సీఎం జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ నేత కాలవ శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో, రాయలసీమకు నీటి వనరులు కల్పించడంలో ఘోరంగా విఫలమయ్యారని మండిపడ్డారు. జగన్ పాలనలో రాయలసీమకు ఎవరూ ఊహించని విధంగా నష్టం జరుగుతోందన్న ఆయన.. జగన్ రాయలసీమ అభివృద్ధిని పట్టించుకోవడం లేదని విమర్శించారు. కృష్ణా జలాల విషయంలో ఏపీ సీఎం రాయలసీమకు అన్యాయం చేశారని కాలవ శ్రీనివాసులు ఆవేదన వ్యక్తం చేశారు. అంతే కాకుండా జగన్ వల్ల బ్రిజేష్ కుమార్ తీర్పులో ఎక్కువ అన్యాయం జరిగే ప్రమాదం ఉందన్నారు.
ఆనాడు రాజశేఖర్ రెడ్డి మరణ శాసనం రాస్తే.. నేడు జగన్ మోహన్ రెడ్డి లాలూచీ కారణంగా ఆంధ్రప్రదేశ్, రాయలసీమ హక్కులు కాలరాయబడుతున్నాయని కాలవ శ్రీనివాసులు ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం జగన్ కేంద్రం పెద్దల కాళ్లు పట్టుకొని రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాయలసీమకు భవిష్యత్తులో సాగు, తాగునీటి కష్టాలు వస్తాయన్న ఆయన దానిపై సీఎం జగన్ సమాధానం చెప్పాలన్నారు. జగన్ స్వార్థం కోసం రాయలసీమ భవిష్యత్తు తాకట్టుపెట్టారని విమర్శించారు.
గత 5 ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ప్రాజెక్టులు నిర్మించలేదని టీడీపీ నేత కాలవ శ్రీనివాసులు ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు విషయంపై మంత్రి అంబటి రాంబాబు అర్దంలేని మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఆనాడు చంద్రబాబు నాయుడు నిర్మించిన ప్రాజెక్టులు గతంలో ఎలా ఉన్నాయో ఇప్పుడు కూడా అలానే ఉన్నాయన్నారు. జగన్ మోహన్ రెడ్డి రాయలసీమకు అన్యాయం చేస్తున్నారన్న ఆయన.. సీమ ప్రజలకు సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.