Israel: ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరిగిన యుద్ధంలో ప్రాణ నష్టం, భారీ ఆస్తినష్టం జరిగిన విషయం తెలిసిందే. కాగా ఈ రణరంగం కారణంగా జరిగిన మరో హృదయవిదారకర ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పిల్లలను కనాలనే ఆశతో ఏళ్లపాటు ప్రయత్నించిన వేలాది మంది దంపతులు చివరకు ఐవీఎఫ్ మార్గం ఎంచుకోగా వారి ఆశలు గల్లంతు అయ్యాయి. భీకరమైన బాంబు దాడిలో భవనాలు, ఇండ్లు, ఆస్పత్రులు నామరూపాల్లేకుండా ద్వంసమవగా.. గాజాలో కృత్రిమ గర్భధారణ (Vitro fertilisation) కోసం వేలాది పిండాలు, వీర్య నమూనాలు నిల్వ ఉంచిన హాస్పిటల్ పూర్తిగా దెబ్బతిన్నట్లు వెల్లడించారు వైద్యులు.
తీరని వేదనను మిగిల్చింది..
ఈ మేరకు రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో బాధకరమైన విషయాన్ని బయటపెట్టిన ఐవీఎఫ్ సెంటర్ నిర్వాహకులు.. సంతానం కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది జంటల ఆశలు అడియాశలయ్యాని తెలిపారు. 'గాజాలోని అతిపెద్ద వైద్య కేంద్రాల్లో ఒకటైన అల్ బాస్మా ఐవీఎఫ్ సెంటర్‌పై ఇజ్రాయేల్ సైన్యం డిసెంబర్‌లో దాడులు చేసింది. ఈ ఘటనతో ఎంబ్రియాలజీ విభాగంలోని 5 లిక్విడ్ నైట్రోజన్ ట్యాంకులు ద్వంసం అయ్యాయి. ద్రవం ఆవిరై ట్యాంకుల లోపల ఉష్ణోగ్రతలు పెరిగి.. వేలాది పిండాలు, వీర్య నమూనాలు, ఫలదీకరణం చెందని అండాలు ఛిద్రమయ్యాయి. ఈ పరిణామం సంతానం లేని వందల మంది దంపతులకు తీరని వేదనను మిగిల్చింది' అని తెలిపారు.
ఇది కూడా చదవండి: EVM-VVPAT: ఎన్నికల ప్రక్రియ పవిత్రంగా జరగాలి.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
మా హృదయం ముక్కలైపోతుంది..
అలాగే అల్ బాస్మా ఐవీఎఫ్ సెంటర్ నిర్వాహకుడు డాక్టర్ బహేలిద్దీన్ ఘలాయినీ మాట్లాడుతూ.. ‘5 వేల నమూనాల్లో జీవం పోసుకునే అవకాశం ఉన్నవి అధికంగా ఉన్నాయి. ఇందులో సగానికి పైగా మళ్లీ నమూనాలు సేకరించడం అసాధ్యం. సగం మంది గర్బం దాల్చే అవకాశం లేదు. మా హృదయం ముక్కలైపోతుంది’ అని ఎమోషనల్ అయ్యారు. కేంబ్రిడ్జ్‌లో గైనకాలజీని అభ్యసించిన ఘలాయినీ.. 1997లో ఈ క్లినిక్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇక ఐవీఎఫ్ విధానంలో సంతానం పొందడానికి చాలామంది దంపతులు తమ ఇంట్లో టీవీ, నగలు అమ్ముకున్నాట్లు వెల్లడించారు.