/rtv/media/media_files/2026/02/07/bird-flu-spread-2026-02-07-17-44-27.jpg)
బర్డ్ ఫ్లూ వార్తలు వినిపించినప్పుడల్లా చికెన్ లవర్స్ గుండెల్లో గుబులు పుడుతుంది. ప్రస్తుతం దేశంలోని తమిళనాడు, బీహార్ వంటి రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ వేగంగా వ్యాపిస్తోంది. వందల సంఖ్యలో కోళ్లు, కాకులు వంటి పక్షుల మరణాలు సంభవిస్తున్నాయి. ఈక్రమంలో చికెన్, గుడ్లు తినడం సురక్షితమేనా? అనే సందేహం నెలకొంది.
చికెన్, గుడ్ల ద్వారా వైరస్ వ్యాపిస్తుందా?
సాధారణంగా బర్డ్ ఫ్లూ వైరస్ (H5N1) సోకిన పక్షులతో నేరుగా సంబంధం ఉన్నప్పుడు లేదా వాటి రెట్టలు, సోంగతో మనుషులకు వ్యాపిస్తుంది. అయితే, బాగా ఉడికించిన చికెన్ లేదా గుడ్లు తినడం ద్వారా ఈ వైరస్ సోకినట్లు ఇప్పటివరకు ఎక్కడా ఆధారాలు లేవు. బర్డ్ ఫ్లూ వైరస్ అధిక ఉష్ణోగ్రతలను తట్టుకోలేదు.
ఇవి పాటించండి..
బర్డ్ ఫ్లూ వైరస్ నాశనం కావాలంటే చికెన్‌ను కనీసం 70°C నుండి 75°C ఉష్ణోగ్రత వద్ద బాగా ఉడికించాలి. మాంసం లోపలి భాగం పింక్ కలర్‌లో లేకుండా, పూర్తిగా తెల్లగా అయ్యేలా చూసుకోవాలి. అలాగే హాఫ్ బాయిల్డ్, పచ్చి కోడిగుడ్లు తినవద్దని డాక్టర్లు సూచిస్తున్నారు. గుడ్డు తినాలంటే అందులోని పచ్చసొన గట్టిపడే వరకు ఉడికించాలి. పచ్చి చికెన్‌ను శుభ్రం చేసిన తర్వాత చేతులను సబ్బుతో కనీసం 20 సెకన్ల పాటు కడుక్కోవాలి. చికెన్ కడిగిన పాత్రలను, కత్తులను వేడి నీటితో శుభ్రం చేయాలి.
లక్షణాలు ఎలా ఉంటాయి?
ఒకవేళ వైరస్ సోకితే సాధారణంగా 2 నుంచి 8 రోజుల తర్వాత లక్షణాలు కనిపిస్తాయి.
తీవ్రమైన జ్వరం, దగ్గు.
గొంతు నొప్పి, కండరాల నొప్పులు.
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది.
కొందరిలో వికారం, వాంతులు కూడా ఉండవచ్చు.
శుభ్రత పాటించే చికెన్ సెంటర్ల నుంచే మాంసం కొనుగోలు చేయాలి. అనారోగ్యంగా ఉన్న కోళ్లను ముట్టుకోవద్దు. పైన పేర్కొన్న విధంగా వంట చేసే పద్ధతుల్లో జాగ్రత్తలు పాటిస్తే, బర్డ్ ఫ్లూ వ్యాపిస్తున్నా.. పౌల్ట్రీ ఉత్పత్తులను నిర్భయంగా తినవచ్చు. అనవసరమైన అపోహలతో భయాందోళనలకు గురికావద్దని పశుసంవర్ధక శాఖ అధికారులు సూచిస్తున్నారు.
Follow Us