Mahabubnagar BRS MP Ticket to Manne Srinivas Reddy: అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను దృష్టిలో పెట్టుకొని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR) లోక్ సభ ఎన్నికలకు సిద్దమవుతున్నారు. గెలిచే గుర్రాలకే టికెట్ ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నారు. అభ్యర్థుల పై కసరత్తు చేస్తున్న కేసీఆర్.. తాజాగా ఎంపీ ఎన్నికల బరిలో ఉండే మరో అభ్యర్థిని ప్రకటించారు. మహబూబ్ నగర్ ఎంపీ టికెట్ ను అక్కడి సిట్టింగ్ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డికి (Manne Srinivas Reddy) మరోసారి కేటాయించారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో మొదటిసారి ఎంపీగా బరిలో నిలిచి మన్నె శ్రీనివాస్ రెడ్డి గెలిచారు. అయితే.. ఈసారి సిట్టింగ్ నేతలకు టికెట్ ఇవ్వొద్దని భావించిన కేసీఆర్.. ఆ స్థానాల్లో అభ్యర్థులు లేక మరోసారి సిట్టింగ్ ఎంపీకే ఇవ్వాల్సి వచ్చిందని ఆ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఆ నలుగురికి లక్కీ ఛాన్స్..
లోక్ సభ ఎన్నికల బరిలో నిలిచే నలుగురు అభ్యర్థులను ప్రకటించారు గులాబీ అధిపతి కేసీఆర్. ఖమ్మం, కరీంనగర్, పెద్దపల్లి, మహబూబాబాద్ పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయబోయే అభ్యర్థులను ప్రకటించారు. కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ ఎంపీ వినోద్ కుమార్, పెద్దపల్లి బీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఖమ్మం బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎంపీ నామా నాగేశ్వర రావు, మహబూబాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థిగా మాలోత్ కవిత పేర్లను కేసీఆర్ ప్రకటించారు.
నాగర్ కర్నూల్ అభ్యర్థిగా ప్రవీణ్..
తెలంగాణ ప్రజలకు ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. లోక్ సభ ఎన్నికల వేళ రాష్ట్ర రాజకీయాల్లో కలలో కూడా ఊహించని సంఘటన చోటు చేసుకుంది. బీఆర్ఎస్ పార్టీతో బీఎస్పీ పార్టీ పొత్తు పెట్టుకుంది. రానున్న లోక్ సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేయనున్నట్లు రెండు పార్టీల అధినేతలు ప్రకటించారు. అయితే.. పొత్తులో భాగంగా నాగర్ కర్నూల్ నుంచి ఎంపీగా పోటీ చేయాలని బీఎస్పీ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. రేపు లేదా ఎల్లుండి దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ALSO READ: బీఆర్ఎస్ మాజీ మంత్రిపై విచారణ.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం!