Telangana: భారీ వర్షాల దృష్ట్యా.. అధికారులంతా అప్రమత్తంగా ఉండాలి

రాష్ట్రంలో అకాల వర్షాలు కురుస్తున్న దృష్ట్యా.. రాష్ట్ర రహదారుల అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అధికారులను ఆదేశించారు.వర్షాలవల్ల దెబ్బతింటున్న రహదారుల వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని అత్యవసర సమావేశం నిర్వహించారు.

New Update
Telangana: భారీ వర్షాల దృష్ట్యా.. అధికారులంతా అప్రమత్తంగా ఉండాలి

Hyderabad : రాష్ట్రంలో అకాల వర్షాలు(Sudden Rains) కురుస్తున్న దృష్ట్యా.. రాష్ట్ర రహదారుల అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy Venkat Reddy) అధికారులను ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో వర్షాలవల్ల దెబ్బతింటున్న రహదారుల వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని అత్యవసర సమావేశం నిర్వహించిన మంత్రి అధికారులకు పలు సూచనలు చేశారు. టీఆర్&బి స్పెషల్ సెక్రెటరీ విజయేందిరబోయి, ఈఎన్సీ ఐ. గణపతిరెడ్డి, రీజినల్ ఆఫీసర్, NHAI(National Highways authority of India) రీజినల్ ఆఫీసర్ రజాక్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో వర్షాల వల్ల రోడ్లు దెబ్బతిని ప్రజలు ఇబ్బందులు పడకుండా ముందస్తుగా తీసుకోవల్సిన అత్యవసర చర్యపై చర్చించారు.

హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారులపై నిత్యం జరుగుతున్న ప్రమాదాల వల్ల అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నందున తగు చర్యలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ఈ రహదారిపై 17 బ్లాక్ స్పాట్స్ లను గుర్తించినందున.. వాటివద్ద తగు చర్యలు చేపట్టి ప్రమాదాలు అరికట్టాలని ఆధికారులకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సూచించారు.

అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ఇతర జాతీయ రహదారుల నిర్మాణ పనుల స్థితిగతులపై NHAI (National Highways authority of India), రాష్ట్ర రహదారుల శాఖ అధికారులను మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రీజినల్ రింగ్ రోడ్డు కు సంబంధించిన పనులను వేగవంతం చేయాలని అధికారులను కోరారు.

“రీజినల్ రింగ్ రోడ్డు” ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం 2021లో మంజూరీ చేసినప్పటికి.. ఇప్పటికీ నిర్మాణం మొదలుకాకపోవడం వల్ల రాష్ట్రం అభివృద్ధికి నోచుకోలేకపోయిందని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో సగ భాగం ఆవరించి ఉండే రీజినల్ రింగ్ రోడ్డు లాంటి ప్రతిష్టాత్మకమైన నిర్మాణాల్లో ఎలాంటి అలసత్వం లేకుండా పనిచేస్తే రాష్ట్రం అభివృద్ధి బాటపడుతుందని అన్నారు. యుటిలిటీ ఛార్జీలు చెల్లించమని గతప్రభుత్వం లేఖ రాసినందువల్ల ప్రాజెక్టు ఆగిపోయే ప్రమాదం ఏర్పడితే తాను, ముఖ్యమంత్రి స్వయంగా 363.43 కోట్ల రూపాయల యుటిలిటీ ఛార్జీలను చెల్లిస్తామని కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ ని, ప్రధాని నరేంద్ర మోదీ ని కలిసి లేఖ ఇవ్వడంతో పాటు.. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని వివరిస్తే.. తామే (కేంద్ర ప్రభుత్వమే) యుటిలిటీ ఛార్జీలను చెల్లిస్తామని గడ్కరీ ఆమోదం తెలిపారని ఈ సందర్భంగా మంత్రి అన్నారు.

“రీజినల్ రింగ్ రోడ్డు” ను NHAI (National Highways authority of India) ఉత్తర భాగానికి 161 కిలోమీటర్లు, దక్షిణ భాగానికి 190 కిలోమీటర్లు.. మొత్తంగా 351 కిలోమీటర్లుగా మంజూరీ చేసింది. ప్రస్తుతం పనులు జరుగుతున్న ఉత్తర భాగం సంగారెడ్డి జిల్లా గిర్మాపూర్ గ్రామం (తిమ్మాపూర్) నుంచి ప్రారంభమై.. చౌటుప్పల్ వద్ద దక్షిణ భాగానికి కలుస్తుంది. ఈ ఉత్తర భాగం నిర్మాణం కొరకు (6) ప్యాకెజీలుగా విభజించి భూసేకరణ చేస్తున్న ఈ ప్రక్రియలో ఇప్పటికే దాదాపు 70 శాతం భూసేకరణ పూర్తయ్యిందని, మిగితా 30 శాతం పురోగతిలో ఉందని మంత్రికి అధికారులు వివరించారు. మిగిలిన ఈ 30 శాతంలో నర్సాపూర్ పరిధిలో అటవీశాఖకు సంబంధించిన అంశాలతో పాటు ఇతర ప్రాంతాల్లో కొన్నిచోట్ల కోర్టు కేసు వివాదాలతో ఉన్న భూవివాదం కారణంగా భూసేకరణ ఆలస్యం జరిగిందని మంత్రికి వివరించారు.

హైదరాబాద్ – విజయవాడ (NH-65) జాతీయ రహదారిపై ఉన్న 17 బ్లాక్ స్పాట్స్ కారణంగా రోజు పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారని ఆయన తెలిపారు. రోడ్లపై ఉన్న బ్లాక్ స్పాటను రిపేర్లు చేయాలంటే.. ప్రత్యామ్నాయ రోడ్డు సదుపాయం కల్పించి ప్రయాణికులకు ఏలాంటి అసౌకర్యం లేకుండా ఏర్పాటు చేసి పనులు చేయాలని అధికారులను మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆదేశించారు.

బ్లాక్ స్పాట్ ప్రాంతాల్లో ఏదైనా పని చేసే విషయంలో లోటుపాట్లు ఉంటే.. స్పెషల్ సెక్రటరీగారి దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు. ఒకవైపు మనుషుల ప్రాణాలు పోతుంటే.. అధికారిక అనుమతుల పేరిట ఆలస్యం చేస్తే మరింత మంది ప్రాణాలు పోతాయని అన్నారు.

అంతేకాదు బ్లాక్ స్పాట్ ప్రాంతాల్లో ప్రమాద సూచీకల ఏర్పాటు, అతివేగం కట్టడికి తీసుకోవల్సిన చర్యలు, అవసరం ఉన్నచోట ఆరు లేన్లుగా రోడ్డు విస్తరణ, జంక్షన్ ల అభివృద్ధి, VUP (వెహికిల్ అండర్ పాస్) ల నిర్మాణం, రెండు వైపుల సర్వీస్ రోడ్ల ఏర్పాటు వంటి చర్యలతో బ్లాక్ స్పాట్స్ ప్రాంతాల్లో ప్రమాదాలను నివారించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు.

Also read: జేఎంఎం కీలక నిర్ణయం.. పార్టీ నుంచి సీతా సొరెన్ ఆరేళ్లు బహిష్కరణ!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు