KCR : కాళేశ్వరం ప్రాజెక్ట్ కు(Kaleshwaram Project) సంబంధించి వివిధ బ్యారేజ్ ల నిర్మాణాల్లో అవకతవకలు, మేడిగడ్డ బ్యారేజ్(Medigadda Barrage) కుంగడం తదితర అంశాలపై విచారణ కోసం ఏర్పాటు చేసిన జస్టిస్ చంద్ర గోష్(Chandra Gosh) కమిషన్ పని ప్రారంభించింది. ఈ రోజు జస్టిస్ చంద్ర ఘోష్ విచారణను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అవసరం అయితే మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్(BRS) అధినేత కేసీఆర్ ను పలిచి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన పలు సమాచారం సేకరిస్తామని చెప్పారు. ఇంకా ప్రజల నుంచి కూడా ప్రాజెక్ట్ నిర్మాణంలో అవకతవకలపై అభిప్రాయ సేకరణ చేయనున్నట్లు వెల్లడించారు. రానున్న రెండు, మూడు రోజుల్లో కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై పేపర్ ప్రకటన ఇస్తామని ప్రకటించారు. తద్వారా ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరణ చేస్తామన్నారు.
ఇది కూడా చదవండి: Telangana: తెలంగాణలో మే 13న సెలవు.. సీఈవో కీలక ప్రకటన..!
నిపుణుల అభిప్రాయాలను తీసుకొని విచారణ మొదలు పెడతామన్నారు జస్టిస్ చంద్రఘోష్. ఇంకా ఈ ప్రాజెక్టు కు సంబంధించి ఎన్డీఎస్ఏ, విజిలెన్స్, కాగ్ ఇచ్చిన నివేదికలను కూడా పరిగణలోకి తీసుకుంటామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వామ్యమైన ఇంజనీర్లతోనూ భేటీ అవుతామన్నారు. తమ విచారణలో సాంకేతిక పరమైన అంశాలను కూడా పరిగణలోకి తీసుకుంటామన్నారు. లీగల్ అంశాల ఆధారంగానే తమ ఎంక్వైరీ జరగనున్నట్లు తెలిపారు చంద్రఘోష్. ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇరిగేషన్ అధికారులతో చంద్రఘోష్ సమావేశం అయ్యారు.
కాళేశ్వరం ప్రాజెక్టు భద్రత, పిల్లర్ల కుంగడంపై పలు విషయాలను ఇంజనీర్లను అడిగి వివరాలను సేకరించారు. నివేదికల ఆధారంగానే విచారణ కొనసాగుతుందని.. దాంతోపాటు ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుంటామని జస్టిస్ చంద్ర గోష్ పేర్కొన్నారు. విచారణ క్రమంలో నిర్మాణ సంస్థలకు.. ఇంకా అవసరమైతే పొలిటికల్ లీడర్లకు కూడా నోటీసులు ఇవ్వనున్నట్లు చెప్పారు. తమ రెండో పర్యటనలో మేడిగడ్డ బ్యారేజ్ వద్దకు వెళ్లి పరిశీలిస్తామన్నారు.