గత కొద్ది రోజులుగా దేశ వ్యాప్తంగా జమిలి ఎన్నికలు (Jamili Elections) గురించి చర్చ నడుస్తుంది. జమిలి ఎన్నికల వైపే బీజేపీ(BJP )కూడా మొగ్గు చూపుతుంది. ఈ నేపథ్యంలో లా కమిషన్ కూడా రంగంలోకి దిగింది. తన పని తాను చేసుకుని పోతుంది. ఇటు లోక్ సభ ఎన్నికలతో పాటు రాష్ట్ర ఎన్నికలు కూడా ఒకేసారి జరిగేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలుస్తుంది.లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభలకు 2029 నుంచి ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించేలా ఫార్ములా రూపొందిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
దేశంలోని రాష్ట్రాల అసెంబ్లీల పదవీ కాలాన్ని పొడిగించడం లేక తగ్గించడం ద్వారా లోక్ సభ ఎన్నికలతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించేలా లా కమిషన్ ప్రణాళికలు రూపొందిస్తుందని తెలుస్తుంది. ఇదిలా ఉంటే అసెంబ్లీ, లోక్‌సభ, స్థానికంగా జరిగే ఎన్నికల కోసం ఒకటే ఉమ్మడి ఓటర్ల జాబితా ఉండేలా చూసేందుకు ఒక యంత్రాంగాన్ని రూపొందిస్తున్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
లోక్ సభ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఓటర్లు రెండు ఎన్నికల కోసం ఒక్కసారి కంటే ఎక్కువ సార్లు పోలింగ్ బూత్ కు వెళ్లాల్సి ఉంటుంది. అటువంటి చర్యలు రాకుండా లా కమిషన్ ముందుగానే తన విధివిధానాలు రూపొందిస్తుందని పేర్కొంటున్నాయి. దేశం మొత్తం ఒకేసారి ఎన్నికలు నిర్వహించవచ్చని లా కమిషన్ ఇప్పటికే ఒక అభిప్రాయానికి వచ్చింది.
ఇంత భారీ ప్రజాస్వామ్య ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు అన్ని అవసరమైన ప్రక్రియల గురించి లా కమిషన్ పని చేస్తుందని తెలిపాయి. ప్రస్తుతం లోక్ సభ, అసెంబ్లీలకు కలిపి ఎన్నికల నిర్వహణలో సూచనలు చేయాలని కేంద్రం లా కమిషన్ ను ఆదేశించిన విషయం తెలిసిందే.
వీటితో పాటుగా కొన్ని స్థానిక సంస్థలు కూడా ఎన్నికలు నిర్వహించే విషయంలో సాధ్యాసాధ్యాలపై సిఫార్సులు చేసేందుకు ఇటీవల మాజీ రాష్ట్రపతి కోవింద్ నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.ఒక ఏడాదిలో రెండు దశల్లో మూడు అంచెల ఎన్నికలు నిర్వహించేలా లా కమిషన్ ఒక సిఫారసు చేయోచ్చన్ని కొన్ని వర్గాలు ఇప్పటికే తెలిపాయి.
అటు లోక్ సభతో పాటు రాష్ట్రాల అసెంబ్లీలకు ఏక కాలంలో ఎన్నికలు నిర్వహించే విషయంలో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు లా కమిషన్ 2018 లోనే ఆమోదం తెలిపింది. అప్పటి నుంచి జమిలి ఎన్నికల అంశం లా కమిషన్ వద్ద గత కొన్నేళ్లుగా పెండింగ్ ఉన్నది.