ కమిటీ ఈ వ్యవహారంపై విచారణ జరిపింది. మహువా మొయిత్రాతో పాటు ఆమెపై ఫిర్యాదు చేసిన బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే, న్యాయవాది జై అనంత్ దెహద్రాయ్‌ను కూడా కమిటీ విచారించింది. చివరికి ఈ కమిటీ 500 పేజీలతో కూడిన ఓ నివేదికను రూపొందించింది. మహువా అనైతిక ప్రవర్తనా, సభా ధిక్కరణకు పాల్పడ్డారని ఎథిక్స్ కమిటీ పేర్కొంది. అంతేకాదు ఆమెను లోక్‌సభ నుంచి బహిష్కరించాలని సిఫార్సు కూడా చేసింది.
అయితే ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఎథిక్స్ కమిటీ రూపొందించిన నివేదిక లోక్‌సభ ముందుకు వచ్చింది. ఈ నివేదికను బీజేపీ ఎంపీ, ఎథిక్స్ కమిటీ ఛైర్మన్ విజయ్ సోన్కర్ శుక్రవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. దీంతో విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా లోక్‌సభలో నినాదాలు చేశాయి. అలాగే ఎథిక్స్ కమిటీ నివేదిక కాపీని కూడా తమకు ఇవ్వాలంటూ పట్టుబట్టాయి. దీనిపై ఓటింగ్ నిర్వహించేందుకు ముందు సభలో చర్చ జరగాలని వాదించాయి. దీంతో నివేదికపై చర్చించేందుకు స్పీకర్ ఓం బిర్లా అనుమతిచ్చారు. అధికార, విపక్ష నేతల మధ్య వాదనలు జరిగాయి. మహువా తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోరినా కూడా అందుకు స్పీకర్ నిరాకరించారు. చివరికి మూజువాణి ఓటితో ఎథిక్స్ కమిటీ ప్రవేశపెట్టిన నివేదికను లోక్‌సభ ఆమోదించింది. మహూవా మొయిత్రాను లోక్‌సభ నుంచి బహిష్కరిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.
అలాగే సభను వచ్చే సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా.. విపక్షాలు వాకౌట్ చేశాయి. మరోవైపు తనను బహిష్కరించడాన్ని ముహూవా తీవ్రంగా వ్యతిరేకించారు. ఎలాంటి ఆధారాలు లేకున్నా కూడా కేవలం ఇద్దరు వ్యక్తులు చెప్పిన మాటలను నమ్మి తనని దోషిగా తేల్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మమ్మల్ని అణగదొక్కేందుకు ఈ కమిటీని ఓ ఆయుధంగా వాడుతున్నారని.. రేపు మా ఇంటికి సీబీఐని పంపించి వేధిస్తారామోనని మండిపడ్డారు.