Summer Health Care Tips: ఎండలు మండుతున్నాయి.. పిల్లల విషయంలో తస్మాత్ జాగ్రత్త! వేసవి సెలవుల్లో ఈ పని అస్సలు చేయకండి

మార్చి నెల ప్రారంభం నుంచే సూర్యుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఇంకా ఉష్ణోగ్రతలు పెరగనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు స్కూల్స్, కాలేజీలకు వేసవి సెలవులు ఇచ్చే సమయం ఆసన్నమైంది. ఈ సెలవులు ప్రకటించిన వెంటనే పిల్లలు ఎండల్లో ఆడుకోవడానికి పరుగులు తీస్తారు.

New Update
summer health issues

summer health issues

అబ్బబ్బ ఎండలు మండిపోతున్నాయి. మార్చి నెల ప్రారంభం నుంచే సూర్యుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ముందుముందు ఇంకా ఉష్ణోగ్రతలు పెరగనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు స్కూల్స్, కాలేజీలకు వేసవి సెలవులు ఇచ్చే సమయం ఆసన్నమైంది. ఈ సెలవులు ప్రకటించిన వెంటనే పిల్లలు ఎండల్లో ఆడుకోవడానికి పరుగులు తీస్తారు. అయితే ఈ సీజన్‌లో భగభగమండే ఎండలు పిల్లల ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పిల్లలు ఎండలో తిరగడం వల్ల నీరసం, శరీరంపై దద్దుర్లు, అలసట, బాడీ పెయిన్స్ వంటి మరెన్నో అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంది. 

ఎండలో తిరగడం వల్ల కలిగే అనారోగ్య సమస్యలు

వడదెబ్బ: పిల్లలు తరచూ ఎండలో ఆడటం వల్ల వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉంది. ఇది అత్యంత ప్రమాదకరమైన పరిస్థితిగా ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల బాడీ టెంపరేచర్ ఒక్కసారిగా పెరిగిపోయి స్పృహ తప్పడం, వికారం, వాంతులు, తలనొప్పి వంటి సమస్యలు తలెత్తుతాయి. దీనిని సకాలంలో గుర్తించకపోతే ప్రాణాపాయం కూడా సంభవించే అవకాశం ఉంది. 

డీహైడ్రేషన్: పిల్లలు ఎండలో ఆడుకోవడం వల్ల విపరీతమైన చెమలు పడతారు. దీనివల్ల వారి శరీరంలో నీటి స్థాయిలు తగ్గి నీరశించిపోతారు. ఆ సమయంలో విపరీతంగా కళ్లుతిరగడం, నోరు ఎండిపోవడం, అలసిపోవడం వంటివి జరుగుతాయి. 

చర్మ వ్యాధులు: వేసవి కాలంలో సూర్యుని నుండి వచ్చే యూవీ కిరణాలు పిల్లల శరీరాన్ని తాకడం వల్ల చెమటకాయలు, దద్దు్ర్లు, చర్మం కమిలిపోయినట్లు కనిపించడం, దురద వంటివి తలెత్తుతాయి.

తల్లిదండ్రులు తీసుకోవలసిన జాగ్రత్తలు

ఈ వేసవి సెలవుల్లో ప్రతి ఒక్క తల్లిదండ్రి తమ పిల్లలను ఎంతో జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా వారిని ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బయట తిరగకుండా, ఆడుకోవడానికి వెళ్లనివ్వకుండా చూసుకోవాలి. 

అలాగే వారు వేసుకునే బట్టలు కూడా కాటన్‌లో లైట్ కలర్‌ ఉండేటట్లు చూసుకోవాలి. ఇలాంటి కాటన్ దుస్తులు వేసుకోవడం వల్ల చెమటను పీల్చుకుని చర్మానికి చల్లదనాన్ని అందిస్తుంది. కాగా ఈ సీజన్‌లో సింథటిక్ బట్టలు, జీన్స్, ఎలస్టిక్ వంటి దుస్తులకు చాలా దూరంగా ఉంటే మంచిది. 

ఈ వేసవి కాలంలో తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సి వస్తే.. గొడుగు, టోపీ, సన్ గ్లాసెస్, ఒక వాటర్ బాటిల్ తప్పనిసరిగా తీసుకెళ్లాలి.

పిల్లలకు ఎలాంటి ఫుడ్ పెట్టాలి?

ఈ వేసవి సీజన్‌లో తల్లిదండ్రులు తమ పిల్లలు తినే ఆహారంపై కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఈ సీజన్‌లో కేవలం మంచి నీళ్లే కాకుండా.. కొబ్బరి నీళ్లు, పల్చని మజ్జిక, నిమ్మరసం, ఇంట్లో తయారు చేసుకున్న ఫ్రూట్ జ్యూస్‌లు ఇవ్వాలి. 

అలాగే కర్బూజ, పుచ్చకాయ, ద్రాక్ష, నారింజ వంటి నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లను ఇవ్వాలి. 

భోజనం చేసేటప్పుడు పెరుగు లేదా మజ్జిక తప్పనిసరిగా ఇవ్వాలి. 

అయితే ఈ సీజన్‌లో కూల్‌డ్రింక్స్, ఆయిల్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, ఐస్ క్రీమ్స్‌కు పిల్లల్ని దూరంగా ఉంచాలి. ఇలా చేస్తే వేసవిలో మీ పిల్లలను జాగ్రత్తగా, సురక్షితంగా కాపాడుకోవచ్చు. 

Advertisment
తాజా కథనాలు