IPL : ఐపీఎల్‌పై మరోసారి ఫిక్సింగ్‌ ఆరోపణలు.. అసలేం జరుగుతోంది?

ఐపీఎల్‌పై మరోసారి ఫిక్సింగ్‌ ఆరోపణలు వస్తున్నాయి. దీంతో అభిమానులు మరోసారి 2013నాటి ఘటనలను గుర్తు చేసుకుంటున్నారు క్రికెట్ ఫాన్స్. వారు లేవనెత్తుతున్న అనుమానాలు తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవండి.

IPL : ఐపీఎల్‌పై మరోసారి ఫిక్సింగ్‌ ఆరోపణలు.. అసలేం జరుగుతోంది?
New Update

IPL 2024 : ఐపీఎల్‌.. నరాలు తెగె ఉత్కంఠ, ఊహించని ట్విస్టులు, అభిమానుల భావోద్వేగాలు, ఆటగాళ్ల పోరాట విన్యాసాలు.. గ్రౌండ్‌లో ప్రతీ నిమిషం క్లైమాక్స్‌ను తలపించే లీగ్‌ ఇది. క్రికెట్‌లో రిచెస్ట్‌ లీగ్‌గా పేరొందిన ఐపీఎల్‌కు ఉన్న ప్రేక్షకాదరణ వరల్డ్‌కప్‌(World Cup) కు కూడా లేదు. అయితే ఒక్క నిమిషం ఆగండి.. ఐపీఎల్‌ను చూస్తూ వెర్రిగా ఆనందిస్తున్నారా? మీరు చూస్తున్న ఐపీఎల్‌ మ్యాచ్‌లన్నీ స్క్రిప్ట్‌ అయితే? అంతా ట్రాష్‌ అయితే? అవును.. ఐపీఎల్‌పై మరోసారి ఫిక్సింగ్‌ నీలినీడలు కమ్ముకున్నాయి. దీంతో అభిమానులు మరోసారి 2013నాటి ఘటనలను గుర్తు చేసుకుంటున్నారు.

అప్పటివరకు కాస్త లైన్‌ అండ్‌ లెంగ్త్‌లో బౌలింగ్‌ వేసిన హార్దిక్‌ పాండ్యా(Hardik Pandya) చివరి ఓవర్‌లో మాత్రం లయ తప్పాడు. అసలు బౌలింగే రాదన్నట్టు వేశాడు.. వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో MI తరుఫున ఆఖరి ఓవర్‌ వేసిన పాండ్యా ఏకంగా 26 పరుగులు సమర్పించుకున్నాడు. MS ధోనీ ఈ ఓవర్‌లో ఏకంగా మూడు సిక్సులు బాదాడు. ఈ మ్యాచ్‌ ఫిక్స్‌ అయినట్టు పలు మీడియా సంస్థలు కథనాలు అల్లుతున్నాయి. అటు జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో జరిగిన రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్‌లోనూ మ్యాచ్ ఫిక్సింగ్ జరిగినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఈ రెండు స్టేడియాల్లో నలుగురు బుకీలు అరెస్ట్ అవ్వడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూర్చుతున్నాయి.

ఓ సారి ఫ్లాష్‌బ్యాక్‌కు వెళ్దాం.. అది 2013.. ఐపీఎల్‌ను స్పాట్‌ ఫిక్సింగ్‌ కుదిపేసింది. స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు(Delhi Police) ముగ్గురు క్రికెటర్లు శ్రీశాంత్ , అజిత్ చండీలా, అంకిత్ చవాన్‌ను అరెస్టు చేశారు. ఈ ముగ్గురు 2013 ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహించారు. అటు బెట్టింగ్‌ ఆరోపణలపై చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ ప్రిన్సిపాల్ గురునాథ్ మెయ్యప్పన్‌లను పోలీసులు అరెస్టు చేయడం నాడు ప్రకంపనలు రేపింది. గురునాథ్ మెయ్యప్పన్‌ మాజీ బీసీసీఐ చీఫ్‌ శ్రీనివాసన్‌కు అల్లుడు. 25 మార్చి 2014న ఈ కేసులో సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. శ్రీనివాసన్ బీసీసీఐ అధ్యక్షుడిగా కొనసాగడాన్నీ తీవ్రంగా తప్పుబట్టింది. వెంటనే పదవి నుంచి తప్పుకోవాలని తీర్పు వెలువరించింది.

బెట్టింగ్‌, ఫిక్సింగ్ ఆరోపణలతో జూలై 2015లో RM లోధా కమిటీ చెన్నై సూపర్ కింగ్స్(CSK), రాజస్థాన్ రాయల్స్‌ను IPL నుంచి రెండేళ్లపాటు సస్పెండ్ చేసింది. అటు విచారణలో భాగంగా పలువురు టాప్‌ ప్లేయర్లకు బుకీలతో సంబంధం ఉందన్న ప్రచారం జరిగింది. ఇండియన్‌ టీమ్‌కు అప్పటికే ఆడిన ఆరుగురు ప్రముఖ ఆటగాళ్ల గురించి కమిటీ సుప్రీంకోర్టుకు నివేదిక సబ్మిట్ చేసింది. అయితే ఆటగాళ్ల పేర్లు బయటపెట్టవద్దని బీసీసీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. నివేదికలోని సీల్డ్‌ కవర్‌ను ఓపెన్ చేయవద్దని కోరింది.

ఐపీఎల్‌ చరిత్రలో ఈ ఫిక్సింగ్‌ కుంభకోణం మాయని మచ్చ. అయితే ఈ పరిణామాల తర్వాత కూడా ఐపీఎల్‌ క్రేజ్‌ ఏ మాత్రం తగ్గలేదు. పైగా పెరుగుకుంటూ పోయింది. ప్రతీఏడాది ఏదో ఒక మ్యాచ్‌కు సంబంధించి ఫిక్సింగ్‌ అంటూ వార్తలు వైరల్ అవుతుంటాయి కానీ అవి నిజమని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలూ ఉండవు. అయితే ఈ సారి బుకీలు వరుసగా అరెస్ట్ అవుతుండడం పలు అనుమానాలకు తావిస్తోంది.

ఆరంభం నుంచి ప్రతి మ్యాచ్ స్క్రిప్టు ప్రకారం నడుస్తోందనే ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తుంటాయి. అచ్చం వరల్డ్‌ రెజ్లింగ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌-WWE తరహాలోనే మ్యాచ్‌లు జరుగుతాయన్న ప్రచారం జరుగుతుంటుంది.

Also Read : Sachin Tendulkar : 51వ వసంతంలోకి అడుగుపెట్టిన మాస్టర్ బ్లాస్టర్‌ సచిన్..

#hardik-pandya #ipl-2024 #world-cup
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe