/rtv/media/media_files/2025/08/04/cold-feet-2025-08-04-11-41-39.jpg)
Cold Feet
Cold Feet: పాదాలు ఎప్పుడూ చల్లగా ఉంటే జాగ్రత్తగా ఉండాలి. ఇది కేవలం చలి ప్రభావం వల్ల కాకపోవచ్చు.. ఏదైనా ఆరోగ్య సమస్యకు సంకేతం కూడా కావచ్చు. ఈ సమస్య గురించి నిపుణుల అభిప్రాయం ప్రకారం.. చల్లటి గాలి తగలడం వల్ల పాదాలలోని నరాలు సంకోచిస్తాయి. దీని వల్ల రక్త ప్రసరణ తగ్గి పాదాలు చల్లగా అనిపిస్తాయి. అయితే.. రక్త ప్రసరణ సరిగా ఉన్నట్లయితే.. శరీరానికి వెచ్చదనం లభిస్తుంది. రక్త ప్రసరణ తగ్గినప్పుడు ఆక్సిజన్ పాదాల చర్మానికి చేరదు.. అప్పుడు పాదాలు చల్లగా తయారవుతాయి. రక్త ప్రసరణ తగ్గడం వల్ల పాదాలు చల్లగా మారడంతోపాటు.. అవి కొద్దిగా నీలం రంగులో కనిపిస్తాయి. ఇది పాదాలకు సరైన రక్తం అందడం లేదని సూచిస్తుందని నిపుణులు చెబుతున్నారు. పాదాలు చల్లగా ఎందుకు అవుతాయో కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
పాదాలు చల్లగా ఉండటానికి కారణాలు:
థైరాయిడ్: శరీరంలో థైరాయిడ్ (thyroid) హార్మోన్లు తక్కువగా ఉత్పత్తి అయితే.. జీవక్రియ (metabolism) మందగిస్తుంది. దీనివల్ల రక్త ప్రసరణ, గుండె స్పందన, శరీర ఉష్ణోగ్రత అన్నీ దెబ్బతింటాయి. ఈ పరిస్థితిలో పాదాలు చల్లగా ఉంటాయి.
రక్తహీనత:శరీరంలో రక్తం తక్కువగా ఉన్నప్పుడు కూడా పాదాలు చల్లగా ఉంటాయి. ఐరన్, ఫోలేట్ లేదా విటమిన్ B12 లోపం వల్ల ఈ సమస్య మరింత తీవ్రం కావచ్చు. కిడ్నీ వ్యాధులు ఉన్నవారు, డయాలసిస్ చేయించుకుంటున్న వారిలో కూడా ఇలాంటి ఈ సమస్య ఉంటుంది.
నరాల బలహీనత: నరాలు దెబ్బతినడం (Nerve Disorder) లేదా పాదాలలో నొప్పి.. చల్లదనం నిరంతరంగా ఉంటాయి. కిడ్నీ లేదా కాలేయ సంబంధిత వ్యాధులు ఉన్నవారిలో కూడా నరాలు దెబ్బతినే అవకాశం ఉంది. దీనివల్ల పాదాలు చల్లబడతాయని నిపుణులు చెబుతున్నారు.
మానసిక ఒత్తిడి, ఆందోళన: ఎక్కువగా ఒత్తిడి, ఆందోళనలో (Stress and Anxiety) ఉన్నవారిలో పాదాలకు రక్త ప్రసరణ తగ్గుతుంది. వాతావరణం చల్లబడినప్పుడు.. వారి పాదాలు మరింత చల్లగా మారుతాయి. కాబట్టి ఒత్తిడిని అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం.
ఇది కూడా చదవండి: గర్భం ధరించడానికి సరైన సమయం తెలుసా..? ఓవ్యులేషన్‌పై కొత్త విషయాలు మీ కోసం
ఈ సమస్య తగ్గాలంటే నివారణ చర్యలు ఉన్నాయి. పాదాలకు రక్త ప్రసరణ పెంచడానికి తేలికపాటి వ్యాయామాలు చేయాలి. చల్లటి వాతావరణంలో బయటకు వెళ్లినప్పుడు సాక్స్ ధరించాలి. ఈ సమస్య నిరంతరంగా ఉంటే.. మంచి డాక్టర్‌ను సంప్రదించి చికిత్స తీసుకోవడం అవసరం. డాక్టర్లు ఈ సమస్యకు మూల కారణాన్ని గుర్తించి.. సరైన చికిత్సను అందిస్తారు. పాదాలు చల్లగా ఉండటం అనేది కేవలం చలి మాత్రమే కాకుండా.. అంతర్గత ఆరోగ్య సమస్యకు సంకేతం కూడా కాబట్టి.. ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి:వర్షాకాలంలో చెమట వాసనతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ చిట్కాలతో ఉపశమనం