Rains In Jupiter : మన సౌర కుటుంబంలో పెద్ద గ్రహమైన గురుగ్రహం(Jupiter) పై భారీ తుఫాన్లు ఉన్నాయి. అందుకు సంబంధించిన ఫొటోలను అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా(NASA) సోషల్ మీడియా(Social Media) లో రిలీజ్ చేసింది.
“సూర్యుడి నుంచి ఐదో గ్రహమైన గురుగ్రహంపై ఏర్పడిన తుఫానులు ఇవి. ఇలా మొత్తం గ్రహాన్ని చుట్టుముట్టేశాయి. మన జునో మిషన్ ఈ ఫొటోలను తీసింది. గురుగ్రహంపై ఘన ఉపరితల ప్రదేశం ఏదీ లేదు కాబట్టి.. ఇక్కడ తుఫానులు కొన్నేళ్లు, దశాబ్దాలు లేదా కొన్ని వందల సంవత్సరాలు కొనసాగుతాయి. గంటకు 643 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీస్తాయి” అని నాసా తన పోస్టుకు క్యాప్షన్ ఇచ్చింది.
గురుగ్రహంపై వీచే బలమైన గాలుల మధ్య నుంచి ఈ పెను తుఫానులను జునో ఫొటోలు తీసింది. ఆ సమయంలో జునో శాటిలైట్.. గురుగ్రహంపై ఉండే భారీ మబ్బులకు 13వేల కిలోమీటర్ల ఎత్తు నుంచి వెళ్తోంది. అక్కడి రాకాసి గాలుల్లో అమ్మోనియా, నీరు ఉంటాయి. హైడ్రోజన్, హీలియం ఎక్కువగా ఉండే గురు గ్రహ వాతావరణం అంతటా ఈ గాలులు ఉంటాయి” అని నాసా తెలిపింది.
నాసా షేర్ చేసిన ఫొటోల్లో తెలుపు, బ్లూ కలర్‌లో మబ్బులు, తుఫానులు కనిపిస్తున్నాయి. అవి అల్లకల్లోల వాతావరణాన్ని చూపిస్తున్నాయి. గురుగ్రహంపై అన్వేషణకు నాసా ప్రయోగించిన జునో స్పేస్‌క్రాఫ్ట్ గతంలో ఆ గ్రహంపై గ్రేట్ రెడ్ స్పాట్ ఫొటోను 13,917 కిలోమీటర్ల ఎత్తు నుంచి తీసింది. భూమికి డబుల్ సైజులో ఉన్న గ్రేట్ రెడ్ స్పాట్ నిజానికి ఒక తుఫాను. ఇది 350 ఏళ్లుగా కొనసాగుతోంది. ఐతే.. గత 150 ఏళ్లుగా దీని సైజు.. క్రమంగా తగ్గుతోంది. ఇలా గురుగ్రహం నిరంతరం మనల్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంది.