పొలంలో పిడుగుపాటు.. దంపతులు మృతి

పిడుగుపాటుతో భార్యాభర్తలలు ప్రాణాలు కోల్పోయిన ఘటన అనంతపురం జిల్లా పుట్టపర్తి మండలం దిగువగంగంపల్లి తండాలో చోటుచేసుకుంది. పొలంలో పని చేస్తుండగా పిడుగు పడడంతో దసరా నాయక్‌ (51), దేవీబాయి (46) దంపతులతో పాటు వారి రెండు ఆవులు అక్కడికక్కడే మృతి చెందాయి.

Anantapur district
New Update

AP News: ఓ పిడుగు ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. రోజూలా పాలు పిండేందుకు పశువుల దగ్గరికి వెళ్లిన దంపతులు తిరిగిరాలేదు. అనంతపురం జిల్లా పుట్టపర్తి మండలం దిగువగంగంపల్లి తండాలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఆదివారం తెల్లవారుజామున పాలు పితికేందుకు పశువుల దగ్గరకు వెళ్లిన దసరా నాయక్‌ (51), దేవీబాయి (46) దంపతులపై పిడుగు పడింది. కుమారుడికి తీవ్రగాయాలయ్యాయి. కొడుకు, కోడలితో కలిసి వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. తమకున్న పొలంలో మొక్కజొన్న సాగు చేస్తున్నారు. అంతేకాకుండా వీరికి కొన్ని ఆవులు కూడా ఉన్నాయి. 

షెడ్డుపై పిడుగుపడటంతో..

అడవి పందుల బెడద ఎక్కువ కావడంతో ప్రతిరోజూ పొలం దగ్గరే కాపలాగా పడుకునేవారు ఆ దంపతులు. ఉదయం 5 గంటల ప్రాంతంలో ఆవులకు పాలు పిండేందుకు షెడ్డు దగ్గరికి వచ్చారు. తల్లిదండ్రుల రాక ఆలస్యమైందని కుమారుడు జగదీష్‌ కూడా షెడ్డు దగ్గరికి చేరుకున్నాడు. ఇంతలో భారీ వర్షంతో పాటు పిడుగులు పడ్డాయి. ఒక్కసారిగా షెడ్డుపై పిడుగుపడటంతో దసరానాయక్‌, దేవీబాయి అక్కడికక్కడే చనిపోయారు. కుమారుడు జగదీష్‌కు తీవ్రగాయాలయ్యాయి, దీంతో అనంతపురం ఆస్పత్రికి తరలించారు. ఘటనలో లక్షా 50 వేల రూపాయల విలువైన రెండు పాడి ఆవులు కూడా చనిపోయాయి. దంపతుల మృతితో తండాలో విషాదం నెలకొంది.

ఘటనపై కలెక్టర్‌ టీఎస్‌ చేతన స్పందించారు. దంపతుల కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కలెక్టర్‌ ఆదేశాలతో ఆర్డీవో భాగ్యరేఖ, సీఐ శేఖర్‌, తహశీల్దార్‌ మారుతితో పాటు పశుసంవర్థకశాఖ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతి చెందిన వారి కుటుంబానికి రూ.4 లక్షల చొప్పున పరిహారం ఇచ్చేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదన పంపామని, క్షతగాత్రులకు రూ.50 వేలు ఇస్తామని, అలాగే ఒక్కో ఆవుకు రూ.37,500 చొప్పున పరిహారం ఇస్తామని కలెక్టర్‌ అన్నారు.

#ap-news #crime
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe