Telangana: కొత్త క్రిమినల్ చట్టాలపై మీ వైఖరేంటి? - కేటీఆర్ బహిరంగ లేఖ

దేశంలో అమలులోకి వచ్చిన నూతన న్యాయ చట్టాల పైన రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరి వెల్లడించాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి కేటీఆర్ తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాశారు. వివిధ వర్గాల నుంచి కొత్త న్యాయ చట్టాలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేటీఆర్ ఈ లేఖ రాశారు.

KTR: రాజకీయ కక్షతో రైతులను ఆగం చేయొద్దు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ కీలక సూచన!
New Update

KTR Letter To CM Revanth Reddy: ఇండియాలో అమలులోకి వచ్చిన కొత్త చట్టాలలో ఉన్న పలు నిబంధనలు, సెక్షన్లు ప్రజల ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగించేలా, వ్యక్తి స్వేచ్చను హరించేలా ఉన్నాయని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. నూతన చట్టాల్లో పేర్కొన్న అనేక సెక్షన్ల వల్ల రాష్ట్రంలో పోలీస్ రాజ్యాన్ని తీసుకువచ్చే ప్రమాదం ఉందని.. ఇప్పటికే పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు, కర్నాటక ముఖ్యమంత్రులు ఈ చట్టాల అమలును వ్యతిరేకిస్తున్నారని గుర్తు చేశారు.

నూతన చట్టాల పైన విస్తృతంగా చర్చ జరగాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో వీటిపైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతోపాటు, ఇక్కడి కాంగ్రెస్ పార్టీ తన వైఖరిని వెల్లడి చేయాలి. ప్రజా ఉద్యమాలకు దశాబ్దాలుగా కేరాఫ్ అడ్రస్ గా ఉన్న తెలంగాణ గడ్డ పైన నిరంకుశ నియంతృత్వ నూతన క్రిమినల్ చట్టాలను ఇక్కడ యథాతధంగా అమలు చేయడమే రాష్ట్ర సర్కారు లక్ష్యమా..? లేక తమిళనాడు, కర్నాటక, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల మాదిరిగా సవరణలు తీసుకొస్తారా అనే విషయాన్ని ఈ అసెంబ్లీ సమావేశాల్లో స్పష్టం చేయాలి. ఇప్పటికైనా రేవంత్ సర్కారు వెంటనే తన నిర్ణయాన్ని ప్రకటించాలి. నియంతృత్వ పూరిత సెక్షన్లను సవరించాలని కేంద్ర ప్రభుత్వానికి వెంటనే లేఖ రాయాలి. దీంతోపాటు ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్రం తరఫున ఒక తీర్మానాన్ని కేంద్రానికి పంపించాల’’ అని కేటీఆర్ డిమాండ్ చేశారు.

తెలంగాణ అంటేనే పోరాటాల గడ్డ.. ఉద్యమాల అడ్డ. పౌరహక్కుల పరిరక్షణ కోసం ఎంతటి త్యాగాలకైనా సిద్ధపడే స్వభావం ఉన్న నేల ఇది. ప్రజాస్వామ్య హక్కుల కోసం ఉక్కు పిడికిళ్లు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి. అలాంటి తెలంగాణ రాష్ట్రంలోనూ ఇటీవల కేంద్రం తెచ్చిన చట్టాలతో అలజడి రేగుతోంది. దేశంలో అమలులోకి వచ్చిన నూతన న్యాయ చట్టాల పైన అనేక ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటివరకు అమలులో వున్న పాత చట్టాల స్థానాల్లో కేంద్రం తీసుకొచ్చిన కొత్త నేర చట్టాలు జులై 1, సోమవారం నుంచి దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చాయి. ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ (ఐపిసి), కోడ్‌ ఆఫ్‌ క్రిమినల్‌ ప్రొసీజర్‌ (సి.ఆర్‌.పి.సి), ఇండియన్‌ ఎవిడెన్స్‌ యాక్ట్‌ (ఐ.ఎ.ఎ) స్థానంలో భారతీయ న్యాయసంహిత (బి.ఎన్‌.ఎస్‌), భారతీయ నాగరిక్‌ సురక్షా సంహిత (బి.ఎన్‌.ఎస్‌.ఎస్‌), భారతీయ సాక్ష్య అధినియం (బి.ఎస్‌.ఎ) అమలులోకి వచ్చాయి. అయితే వివిధ వర్గాల నుంచి నూతన చట్టాలపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ చట్టాలలో ఉన్న పలు నిబంధలను, సెక్షన్లు ప్రజల ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగించేలా, వ్యక్తి స్వేచ్చను హరించేలా ఉన్నాయని హక్కుల సంఘాల ప్రజామేధావులు అభిప్రాయపడుతున్నారు..! న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం నిరసనలు.. ఉద్యమాలు చేసే ప్రజలకు ప్రతికూలంగా కొత్త చట్టాలు వున్నాయని.. పోలీసులకు ప్రభుత్వానికి మితి మీరిన అధికారాన్ని కట్టబెడుతున్నాయని సామాజిక ఉద్యమకారులు అందోళన వ్యక్తం చేస్తున్నారు..! ప్రజా స్వామికవాదులు… న్యాయ నిపుణుల మాత్రమే కాదు.. పలు రాష్ట్రాలు కూడా నూతన చట్టాలను వ్యతిరేకిస్తున్నాయి!. పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు, కర్నాటక ముఖ్యమంత్రులు ఈ చట్టాల అమలును వ్యతిరేకిస్తున్నట్టు ప్రకటించారు! తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు, ఇక్కడి కాంగ్రెస్ పార్టీ తన వైఖరి ఏంటో స్పష్టంగా చెప్పలేదు! రేవంత్ రెడ్డి ఈ అంశంలో తన వైఖరిని స్పష్టం చేయాలి..!.

