/rtv/media/media_files/2025/09/20/mahalaya-amavasya-2025-09-20-09-47-36.jpg)
Mahalaya Amavasya
హిందూ సంప్రదాయంలో మహాలయ అమావాస్య అనేది అతి ముఖ్యమైన రోజ. ఈ అమావాస్య నాడు పూర్వీకులను తలచుకుని, వారికి తర్పణాలు, పిండ ప్రధానం వంటివి చేస్తారు. పితృ దేవతలకు ఇలాంటివి చేయడం వల్ల వారు శాంతిస్తారని నమ్ముతారు. అలాగే వారి ఆశీస్సులు కుటుంబానికి లభిస్తాయని పండితులు చెబుతుంటారు. అయితే మరి ఈ మహాలయ అమావాస్య నాడు పాటించాల్సిన నియమాలు ఏంటో పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
పితృ తర్పణాలు, పిండ ప్రధానం
మహాలయ అమావాస్య రోజు ప్రధానంగా పితృ తర్పణాలు, పిండ ప్రధానం చేయాలని పండితులు అంటున్నారు. అమవాస్య నాడు ఉదయాన్నే నదిలో లేదా చెరువులో స్నానం చేసి, నల్ల నువ్వులు, నీరు, బియ్యం కలిపి తర్పణం ఇస్తారు. ఈ తర్పణాలు విడిచేటప్పుడు తమ పూర్వీకుల పేర్లను స్మరించుకుంటారు. నదులకు వెళ్లలేనివారు ఇంటి వద్ద పండితుడి సమక్షంలో కూడా తర్పణాలు ఇస్తారు. ఈ పనులు చేయడం వల్ల పూర్వీకుల ఆత్మలకు శాంతి లభించి, వారికి పుణ్యం దక్కుతుందని నమ్ముతారు. తర్పణాల తర్వాత బియ్యం పిండితో చేసిన ముద్దలను పూర్వీకులకు నైవేద్యంగా పెడతారు. ఈ ముద్దలను పిండాలు అంటారు. వీటిని ఆ తర్వాత కాకులకు లేదా గోవులకు ఆహారంగా అందిస్తారు. కాకులను పితృ దేవతల ప్రతిరూపాలుగా భావిస్తారు. ఈ కర్మలు శ్రద్ధతో, భక్తితో చేస్తేనే మంచి ఫలితం ఉంటుందని పండితులు అంటున్నారు.
ఉపవాసం, దానధర్మాలు
మహాలయ అమావాస్య రోజున చాలామంది ఉపవాసం పాటిస్తారు. ఈ రోజు పితృ కార్యక్రమాలు పూర్తయ్యే వరకు ఉపవాసం ఉంటారు. కేవలం పితృ తర్పణాలకు ముందు పూజలు, ప్రార్థనలు మాత్రమే చేస్తారు. సాయంత్రం కర్మలు అన్నీ పూర్తయ్యాక మాత్రమే భోజనం చేస్తారు. ఈ రోజున దానధర్మాలు చేయడం చాలా ముఖ్యం. పేదవారికి, బ్రాహ్మణులకు అన్నదానం, వస్త్రదానం చేయడం వల్ల గొప్ప పుణ్యం లభిస్తుంది. అలాగే తమకు తోచినంత ధనాన్ని దానం చేయడం కూడా మంచిది. దానాలు చేయడం వల్ల పితృ దోషాలు తొలగిపోతాయని, కుటుంబంలో సుఖసంతోషాలు నెలకొంటాయని నమ్మకం. దానం చిన్నదైనా, దాని ఫలితం చాలా గొప్పగా ఉంటుంది.
పరిశుభ్రత
మహాలయ అమావాస్య నాడు ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా పూజా స్థలాన్ని, వంటగదిని పరిశుభ్రంగా ఉంచాలి. పితృ కార్యాలకు ముందు ఉదయాన్నే ఇంటిని శుభ్రం చేసుకోవడం మంచిది. ఈ రోజున చేసే వంటకాలు కూడా ప్రత్యేకంగా ఉంటాయి. పూర్వీకులకు ఇష్టమైన వంటకాలను వండుతారు. సాధారణంగా ఉల్లి, వెల్లుల్లి లేని సాత్విక ఆహారాన్ని వండి నైవేద్యంగా పెడతారు. ఆహారంలో తీపి, పులుపు, కారం సమపాళ్లలో ఉండేలా చూసుకుంటారు. మహాలయ అమావాస్య రోజున ఎవరినీ నిందించడం, చెడు మాటలు మాట్లాడటం వంటివి చేయకూడదు. ఈ రోజు మొత్తం ప్రశాంతంగా, మంచి ఆలోచనలతో ఉండాలి. పూర్వీకులను స్మరించుకుంటూ, వారి ఆత్మలకు శాంతి కలగాలని కోరుకుంటారు. ఈ నియమాలు పాటించడం వల్ల పూర్వీకుల ఆశీర్వాదం లభించి, కుటుంబం అంతా సుఖసంతోషాలతో ఉంటుందని పండితులు అంటున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు.