BRS MP Candidates - Kasani Gnaneshwar & Kadiyam Kavya: లోక్ సభ ఎన్నికల బరిలో నిలిచే మరో ఇద్దరు ఎంపీ అభ్యర్థులను ప్రకటించారు మాజీ సీఎం కేసీఆర్. చేవెళ్ల, వరంగల్ ఎంపీ స్థానాల అభ్యర్థులను ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల ముందు టీడీపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరిన కాసాని జ్ఞానేశ్వర్ కు (Kasani Gnaneshwar) కేసీఆర్ చేవెళ్ల (Chevella) ఎంపీ టికెట్ ఇచ్చారు. అలాగే గత కొన్ని రోజులుగా మాజీ మంత్రి కడియం శ్రీహరి.. తన కూతురికి ఎంపీ టికెట్ ఇవ్వకపోతే పార్టీకి రాజీనామా చేస్తానని కేసీఆర్ కు చెప్పడంతో.. కడియం ను కాపాడుకునేందుకు వరంగల్ (Warangal) ఎంపీ టికెట్ ను కూతురు కడియం కావ్యకు (Kadiyam Kavya) కేటాయించారు. తాజాగా ప్రకటించిన అభ్యర్థుల ప్రకటనతో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల లిస్ట్ ఆరుకు చేరింది. ఇంకా 11 ఎంపీ స్థానాలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు.
ALSO READ: బీజేపీ రెండో జాబితా విడుదల
ఇప్పటికి వరకు ప్రకటించిన అభ్యర్థులు..
* పెద్దపల్లి - మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
* కరీంనగర్ - మాజీ ఎంపీ వినోద్ కుమార్
* మహబూబాబాద్ - మాలోత్ కవిత
* ఖమ్మం - నామా నాగేశ్వరరావు
* చేవెళ్ల - కాసాని జ్ఞానేశ్వర్
* వరంగల్ - కడియం కావ్య
కాంగ్రెస్ కు కేసీఆర్ దిమ్మతిరిగే స్కెచ్..
బీఆర్ఎస్ మాజీ మంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూతురు కావ్యకు వరంగల్ ఎంపీ టికెట్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చారు ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR). ఆరూరి రమేష్ వరంగల్ ఎంపీ టికెట్ కు నో చెప్పడంతో కేసీఆర్ కు కడియం ను కాపాడుకునే రూట్ క్లియర్ అయిందనే చెప్పాలి. కడియం శ్రీహరిని తమ పార్టీలో చేర్చుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నాలు చేసింది. ఆయన కూతురికి ఎంపీ టికెట్ హామీ కూడా కాంగ్రెస్ పెద్దలు కడియంకు ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే.. కడియం తనకు మంత్రి పదవి కావాలని కోరగా దానికి కాంగ్రెస్ హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో గందరగోళంలో ఉన్న కడియంకు కేసీఆర్ హస్తం ఇచ్చారు. ఇప్పటికే నేతల రాజీనామాలతో ఖాళీ అవుతున్న బీఆర్ఎస్ కాపాడుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్న కేసీఆర్.. తన వ్యూహాలతో కడియం రాజీనామాను అడ్డుకున్నారు. ఇప్పుడు కడియం కూతురికి ఎంపీ టికెట్ రావడంతో ఆయన కాంగ్రెస్ లో చేరుతారనే ప్రచారానికి చెక్ పడింది.