ఖమ్మం జిల్లాలో అధికార బీఆర్ఎస్ పార్టీకి (BRS Party) మరో షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది హస్తం పార్టీ. బీఆర్ఎస్ కీలక నేతల, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణతో కాంగ్రెస్ నేతల చర్చలు సఫలమైనట్లు తెలుస్తోంది. దీంతో ఆయన కాంగ్రెస్ (Telangana Congress) కండువా కప్పుకోవడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి బాలసాని లక్ష్మీనారాయణ రాజీనామా చేశారు. భద్రాచలం ఇన్చార్జిగా బాలసాని లక్ష్మీనారాయణను గతంలో నియమించింది.
అయితే.. టికెట్లను ప్రకటించిన సమయంలో ఆయన అభిప్రాయాన్ని పట్టించుకోకుండా తెల్లం వెంకట్రావుకు ఇచ్చారని ఆయన కొన్నాళ్లుగా అసంతృప్తిగా గున్నారు. దీంతో పాటు భద్రాచలం బీఆర్ఎస్ బాధ్యతల నుంచి కూడా ఆయనను తప్పించి ఎమ్మెల్సీ తాతా మధుకు అప్పగించింది బీఆర్ఎస్ హైకమాండ్. దీంతో ఆయన పార్టీ తీరుపై తీవ్ర ఆవేదనతో ఉన్నారు.
ఇది కూడా చదవండి: T-Congress First List: నాగంతో పాటు ఆ మాజీ మంత్రులకు కాంగ్రెస్ షాక్.. టికెట్ దక్కని కీలక నేతలు వీరే!
ఈ నేపథ్యంలో బాలసాని పార్టీని వీడాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. మరికొద్ది సేపట్లో బాలసాని ఇంటికి జిల్లా కీలక నేతలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్ముల నాగేశ్వరరావు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ రోజు లేదా రేపు బాలసాని కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది. అయితే.. ఆయన చేరిక ఢిల్లీలో ఉంటుందా? లేదా గాంధీ భవన్ లో ఉంటుందా? అన్న అంశంపై ఇంకా క్లారిటీ లేదు.
బాలసాని లక్ష్మీనారాయణ టీడీపీలో ఉన్న నాటి నుంచి మాజీ మంత్రి తుమ్మలతో సన్నిహితంగా ఉండేవారు. ఆ పార్టీ నుంచి ఖమ్మం ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందారు. తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల్లో తుమ్మల నాగేశ్వరరావుతో పాటు టీఆర్ఎస్ లో చేరారు. అనంతరం నాటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సహకారంతో స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గెలుపొందారు. తుమ్మల బీఆర్ఎస్ ను వీడిన సమయంలోనే బాలసాని కూడా పార్టీని వీడుతారని అంతా భావించారు. కానీ ఆసమయంలో బీఆర్ఎస్ లోనే ఉన్న బాలసాని.. ప్రస్తుతం ఆ పార్టీని వీడి మళ్లీ తుమ్మల చెంతకే చేరనున్నారు.