జీవితంలో కష్టపడి సంపాదించలేని సమయం వృద్ధాప్యం. ఈ సమయంలో ఖర్చులు ఎక్కువ ఆదాయం తక్కువగా ఉంటుంది. రిటైర్‌మెంట్ తర్వాత కూడా ఆర్థికంగా ఒకరిపై ఆధారపడకూడదని చాలా మంది భావిస్తారు. అందుకు ముందు నుంచే కొంత డబ్బులు పొదుపు చేసుకుంటూ వస్తారు. పదవీ విరమణ తర్వాత ఆర్థికంగా స్వతంత్రంగా ఉండటానికి క్రమశిక్షణతో కూడిన పెట్టుబడి ప్రధానం.
రిటైర్‌మెంట్ ప్లానింగ్‌కి సపోర్ట్ చేసే చాలా పథకాలు అందుబాటులో ఉన్నాయి. స్టాక్ ఇన్వెస్ట్‌మెంట్, మ్యూచువల్ ఫండ్స్, యులిప్‌లు, నేషనల్ పెన్షన్ సిస్టమ్, ఫిక్స్‌డ్ డిపాజిట్లు వంటి వాటిల్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. అలానే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అందించే పెన్షన్ పాలసీలు కూడా ఉన్నాయి. మీరు నెలకు రూ.10 వేలపైన పెన్షన్ ఉండటం సురక్షితమని భావిస్తుంటే, మీకో బెస్ట్ పాలసీ అందుబాటులో ఉంది. అదే LIC న్యూ జీవన్ శాంత్, ప్లాన్ నంబర్ 858. ఈ స్కీమ్‌లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి, రూ.10 వేలకు పైగా పెన్షన్ ఎలా అందుకోవాలి? వంటి వివరాలు తెలుసుకుందాం.
LIC న్యూ జీవన్ శాంతి అనేది మీరు ఒకసారి ప్రీమియం చెల్లించి తర్వాత రెగ్యులర్ పేమెంట్స్ పొందే యాన్యుటీ ప్లాన్. మీరు మీ కోసం లేదా మరొకరి కోసం పేమెంట్స్ అందేలా ఎంచుకునే ఆప్షన్ ఉంది. పాలసీని ప్రారంభించినప్పుడు మీరు పొందే మొత్తానికి హామీ ఉంటుంది. పాలసీదారులు జీవించి ఉన్నంత కాలం పేమెంట్స్ పొందుతూనే ఉంటారు. పాలసీ ప్రయోజనాలు స్థిరంగా ఉంటాయి, గ్యారెంటీ ఉంటుంది. కాబట్టి ప్లాన్ పనితీరు ఆధారంగా ఎలాంటి అదనపు బోనస్ లేదా అదనపు ప్రయోజనాలను పొందలేరు. ఇది నాన్ పార్టిసిపేటింగ్ ప్రొడక్టు. దీని కింద డెత్, సర్వైవల్‌కి చెల్లించే ప్రయోజనాలు ఫిక్స్‌డ్‌గా ఉంటాయి.
పాలసీ ఫీచర్లు
LIC న్యూ జీవన్ శాంతి అనేది సింగిల్ ప్రీమియం డిఫర్డ్ యాన్యుటీ ప్లాన్. అంటే మీరు ప్రీమియం మొత్తాన్ని ముందుగా చెల్లించి, ఆ తర్వాత రెగ్యులర్ పేమెంట్స్ స్వీకరించడం ప్రారంభిస్తారు. మీ అవసరాలకు అనుగుణంగా రెండు యాన్యువల్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. మొదటిది సింగిల్ లైఫ్ యాన్యుటీ. మీరు మీ కోసం మాత్రమే యాన్యుటీ పేమెంట్స్ స్వీకరిస్తారు. రెండోది జాయింట్ లైఫ్ యాన్యుటీ.. ఇందులో మీరు మీ కోసం, మరొక వ్యక్తికి (మీ జీవిత భాగస్వామి) యాన్యుటీ పేమెంట్స్ స్వీకరిస్తారు.
యాన్యుటీ పేమెంట్స్ మోడ్‌ను ఎంచుకునే సౌలభ్యం కూడా ఉంది. అవసరాల ఆధారంగా ఇయర్లీ, హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ, మంత్లీ పేమెంట్స్ ఎంచుకోవచ్చు. డెత్ బెనిఫిట్ ఎలా పొందాలో నిర్ణయించుకునే సదుపాయం కూడా ఉంది. లంప్ సమ్ అమౌంట్, యాన్యుటీ పేమెంట్స్ రూపంలో లేదా ఇన్‌స్టాల్‌మెంట్స్‌లో పొందవచ్చు.LIC న్యూ జీవన్ శాంతి ప్లాన్ తీసుకోవాలంటే 30- 79 ఏళ్ల మధ్య ఉండాలి. మినిమం ఇన్వెస్ట్ మెంట్ రూ.1.5 లక్షలు. కొనుగోలు ధర, యాన్యుటీ లేదా ఇతర నిబంధనలపై గరిష్ట పరిమితి లేదు. LIC న్యూ జీవన్ శాంతి ప్లాన్ నుంచి పొందే పెన్షన్ పాలసీదారుడి వయస్సు, పెట్టుబడి పెట్టే మొత్తం, వాయిదా వ్యవధిపై ఆధారపడి ఉంటుంది. 30 ఏళ్ల వయస్సులో ప్లాన్‌ను కొనుగోలు చేసి, 12 ఏళ్ల పాటు యాన్యుటీ చెల్లింపులను వాయిదా వేస్తే, వార్షిక పెన్షన్ రూ.1,32,920 అందుతుంది. నెలకు రూ.10 వేలకు పైగా అందుకోవచ్చు.