Kaleshwaram Project : మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు, అన్నారం, సుందిళ్ళ యారేజీలలో సీపేజీలు బయటపడ్డ నేపథ్యంలో దీనిపై విచారణ చేసేందుకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌ను ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. విచారణలో భాగంగా సుమారు 50 మందికి పైగా ఇంజినీర్లు, ఐఏఎస్ అధికారులు, గుత్తేదారుల నుంచి అఫిడవిట్లు తీసుకొన్న కమిషన్, బుధవారం నుంచి క్రాస్ ఎగ్జామినేషన్‌ను ప్రారంభించింది. దీని మీద విచారణ ప్రారంభించిన కమిషన్ ముందు అనేక విషయాలు వెలుగు చూస్తున్నాయి. విచారణలో భాగంగా పీసీ ఘోష్ కమిషన్ ముందు ఈరోజు మాజీ ఈఎన్సీ మురళీధర్, సీడీవో మాజీ ఈఎన్సీ నరేంద్ర రెడ్డి హాజరయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో చాలా తప్పులు జరిగాయని వీరిద్దరూ ఒప్పుకున్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో ఉన్నప్పుడే తప్పిదాలు జరిగాయని చెప్పారు.
నాణ్యత ధ్రవీకరణలో లోపాలు, పని పూర్తవ్వకుండానే అయినట్టు సర్టిఫికేట్లు ఇవ్వడం, ఇంజినీర్లు చెప్పిన డిజైన్లలో మార్పుల..ఇందులో ప్రభుత్వ జోక్యం లాంటి విషయాలను మాజీ ఈఎన్సీలు కమిషన్ విచారణలో తెలిపారు. ఇంజినీర్లు తయారు చేసిన డిజైన్లకు ఆమోదం తెలిపేది ప్రభుత్వమేనని చెప్పారు ఈఎన్సీ మురళీధర్. ప్రభుత్వంలో ఉన్నత స్థాయిలో ఈ ఆమోదాలుంటాయని చెప్పారు. ప్రాజెక్టులను 15 రోజులకొకసారి అయినా నాణ్యతా తనిఖీలు చేయాలి. రెగ్యులర్‌గా తనిఖీలు చేసి లోపాలుంటే నివేదించాల్సి ఉంటుంది. కానీ కాళేశ్వరం విషయంలో ఇవేమీ జరగలేదని అన్నారు మురళీధర్.
కాళేశ్వరం డిజైన్లు, డ్రాయింగులను తాను మొదట అప్రూవ్ చేయలేదని కమిషన్ విచారణలో సీడీవో మాజీ ఈఎన్సీ నరేంద్ర రెడ్డి చెప్పారు. తరువాత కేసీఆర్, హరీష్ రావు , ఉన్నతాధికారుల ఒత్తిడితో సంతకం చేశానని తెలిపారు. త్వరగా చేయాలన్న ఒత్తిడి వల్ల హడావుడిగా అన్నీ అప్రూవల్ చేశామన్నారు. మేడిగడ్డ ప్రతి డిజైన్‌లో సీడీవోతో పాటు ఎల్‌అండ్‌టీ సంస్థ పాల్గొందని తెలిపారు. ఇదే ప్రెషర్ వలన క్వాలిటీ కంట్రోల్‌ను కూడా సరిగ్గా చేయలేదని ఒప్పుకున్నారు నరేంద్ర రెడ్డి. బ్యారేజీ నిర్వహణ, గేట్ల ఆపరేషన్ సరిగా చేయలేదని చెప్పారు.
Also Read: Andhra Pradesh: ఛత్తీస్‌ఘడ్ జర్నలిస్టులపై కేసును పున:పరిశీలించాలి–హోంమంత్రి అనిత