సాధారణంగా కొంతమంది బిడ్డకు బాలసార సమయంలో.. పురోహితుడు సలహా తీసుకుని పేర్లు పెడుతుంటారు. అయితే పుట్టిన పిల్లలకు పేరు పెట్టేటప్పుడు అందమైన, అర్థవంతమైన, ప్రత్యేకమైన పేరు పెట్టాలని ప్రతి తల్లిదండ్రులు ఆలోచిస్తారు. దాని కోసం ఎంతో రిసెర్చ్ చేసి ఓ పేరును ఫైనల్ చేస్తారు. తర్వాత నామకరణ మహోత్సవాన్ని ఘనంగా చేస్తారు. ఇలాంటి కల ఓ తల్లిదండ్రులకు ఆ అదృష్టం దక్కలేదు. మూడేళ్లు వచ్చినా చిన్నారికి పేరు పెట్టే విషయంలో ఏకాభిప్రాయం కుదరలేదు. చివరకు కోర్టు ఆ పాపకు పేరును ఖరారు చేసింది.
జంట మధ్య వివాదం
కేరళకు చెందిన ఓ జంటకు మూడేళ్ల కిందట పాప పుట్టింది. అప్పటికే వారి మధ్య మనస్పర్థలు వచ్చి వేర్వేరుగా ఉన్నారు. అయితే మరల పాపకు పేరు పెట్టే విషయంలోనూ మళ్లీ వివాదం వచ్చింది. ఇద్దరూ ఏకాభిప్రాయానికి రాక చివరకు విషయం న్యాయస్థానంకు చేరింది. ఈ దంపతులకు 2020 ఫిబ్రవరిలో పాప పుట్టింది. అభిప్రాయబేధాలతో ఆ చిన్నారి తల్లి దగ్గరే ఉంటోంది. చిన్నారి బర్త్ సర్టిఫికెట్‌లో పేరు లేకపోవడంతో తల్లి పేరు నమోదు చేసేందుకు ప్రయత్నించారు.
ఇరువురి పేర్లు కలిసేలా పేరు
అయితే, పేరు నమోదుచేయాలంటే తల్లిదండ్రులిద్దరూ హాజరు కావాలని అధికారులు చెప్పారు. దీంతో వివాదం మొదలైంది. తల్లి ‘పుణ్య నాయర్’ అనే పేరు పెడితే.. తండ్రి ‘పద్మ నాయర్’ అనే పేరు పెట్టారు. ఈ విషయంలో దంపతులు పట్టువీడకపోవడంతో చిన్నారి తల్లి కేరళ హైకోర్టును ఆశ్రయించగా.. జస్టిస్ బెచు కురియన్ థామస్ ఈ కేసు విచారించారు. కోర్టు అధికార పరిధిని వినియోగించుకొని తల్లితంద్రుల పేరునూ జత చేసి, చిన్నారికి ఓ పేరు ఖరారు చేసి సమస్యను పరిష్కరించారు.
పుణ్య బాలగంగాధరన్ నాయర్ గా పేరు
అయితే.. తల్లిదండ్రుల మధ్య వివాదాన్ని పరిష్కరించడానికి టైం పడుతోందని.. ఈలోగా పేరు లేకపోవడం పిల్లల ప్రయోజనాలకు అనుకూలంగా ఉండదని న్యాయమూర్తి పేర్కొన్నారు. తల్లిదండ్రుల హక్కులు కాకుండా కోర్టు అధికార పరిధిని అమలు చేయడంలో పిల్లల సంక్షేమమే ముఖ్యమైంది. ఈ విషయంలో కోర్టు తన అధికార పరిధిని ఉపయోగించవలసి వచ్చిందని తెలిపారు. పాపకు తల్లిదండ్రులు పేర్లు కలిసొచ్చేలా ‘పుణ్య బాలగంగాధరన్ నాయర్’ అనే పేరు పెట్టారు. పిల్లల శ్రేయస్సు అంతిమ లక్ష్యం అన్నారు. పేరు విషయంలో పిల్లల సంక్షేమం, సాంస్కృతిక పరిగణనలు, తల్లిదండ్రుల ఆసక్తులు, సామాజిక నిబంధనలు వంటి అంశాలను కోర్టు పరిగణనలోకి తీసుకోవచ్చు అన్నారు. కోర్టు మొత్తం పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని పేరును స్వీకరించాలన్నారు.