Effects Of Eating Too Much Sugar: కొంత మంది స్వీట్లు తినడం విపరీతంగా ఇష్టపడతారు. భోజనాన్ని ఖచ్చితంగా ఏదో ఒక స్వీట్ తో పూర్తి చేయాలనీ అనుకుంటారు. ఇది మాత్రమే కాదు ఖాళీ సమయాల్లో కూడా స్వీట్లు లాగించేస్తుంటారు. అయితే తీపి పదార్థాలు ఎక్కువగా తినడం మంచిది కాదని చెబుతున్నారు నిపుణులు. అధిక మొత్తంలో చక్కర ఉన్న ఆహారాలు తీసుకోవడం అనారోగ్యంతో పాటు త్వరగా వృద్ధాప్యాన్ని కలిగిస్తుంది.
శరీరంలో అధిక చక్కర వల్ల కలిగే దుష్ప్రభావాలు
మధుమేహం
అధిక చక్కెర తీసుకోవడం మధుమేహం (Diabetes) ప్రమాదాన్ని పెంచుతుంది. గ్లూకోజ్ శరీరానికి శక్తి అందించడంలో ప్రధానమైనది. కానీ దాని స్థాయి మోతాదుకు మించి ఉంటే అది ఆరోగ్యానికి హానికరం. అధిక చక్కెర వినియోగం ఇన్సులిన్ సెన్సిటివిటీని తగ్గిస్తుంది. తద్వారా రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. ఇది మధుమేహం ప్రమాదానికి కారణమవుతుంది. రోజువారీ ఆహారంలో చక్కెర మొత్తాన్ని తగ్గించడం ద్వారా గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటిస్ మొదలైన వాటి ప్రమాదాన్ని తగ్గించవచ్చు.
గుండె జబ్బులు
అధిక చక్కెర వినియోగం గుండె జబ్బుల (Heart Disease) ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. ఇది రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడం ద్వారా అనేక గుండె సంబంధిత వ్యాధులకు కారణమవుతుంది.
ముడతలు
అధిక చక్కెర తీసుకోవడం చర్మంపై ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది. అకాల వృద్ధాప్యం కనిపించేలా చేస్తుంది. వాస్తవానికి, శుద్ధి చేసిన చక్కెర శరీరంలో గ్లైకేషన్‌ను పెంచుతుంది. అంటే.. చక్కెర అణువులు చర్మంలోని కొల్లాజెన్, ఎలాస్టిన్ ఫైబర్‌లతో జతచేయబడతాయి. దీని కారణంగా చర్మం ఎలాస్టిన్‌ను కోల్పోవడం ప్రారంభిస్తుంది. ఇది చర్మంపై ముడతలు (Wrinkles), అకాల వృద్ధ్యాప్యానికి కారణమవుతుంది.
ఇన్ఫ్లమేషన్ పెరుగుదల
అతిగా చక్కెర శరీరంలో ఇన్ఫ్లమేటరీ ప్రతిస్పందనను ప్రేరేపిస్తుంది. దీని వల్ల చర్మంలో మంట, వాపు సమస్య తలెత్తుతుంది. ఇది సోరియాసిస్ , తామర వంటి చర్మ వ్యాధుల ప్రమాదాన్ని మరింత పెంచుతుంది.
ఊబకాయం
ఎక్కువ చక్కెర తినడం కూడా ఊబకాయం (Obesity) ప్రమాదాన్ని పెంచుతుంది. వాస్తవానికి, చక్కెరలో అధిక మొత్తంలో కేలరీలు ఉంటాయి. కావున చక్కెరను అధికంగా తీసుకోవడం బరువును పెంచుతుంది. దీని వల్ల గుండె ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
Also Read: Parenting Guide: వయస్సు ప్రకారం పిల్లల స్క్రీన్ టైమ్.. అది మించిందో ప్రమాదమే..!