Congress Job Calendar: నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ (Telangana Govt) త్వరలోనే తీపి కబురు అందించనుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం మరో రెండు వారాల్లో జాబ్ క్యాలెండర్ విడుదల చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలు, భర్తీలకు సంబంధించిన ప్రాథమిక నివేదికను అధికారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి (CM Revanth Reddy) అందజేశారు. ఈ క్రమంలోనే జాబ్ క్యాలెండర్ అంశంపై పలు సూచనలు చేసిన సీఎం.. ఎలాంటి విమర్శలు తలెత్తకుండా పకడ్బందిగా ఉండాలని సూచించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కాగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC), తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు, ఇతర నియామక బోర్డులకు సంబంధించిన షెడ్యూళ్లతో జాబ్ క్యాలెండర్ విడుదల చేసి.. ఆ వివరాలను యూపీఎస్సీ, జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ(ఎన్టీయే), ఆర్‌ఆర్‌బీ, ఆర్‌ఆర్‌సీ, బ్యాంకింగ్ వంటి ఇతర పోటీ పరీక్షల బోర్డులు, రాష్ట్రీయ, కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు పంపించనున్నారు.
పాత నోటిఫికేషన్లను మినహాయించి..
ఇప్పటికే రాష్ట్రంలో గ్రూప్ 4 (Group 4), హాస్టల్ వార్డెన్, తదితర పరీక్షలు అయిపోగా ఆగస్టులో గ్రూప్-2, అక్టోబరులో గ్రూప్-1 మెయిన్స్ జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కొనసాగుతున్న నోటిఫికేషన్లను మినహాయించి వచ్చే యేడాదినుంచి ఈ క్యాలెండర్ రూపొందిస్తున్నారు అధికారులు. బీఆర్‌ఎస్ ఉద్యోగ నియామకాల ప్రక్రియ నిర్లక్ష్యానికి గురైన కారణంగా తెలిసిందే. కాగా ఈసారి ఎలాంటి లొసుగులు లేకుండా రేవంత్ సర్కారు ప్రత్యేక దృష్టి పెడుతోంది. ఇదిలా ఉంటే.. ఈ జాబ్ క్యాలెండర్ ను యూపీఎస్సీ (UPPSC) షెడ్యూల్ ఆధారంగానే టీజీపీఎస్సీ తయారుచేస్తున్నట్లు సమాచారం. పరీక్షల నిర్వహణను కూడా యూపీఎస్సీ తరహాలో నిర్వహించేలా విధానాలను రూపొందిస్తుంది. ఇటీవలే ఢిల్లీ పర్యటనతో యూపీఎస్సీ చైర్మన్ ను కలిసిన సీఎం రేవంత్.. పలు అంశాలపై చర్చించారు.
ఏటా సర్వీసు ఉద్యోగాల నోటిఫికేషన్..
ఇక 'రానున్న మూడేళ్లలో పదవీ విరమణ చేయనున్న వారితో ఏర్పడే ఖాళీలను గుర్తించాలి. అసలు ఖాళీల సంఖ్యతో ప్రమేయం లేకుండా ఏటా గ్రూప్-1, 2, 3, 4 సర్వీసు ఉద్యోగాల నోటిఫికేషన్ తప్పనిసరిగా ఉండాలి. ఉద్యోగార్థులు, నిరుద్యోగులు తమ భవిష్యత్తును నిర్మించుకునేందుకు ఉపయోగపడేలా క్యాలెండర్ ఉండాలి' అని సీఎం రేవంత్ ఆదేశించినట్లు సమాచారం. కాగా ఇప్పటికే జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగ ప్రకటనలు వెలువరించేందుకు ప్రభుత్వ విభాగాలు ఎప్పటికప్పుడు ఖాళీలను గుర్తించాలని టీజీపీఎస్సీ అన్ని విభాగాలకు లేఖలు రాసింది. అలాగే న్యాయవివాదాలు తలెత్తకుండా సర్వీసు నిబంధనల ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం, ఉద్యోగ ఖాళీల గుర్తింపు, ప్రభుత్వం నుంచి అనుమతులన్నీ వేగంగా లభించేలా కార్యాచరణ -సిద్ధమైందని సీఎంఓ వర్గాలు వెల్లడించాయి.
మరోవైపు డీఎస్సీని (DSC) మూడు నెలలు వాయిదా వేయాలని, గ్రూప్ పోస్టులు మరిన్ని పెంచాలంటూ నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. నిరుద్యోగ సమస్యలపై ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ తక్షణమే సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడాలని సూచిస్తున్నారు. తమ డిమాండ్లను పరిష్కరించకుంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని ప్రభుత్వానికి హెచ్చరికలు పంపుతున్నారు. మొత్తంగా ఈ జాబ్ క్యాలెండర్ విడుదలతో నిరుద్యోగుల ఆందోళనకు ఉపశమనం లభించనుంది. డిగ్రీ పట్టా చేతిలో పెట్టుకుని దిక్కులు చూడకుండా.. జాబ్ క్యాలెండర్ ప్రకారం ప్రిపేర్ అయ్యే అవకాశం లభించనుంది.
Also Read: రాష్ట్ర విభజనకు పదేళ్లు.. ఇంకా పెండింగ్‌లోనే సమస్యలు