దళితులకు ఇచ్చిన అసైన్డ్ భూమిని ప్రభుత్వం కబ్జా చేయాలని చూస్తోందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్‌పేటలో ఈటల రాజేందర్ పర్యటించారు. పోలీసులు అరెస్ట్ చేసిన దళితులను పరామర్శించారు. కేసీఆర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఈటల.. సీఎం అసైన్డ్ భూములను ఆక్రమించుకోవడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు.బడంగ్‌పేటలో గత ప్రభుత్వం దళితులకు 42 ఎకరాల అసైన్డ్ భూమిని ఇచ్చిందని గుర్తు చేశారు. కానీ బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆ భూమిలో 24 ఎకరాలు ప్రభుత్వ ఆఫీస్‌లకు కేటాయించినట్లు తెలిపారు. మిగిలిన 16 ఎకరాలల్లో దళితులు వ్యవసాయం చేసుకుంటున్నారన్నారు. ఎప్పటిలాగే దళితులు పొలం దున్నుకోవడానికి తమకు కేటాయించిన అసైన్డ్ భూమి వద్దకు వెళ్తే పోలీసులు వారిని అడ్డుకున్నారన్నారు. మా భూమిల్లోకి మేము వెళ్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించిన వారిని ఎలా అరెస్ట్ చేస్తారన్నారు
ప్రశ్నించిన వారిని అరెస్ట్ చేయాలని రాజ్యాంగంలో రాసుందా అన్నారు. సీఎం కింద పోలీసులు కుక్కల్లా పని చేస్తున్నారని ఈటల ఘాటు వ్యాఖ్యలు చేశారు. దళిత వర్గానికి చెందిన రైతులు గత 12 సంవత్సరాలుగా అసైన్డ్ భూముల్లో వ్యవసాయం చేసుకుంటున్నారని, ఆ భూమిపై వారికే హక్కు కల్పించాలని ఈటల డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో దళితులకు మూడు ఎకరాల భూమిని ఇస్తానని హామి ఇచ్చిన కేసీఆర్.. వారికి భూమిని ఇవ్వకపోగా ఉన్న భూమిని లాక్కోవడం ప్రారంభించారని విమర్శించారు. రైతుల భూములను లాక్కోవడానికి ఇది కేసీఆర్ అబ్బ జాగిరి కాదని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
సీఎం రియల్ ఎస్టేట్ బ్రోకర్‌లా తయారయ్యారని ఈటల రాజేందర్ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. కేసీఆర్ రైతుబంధు, ఉచిత విద్యుత్ పేరుతో అవినీతికి పాల్పడుతున్నారన్నారు. కేసీఆర్ ఆగడాలని దళితులు చూస్తే ఊరుకోరని యావత్ దళిత జాతి ఆ ఊరికి అండగా ఉంటుందని బీజేపీ ఎమ్మెల్యే హెచ్చరించారు. హైదరాబాద్ నగరంలో గతంలో వందల సంఖ్యలో చెరువులు ఉండేవని, ప్రస్తుతం ఆ చెరువులు ఏమయ్యాయని, కోకాపేటలో ప్రభుత్వ భూమిని తక్కువ ధరకు ఎందుకు అమ్మారని, ప్రభుత్వ భూమిల్లో ప్రైవేట్ సంస్థలు ఎందుకు ఏర్పడుతున్నాయని ఈటల రాజేందర్ ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక దోపిడి జరుగుతున్నాకేసీఆర్ ఎందుకు పట్టించుకోవడంలేదని మండిపడ్డారు.
రాష్ట్ర ప్రజలు ఎన్నికలు ఎప్పుడు వస్తాయా..? నెత్తి మీద ఉన్న కుంపటి ఎప్పుడు దించుదామా అని ఎదురు చూస్తున్నారన్నారు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని చూస్తున్న కేసీఆర్ ముందు రాష్ట్రంలో ఉన్న సమస్యలను చూసుకుంటే మంచిదని హితువు పలికారు. కేసీఆర్ నియంత పోకడలను, అవినీతిని ప్రజలు గమనిస్తున్నారని వచ్చే ఎన్నికల్లో ప్రజలే బీఆర్‌ఎస్‌ను బంగాళాఖాతంలో పడేస్తారని జోస్యం చెప్పారు.