న్యాయ కోవిదులు.. అనుభవజ్ఞులైన క్రిమినల్‌ లాయర్లు, దర్యాప్తు సంస్థలు, న్యాయమూర్తులు, సాధారణ పౌరులతో విస్తృత స్థాయిలో సంప్రదించి వారి అభిప్రాయాలను సేకరించకుండానే ఈ చట్టాలను తొందరపాటుతో తీసుకొచ్చారు. లోక్‌సభ, రాజ్యసభ నుంచి ఏకంగా 146 మంది విపక్ష ఎంపీలను సస్పెండ్‌ చేసి, ఏలాంటి చర్చ లేకుండా ఆమోదించిన చట్టాల అమలు నిలిపివేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఇప్పటికే పలు పిటిషన్లు దాఖలైయ్యాయి. మా పార్టీ సీనియర్ నాయకులు, మాజీ యంపి ఈ చట్టాల అమలు నిలిపి వేయాలని సుప్రీం కోర్టులో కేసు వేశారు.

ఈచట్టాలలో ఉన్న పలు నిబంధలను, సెక్షన్లు అత్యంత దారుణంగా ప్రజల హక్కులను, స్వేచ్చను హరించేలా ఉన్నాయి. ఈ చట్టాల ప్రకారం నిందితులకు బెయిలిచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గిపోతాయి, పోలీసులకు, ప్రభుత్వానికి విపరీతమైన అధికారాలు సంక్రమిస్తాయి. ఇందులో పౌరుల హక్కులకు హాని కలిగించే కొన్ని ముఖ్యమైన అంశాలను ఇక్కడ ప్రస్తావిస్తున్నాను.

* ఈ చట్టాల ప్రకారం ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా నిరాహార దీక్ష చేయడం ఈ కొత్త చట్టం ప్రకారం నేరం. ఇది అత్యంత దురదృష్టకరం. ఈ చట్టం ప్రజల హక్కుల కోసం పోరాటం చేసే పౌరుల ప్రమాదకారిగా మారుతుంది.
* గతంలో ఉన్న 15 రోజుల పోలీసు కస్టడీ ఇప్పుడు 90 రోజులకు పెంచడం జరిగింది. ఈ తొంబై రోజు గడువును ఉపయోగించుకుని ఎన్ని సార్లయిన కస్టడీలోకి తీసుకునే అవకాశం కల్పిస్తుంది. ఈ కస్టడీని ఒకే దఫాలో కానీ పలు దఫాలలో గానీ అమలు పరచవచ్చు. తద్వారా నిందితుడికి న్యాయస్థానం బెయిల్‌ మంజూరు చేసినా కూడా పోలీసులు కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉంటుంది.
* క్రిమినల్ కేసులో ఉన్న నిందితుల ఆస్తులను జప్తు చేయడానికి కోర్టు అనుమతి అవసరం ఉండేది. అయితే కొత్త చట్టంలో పోలీసులకు పూర్తి అనుమతి లభించింది.
* వ్యవస్థీకృత నేరాలకు వ్యక్తులను ప్రాసిక్యూట్ చేయడానికి దర్యాప్తు సంస్థలకు ఏకపక్ష మరియు విచక్షణ అధికారాలను కొత్త చట్టం అనుమతిస్తుంది.
* జాతీయ భావాలను ప్రభావితం చేసే నేరాలకు 3 సంవత్సరాల జైలు శిక్ష, జరిమానా. సైబర్ నేరాలు, హ్యాకింగ్, ఆర్థిక నేరాలు, గోప్యత మరియు సాంకేతికత ద్వారా విధ్వంసం వంటి వాటి కోసం రూపొందించిన ప్రత్యేక అధ్యాయంలో అనేక అస్పష్టతలున్నాయి.
* కొత్త చట్టాల అమలుకు ముందు (2024 జులై 1వ తేదీకి ముందు) జరిగిన నేరాలను ఐపిసి తదితర పాత చట్టాల ప్రకారం విచారించాల్సి ఉంటుంది. తర్వత నమోదు అయ్యే కేసులను నూతన చట్టాల ప్రకారం విచారణ చేయాల్సి వస్తుంది. ఇది అందరినీ అయోమయంలో నెడుతున్నది.
* ‘స్వాతంత్య్రోద్యమంలో నాటి జాతీయ నాయకులను జైళ్లలో పెట్టడానికి బ్రిటిష్‌ ప్రభుత్వం ఉపయోగించిన ‘రాజద్రోహ’ చట్టం అమలును సుప్రీంకోర్టు 2022లో నిలిపివేసింది. ఈ చట్టంపై సమీక్ష జరుపుతామని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. కానీ, కొత్త చట్టంలో తిరిగి ‘రాజ ద్రోహం’ చట్టాన్ని ‘దేశ ద్రోహం’ పేరుతో తీసుకొచ్చింది. ప్రభుత్వ విధానాలను విమర్శించడానికి ప్రజలకు ఉన్న హక్కును కాలరాసేందుకే ఈ చట్టం ఉపయోగపడుతుందన్న విమర్శలున్నాయి.

నూతన చట్టాల పైన విస్తృతంగా చర్చ జరగాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో వీటిపైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతోపాటు, ఇక్కడి కాంగ్రెస్ పార్టీ తన వైఖరిని వెల్లడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది’’ అని కేటీఆర్ లేఖ రాశారు.

Also Read:Bengaluru: లైంగిక వేధింపుల కేసులో సూరజ్ రేవణ్ణకు బెయిల్

#ktr #cm-revanth-reddy #letter #new-laws
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe