Ayodhya Ram Mandir: దేశమే కాదు..ప్రపంచం కూడా రామమయం అయ్యింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అయోధ్య రామమందిరం ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి ముహుర్తం దగ్గర పడింది. అయోధ్యలో ప్రాణప్రతిష్ట కోసం ఈనెల 16వ తేదీ నుంచి ప్రత్యేక పూజా కార్యక్రమాలు షురూ అయ్యాయి. ఈ వేడుకను పురస్కరించుకుని దేశంలోని ఆలయాల్లో ప్రత్యేక కార్యక్రమాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఇస్రో కు చెందిన ఇండియన్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్(Indian Remote Sensing Satellite) అంతరిక్షం నుంచి రామమందిరం ఎలా ఉంటుందో తెలిపే ఫొటోను షేర్ చేసింది. ఇస్రో(isro) షేర్ చేసిన ఫొటోలో రామ మందిరం, అయోధ్య రైల్వే స్టేషన్, సరయూ నదితోపాటు మొత్తం నగరం ఏరియల్ రివ్యూ కనిపిస్తుంది. రేపు జరిగే ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం కోసం శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు(Janmabhoomi Tirtha Kshetra Trust) ఏర్పాట్లన్నీ చేసింది. అయోధ్య నగరం మొత్తం ఎంతో అందంగా ముస్తాబయ్యింది. ఈ వేడుకకు హాజరుకావాలని ట్రస్టు దేశంతో పాటు విదేశాల్లోని ప్రముఖులకు అహ్వానాలు కూడా పంపింది. ఈ కార్యక్రమానికి మోదీ తోపాటు పలువురు సినీప్రముఖులు, వ్యాపారులు, క్రికెటర్లు హాజరుకానున్నారు.
ఇది కూడా చదవండి: ఖుష్భు అత్తతో పీఎం మోదీ భేటీ..కల నిజమైందని సంతోషం..!!
వీఐపీలు,వీవీఐపీలు అయోధ్యకు రానున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే అయోధ్య నగరాన్ని యూపీ పోలీసులతో పాటు కేంద్ర బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. రామమందిరం నుంచి 6కిలోమీటర్ల దూరంలోనే బారికేడ్లను ఏర్పాటు చేసి వాహనాలు నిలిపివేస్తున్నారు. స్థానికులు, పాసులు ఉన్నవారు మాత్రమే లోపలికి వెళ్లవచ్చు. అయోధ్య రామమందిరంతోపాటు నగరమంతా పోలీస్ బందోబస్తులో ఉంది.