పరిపాలనమీద పెట్టిన దృష్టి పార్టీ మీద పెట్టలేదని, అందుకు తనదే బాధ్యత అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. నియోజకవర్గాల సమీక్ష సమావేశాల్లో భాగంగా తెలంగాణ భవన్‌లో నిర్వహిస్తున్న సమావేశాల్లో శుక్రవారం కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక మీదట ఎమ్మెల్యేల చుట్టూ పార్టీ తిరిగే పరిస్థితి ఉండదని, పార్టీ చుట్టే ఎమ్మెల్యేలు తిరగాలని స్పష్టం చేశారు. పార్టీ ఆదేశాలను ఎవరూ పాటించకపోయినా క్రమశిక్షణ చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఇక మీదట పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తలకు అందుబాటులో ఉంటామని కేటీఆర్ హామీ ఇచ్చారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం వందలాది కార్యక్రమాలు అమలు చేసినప్పటికీ వాటిని రాజకీయ ప్రయోజనాలు, ప్రచారం కోసం ఉపయోగించుకోలేదన్నారు. ఎన్నికల్లో ప్రజలు తప్పుచేశారని అనడం సరికాదని, రెండుసార్లు మనకు అధికారం ఇచ్చింది వారేనన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని కేటీఆర్ అన్నారు. ప్రజలు పార్టీని పూర్తిగా తిరస్కరించలేదని, 14 చోట్ల వందలు, వేల ఓట్ల తేడాతో మన అభ్యర్థులు ఓడిపోయారన్నారు. పదేండ్లలో పార్టీ కార్యకర్తల ఆర్థిక పరిస్థితిని కూడా పట్టించుకోలేదని, దళితబంధు వంటి పథకం కొందరికే రావడంతో మిగిలినవారు వ్యతిరేకమయ్యారయ్యారు. పనులమీదా కంటే ప్రచారం మీదా పోకస్ చేసి ఉంటే మళ్లీ గెలిచేవాళ్లమన్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని సరిగా ఉపయోగించుకోలేకపోయాం. పార్టీ కోసం మొదటినుంచి పనిచేస్తున్న వారికి ఇక మీదట సముచితం స్థానం కల్పిస్తామన్నారు. నియోజకవర్గాల వారిగా పార్టీ నాయకత్వాన్ని బలోపేతం చేసి అనుబంధ సంఘాలను కూడా ప్రోత్సహిస్తామన్నారు. ఎమ్మెల్యేలు ఇక మీదట కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని కోరారు. కార్యకర్తల ఆరోగ్యానికి సంబంధించి అవసరమైన చర్యలు చేపడుతామని, వారిని కాపాడుకుంటామని తెలిపారు.
రైతుబంధు తీసుకున్న సన్నకారు రైతులు సైతం భూస్వాములకు ఇవ్వడాన్ని వ్యతిరేకించారు. దళితబంధు పథకం పై కూడా ఇతర కులాల్లోనూ వ్యతిరేకత కనిపించింది. ప్రజా వ్యతిరేకతను మనం సరిగా అంచనా వేయలేకపోయామన్నారు. కాంగ్రెస్ ప్రచారం చేసిన అబద్ధాల ముందు బీఆర్‌ఎస్ చేసిన అభివృద్ధి ఓడిపోయింది. రాష్ర్టంలో కొత్తగా 6.47 లక్షల రేషన్‌కార్డులు, 46 లక్షల మందికి పింఛన్లు ఇచ్చినప్పటికీ వాటిని ప్రజలకు చెప్పడంలో విఫలమయ్యాం. పార్టీకి స్థానిక సంస్థలు మొదలుకుని అసెంబ్లీ దాకా బలమైన నాయకత్వం ఉంది. కేసీఆర్ లాంటి గొప్ప నాయకుడు పార్టీకి అండగా ఉన్నారు అని కేటీఆర్ భరోసా ఇచ్చారు.
కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చేవరకు బీఆర్ఎస్ పోరాడుతూనే ఉంటుందని కేటీఆర్ స్పష్టం చేశారు. అందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని సూచించారు. కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి పార్టీకి పునర్వైభవం తీసుకురావాలని కోరారు.