/rtv/media/media_files/2024/11/17/iutTC9yXHWSKtqy0vGIc.jpg)
Sravana Masam 2025: శ్రావణ మాసం వచ్చిందంటే దాదాపు చాలా మంది ఇళ్లలో నాన్ వెజ్ తినడం మానేస్తారు. మిగతా ఏ మాసంలో లేని నియమాన్ని శ్రావణ మాసంలోనే ఎందుకు పాటిస్తారు అని ఎప్పుడైనా ఆలోచించారా? అయితే దీని వెనుక కేవలం మతపరమైన నమ్మకాలే కాకుండా, శాస్త్రీయ పరమైన కారణాలు కూడా ఉన్నాయి అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
మతపరమైన విశ్వాసం!
హిందూ సంప్రదాయంలో శ్రావణ మాసాన్ని శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైనదిగా భావిస్తారు. ఈ నెలలో శివుడిని పూజించడం ద్వారా విశేష ఫలితాలు లభిస్తాయని భక్తుల నమ్మకం! కొందరు ప్రతి సోమవారాలు ఉపవాసాలు పాటిస్తారు. ప్రతిరోజూ శివారాధనలు, శివుడికి పూజలు చేస్తారు. అంతేకాదు ఇదే నెలలో మహిళలు తమ సౌభాగ్యం కోసం వరలక్ష్మీ వ్రతాలను ఆచరిస్తారు. ఈ పవిత్రమైన వాతావరణంలో దైవారాధనకు భంగం కలగకూడదని మాంసాహారానికి దూరంగా ఉంటారు. దీనిని ఒక రకమైన ఆధ్యాత్మిక క్రమశిక్షణ, స్వీయ నియంత్రణలో భాగంగా భావిస్తారు.
/filters:format(webp)/rtv/media/media_files/2025/07/06/sravana-masam-fasting-2025-07-06-17-22-17.jpg)
శాస్త్రీయ కారణాలు..
సాధారణంగా శ్రావణ మాసం వర్షాకాలంలో వస్తుంది. ఈ సమయంలో వాతావరణం చల్లగా, తేమగా ఉండడం వల్ల మాంసాహారం తింటే జీర్ణమవడానికి కష్టం అవుతుంది. ఇది అజీర్తి, కడుపు ఉబ్బరం, ఇతర కడుపు సంబంధిత సమస్యలకు దారితీస్తుంది. అంతేకాదు వర్షాకాలంలో నీటి కాలుష్యం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. దీనివల్ల చేపలు, కోడి మాంసం, ఇతర మాంసాల్లో బ్యాక్టీరియా, వైరస్‌లు పెరిగే ఛాన్స్ ఉంది. వీటిని సరిగ్గా శుభ్రం చేయకపోయినా, నిల్వ చేయకపోయినా, లేదా వండకపోయినా ఫుడ్ పాయిజనింగ్ వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. అందుకే, ఈ శ్రావణ మాసంలో మాంసాహారం తగ్గించడం లేదా పూర్తిగా మానేయడం ఆరోగ్యానికి మంచిదని పెద్దలు, నిపుణులు సూచిస్తారు.
ఆచరణాత్మక కారణాలు
అయితే పాత కాలంలో శ్రావణ మాసం సమయంలో భారీ వర్షాల కారణంగా వరద నీటితో చెరువులు, కాలువలు కలుషితం కావడంతో చేపలు పట్టడం సాధ్యమయ్యేది కాదు. ఒకవేళ మాంసాహారం వండినా.. సరైన సదుపాయాలు( ఫ్రిడ్జ్) లేకపోవడంతో వాటిని నిల్వ ఉంచడం కుదిరేది కాదు. తేమ, చల్లదనం కారణంగా త్వరగా పాడైపోయేవి. ఇలాంటి ఆచరణాత్మక కారణాల వల్ల కూడా శ్రావణ మాసంలో మాంసాహారం తినే అలవాటు క్రమంగా తగ్గిపోయిందని చెబుతారు.