కేరళలోని వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ఘటన సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు 358 మంది మృతి చెందారు. తీవ్ర విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్న బాధితులను ఆదుకునేందుకు పలువురు సాయం చేస్తున్నారు. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు, రాజకీయ నేతలు కేరళ సీఎం డిజాస్టర్ రిలీఫ్ ఫండ్‌కు విరాళాలు అందించారు. ఈ క్రమంలోనే తాజాగా కర్ణాటక ప్రభుత్వం.. కేరళకు సాయం చేసేందుకు ముందుకొచ్చింది. కొండచరియలు విరిగిపడి ఇళ్లు కోల్పోయిన బాధితుల కోసం 100 ఇళ్లు నిర్మిస్తామని ప్రకటన చేసింది. ఈ మేరకు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఎక్స్ వేదికగా వెల్లడించారు.
కర్ణాటక ప్రభుత్వం సాయం చేసేందుకు ముందుకు రావడంపై విపక్ష నేత రాహుల్ గాంధీ హర్షం వ్యక్తం చేశారు. వయానాడ్ ఇలాంటి దుర్భర పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో బాధితులకు అండగా నిలవడంపై కృతజ్ఞతలు తెలిపారు. అలాగే వయనాడ్‌కు ఇప్పుడు భారతీయుల సంఘీభావం అవసరం ఉందని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
మరోవైపు సినీతారలు నయనతార – విఘ్నేశ్ దంపుతులు రూ.20 లక్షలు, విక్రమ్ రూ.20 లక్షలు, హీరో సూర్య, జ్యోతిక, హీరో కార్తి కలిసి సంయుక్తంగా కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.50 లక్షలను విరాళం అందించారు. అలాగే మళయాల నటులు మమ్ముట్టి, ఆయన కొడుకు దుల్కర్ సల్మాన్ కలిసి రూ.35 లక్షలు, రూ.25లక్షలు, ఫహాద్ ఫాజిల్ రూ.25 లక్షలు, రష్మిక ర.10 లక్షలు విరాళం అందించారు.