Hathras Stampede: 'నరబలి ఇస్తే నిధులు దొరుకుతాయన్న ఆశ.. ఓ స్త్రీ రేపు రా అని తలుపు మీద రాయకపోతే దయ్యం వస్తుందన్న భయం.. మంచి జరుగుతుందన్న ఆశ.. చెడు జరుగుతుందన్న భయం మనిషిని దెన్నైనా గుడ్డిగా నమ్మాలే చేస్తాయి.. వీళ్లు వ్యాపారం చేసింది మనుషులతో కాదు.. వాళ్ల నమ్మకాలతో..' 2019లో రిలీజైన టాలీవుడ్ మూవీ 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ'లో హీరో చెప్పే డైలాగ్ ఇది.. హత్రాస్ తొక్కిసలాటలో చనిపోయిన మృతుల సంఖ్య అంతకంతకూ పెరగడం చూస్తే ఈ డైలాగ్ నిజమేనని అంగీకరించక తప్పదు. బాబా పాద ధూళి కోసం ఎగబడ్డ భక్తులు చివరికి ఆ మట్టిలోనే కలిసిపోవడం విషాదం.. అయితే మతపరమైన ఉత్సవాలు, కార్యక్రమాల్లో ఇలాంటి ఘటనలు జరగడం ఇది తొలిసారి కాదు.. గతంలోనూ అనేకసార్లు అమాయక భక్తులు ఇలానే ప్రాణాలు వదిలారు..!
ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) పటియాలికు చెందిన భోలే బాబా (Bhole Baba) చిన్న చిన్న ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తూ భారీ పాపులారిటీ సంపాదించుకున్నాడు. భారీ ప్రజాధారణ లభించడంతో పెద్ద ఎత్తున్న కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు హితబోధ చేయడం మొదలుపెట్టాడు. అలీగఢ్‌తోపాటు హాథ్రస్ జిల్లాల్లో ప్రతి మంగళవారం సత్సంగ్ పేరుతో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తుంటాడు. వేల సంఖ్యలో భక్తులు హాజరవుతుంటారు. ఎప్పటిలాగే మంగళవారం కార్యక్రమానికి భారీ సంఖ్యలో హాజరైన భక్తులు బాబా పాదాల వద్ద ఉన్న మట్టిని తీసుకునేందుకు పోటీపడ్డారు. దీంతో తొక్కిసలాట జరిగింది. ఒక్కసారిగి ఒకరిమీద ఒకరు పడటంతో ఊపిరాడక చాలా మంది అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయి చనిపోయారు.
మార్చి 31, 2023న మధ్యప్రదేశ్-ఇండోర్‌లో రామ నవమి రోజున 36 మంది మరణించారు. ఆలయం వద్ద బావి పైన నిర్మించిన స్లాబ్ కూలిపోవడంతో ప్రాణనష్టం జరిగింది. ఇక 2022 అక్టోబర్‌లో, జమ్ములోని మాతా వైష్ణో దేవి మందిరంలో జరిగిన తొక్కిసలాటలో 151 మంది చనిపోయారు. హిందూ క్యాలెండర్ ప్రకారం కొత్త సంవత్సరం మొదటి రోజున ప్రార్థనలు చేయడానికి పెద్ద సంఖ్యలో భక్తులు గుమిగూడడంతో తొక్కిసలాట జరిగింది.
2015 జులైలో ఆంధ్రప్రదేశ్-రాజమండ్రిలో జరిగిన గోదావరి పుష్కరాల సందర్భంగా పెను విషాదం చోటుచేసుకుంది. పుణ్యస్నానాలు ఆచరించేందుకు గోదావరి నది ఒడ్డున పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. అదే సమయంలో తొక్కిసలాట జరిగి 27 మంది మరణించారు. 50 మందికి పైగా గాయపడ్డారు.
యాత్రికుల రద్దీ, పేలవమైన క్రౌడ్ మేనేజ్‌మెంట్, సరైన మౌలిక సదుపాయాలు లేకపోవడం లాంటి కారణాలు ఈ విషాదానికి కారణమయ్యాయి.
2013లో మధ్యప్రదేశ్-దతియా జిల్లాలోని రతన్‌ఘర్ దేవాలయం సమీపంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 115 మంది మరణించారు. 100 మందికి పైగా గాయపడ్డారు. భక్తులు దాటుతున్న నది వంతెన కూలిపోతుందని పుకార్లు వ్యాపించడంతో ఈ తొక్కిసలాట జరిగింది. ఇక కుంభమేళాల్లో ఇలాంటి విషాదకర ఘటనలు చాలాసార్లు జరిగాయి. 2019 ప్రయాగ్‌రాజ్-కుంభమేళాలో జరిగిన తొక్కిసలాటలో 11 మంది మరణించారు. 2013లో అలహాబాద్‌లో జరిగిన కుంభమేళా తొక్కిసలాటలో 36 మంది చనిపోయారు.
2011 జనవరిలో కేరళలోని శబరిమల కొండపై విషాదకర ఘటన జరిగింది. వేలాది మంది భక్తులు దేవుడి దర్శనం కోసం తరలివచ్చారు. ఈ క్రమంలో జరిగిన తొక్కిసలాటలో 106 మంది మరణించారు. సెప్టెంబరు 30, 2008లో రాజస్థాన్-జోధ్‌పూర్ నగరంలోని చాముండా దేవి ఆలయంలో బాంబు పేలినట్లు పుకార్లు రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో దాదాపు 250 మంది భక్తులు చనిపోయారు. 60 మందికి పైగా గాయపడ్డారు.
2008 ఆగస్టులో కర్ణాటకలోని మైసూర్-చాముండి దేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 155 మంది మృతి చెందారు. ఇక జనవరి 25, 2005లో మహారాష్ట్ర-సతారా జిల్లాలోని మంధర్‌దేవి ఆలయంలో జరిగిన వార్షిక తీర్థయాత్రలో 340 మంది భక్తులు తొక్కిసలాటకు ప్రాణాలు విడిచారు. ఇలాంటి ఘటనలు దేశ చరిత్రలో నెత్తుటి కన్నీటి అక్షరాలతో చేదు జ్ఞాపకాలగా మిగిలిపోయాయి.