ఉత్తరప్రదేశ్‌లో కాన్పూర్ జిల్లాలోని గంగా ఘాట్‌లో ఓ పెద్ద మొసలి కనిపించడం కలకలం రేపింది. దీంతో ఆ ఘాట్‌లోకి దిగడానికి భక్తులు భయపడ్డారు. అక్కడ ఉండే మత్స్యకారులు ఎట్టకేలకు ఆ మొసలిని బంధించారు. ఆ తర్వాత ఆలయంలోకి తీసుకెళ్లి ఆ మొసలికి పూజలు కూడా చేశారు. మరికొందరైతే ఆ మొసలితో సెల్ఫీలు తీసుకునేందుకు ఎగబడ్డారు. గంగానదిలోని భైరవ్ ఘాట్ వద్ద ఈ మొసలి కనిపించడంతో భక్తులు ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు.
Also Read: 347 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. దరఖాస్తు చివరితేదీ ఇదే
మొసలికి పూజలు
మొసలి కనిపించడంతో ముందుగా అక్కడున్న వారు అటవీశాఖ సిబ్బందికి సమాచాం అందించారు. కానీ వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో.. ఇక చివరికి మత్స్యకారులే ఆ మొసలిని పట్టుకున్నారు. ఆ తర్వాత దాన్ని ఆలయంలోకి తీసుకెళ్లారు. దీంతో ఆ మొసలిని చూసేందుకు పెద్ద సంఖ్యలో జనం అక్కడున్న గుడికి వచ్చారు. కొందరు భక్తులు ఆ మొసలికి బొట్టు పెట్టి.. హారతి ఇచ్చి పూజలు చేశారు. మరికొందరైతే సెల్ఫీలు తీసుకున్నారు.
వీడియోలు వైరల్
అయితే ఈ విషయం పోలీసులకు కూడా తెలియడంతో వారు కూడా అటవీ శాఖ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. చాలా సేపటి తర్వాత అటవీ శాఖ సిబ్బంది వచ్చి ఆ మొసలిని తీసుకెళ్లారు. సురక్షితమైన నదీ జలాల్లో దాన్ని విడిచిపెడతామని చెప్పారు. గంగా నది ఘాట్‌లో ఈ మెసలికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. నెటీజన్లు విభిన్న రీతిలో స్పందిస్తున్నారు.
Also Read: ఒకరోజు జ్యుడీషియల్ కస్టడీకి హేమంత్ సోరెన్..రిమాండ్ పై నిర్ణయం ఎప్పుడంటే..?