Accused in Bareilly Jail Video Viral: జైలులో శిక్ష అనుభవిస్తున్న ఓ ఖైదీ లైవ్ వీడియో బయటకు రావడం సంచలనంగా మారింది. హత్య కేసులో నిందితుడైన ఓ యువకుడు బరేలి సెంట్రల్ జైలు ఉండగా.. జైలు జీవితం స్వర్గంలా ఉందంటూ సంతోషం వ్యక్తం చేయడం విశేషం. కాగా ఈ సంఘటనతో పోలీసు అధికారులు ఉలిక్కిపడ్డారు. పటిష్ట భధ్రత మధ్య జైలు నుంచి వీడియో లైవ్ స్ట్రీమింగ్ ప్రసారం చేయడంపై దర్యాప్తు చేపట్టగా సంచలన విషయాలు బయటకొచ్చాయి.
ఇక్కడ జీవితాన్ని ఆస్వాదిస్తున్నా..
ఈ మేరకు బరేలి పోలీసులు తెలపిన వివరాల ప్రకారం.. 2019లో రాకేష్ యాదవ్ అనే కాంట్రాక్టర్‌ను హత్య చేసిన కేసులో ఆసిఫ్ అనే వ్యక్తి శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ క్రమంలోనే రెండు నిమిషాల లైవ్ స్ట్రీమింగ్ వీడియోలో ‘జైలు స్వర్గంలా ఉంది. ఇక్కడ జీవితాన్ని ఆస్వాదిస్తున్నా. త్వరలోనే బయటికి వస్తా’ అంటూ సంతోషంగా చెప్పుకొచ్చాడు. దీంతో పోలీసు అధికారులపై తీవ్ర విమర్శలు వెల్లువెల్లుతుండగా.. జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ చేతికి ఫోన్ ఎలా వచ్చింది? సిబ్బందిలో ఎవరైనా అతనికి సహకరించారా అనే కోణంలో విచారణ చేపట్టినట్లు తెలిపారు.
ఇది కూడా చదవండి: Electoral Bonds: ఎలక్టోరల్ బాండ్ కంట్రిబ్యూటర్లలో తెలుగువాళ్లే టాప్.. లిస్ట్ ఇదే!
ఇదిలావుంటే.. ఈ వీడియో వైరల్ కావడంతో నిబంధనలకు విరుద్ధంగా జైలు అధికారులు ఆసిఫ్‌కు ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నారంటూ రాకేష్ సోదరుడు జిల్లా మేజిస్ట్రేట్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై సమగ్ర విచారణ జరపాలని జిల్లా మేజిస్ట్రేట్ అధికారులకు ఆదేశాలు జారీ చేయగా ఈ ఘటనపై యూపీ జైళ్ల శాఖ డీఐజీ కుంతల్ కిశోర్ స్పందించారు. దీనికి బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.