Explainer: దీపావళికి బంగారం కొనాలంటే ఈ రెండు తేదీలు స్పెషల్.. గోల్డ్ లో ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయవచ్చంటే..

దీపావళి వస్తోంది.. ఈ నేపథ్యంలో బంగారంపై నవంబర్ 4,5 తేదీల్లో ఇన్వెస్ట్ చేయడం లాభాల్ని ఇస్తుందని పండితులు చెబుతున్నారు. గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ కోసం డిజిటల్ ఆప్షన్స్ బెస్ట్.

Explainer: దీపావళికి బంగారం కొనాలంటే ఈ రెండు తేదీలు స్పెషల్.. గోల్డ్ లో ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయవచ్చంటే..
New Update

బంగారం పేరు చెప్పగానే అందరికీ మనసు లాగేస్తుంది. ముఖ్యంగా మన దేశంలో బంగారం అంటే ఇష్టపడని వ్యక్తులు దాదాపు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. పండగ.. పెళ్లి.. వేడుక ఏదైనా మొదటగా బంగారం గురించే ఆలోచిస్తారు. ముఖ్యంగా అతివలకు బంగారం విషయంలో ఎప్పుడూ ఆశ ఉంటూనే ఉంటుంది. అందుకే మన దేశంలో ప్రత్యేకంగా బంగారం కొనడం కోసం కూడా పండగలు ఉన్నాయి. అందులో దీపావళి అతి పెద్ద పండుగ. దీపావళికి దీపాల అలంకరణకు ఎంత ప్రాధాన్యం ఇస్తారో అంతే ప్రాధాన్యం బంగారం కొనడం కోసం కూడా ఇస్తారు. కష్టపడి బంగారం కొనడం కోసం రూపాయి రూపాయి కూడ పెట్టేవారు చాలామందే ఉంటారు.

ఈ సంవత్సరం దీపావళి పండుగ వచ్చేస్తోంది. మరి బంగారం కొనడం కోసం కూడా అందరూ ఎదురుచూస్తూ ఉంటారు. పండుగ కోసం బంగారం కొనడం ఎదో షాపింగ్ కి సరదాగా వెళ్లినట్టుగా చేయరు. బంగారం కొనడానికి కూడా కొన్ని మంచిరోజులు ఎంచుకుంటారు. దీపావళి సమయంలో వచ్చే కొన్ని ప్రత్యేక రోజులు ఉన్నాయి. ఈ ఏడాది బంగారం కొనాలని.. బంగారంలో ఇన్వెస్ట్ చేయాలని అనుకునే వారి కోసం కొన్ని ప్రత్యేక రోజులు ఉన్నాయని చెబుతున్నారు పండితులు. ఈ దీపావళి కంటే ముందుగా నవంబర్ 4వ తేదీ శనివారం అలాగే 5వ తేదీ ఆదివారం మన పంచాంగం ప్రకారం పుష్య నక్షత్రం కలిసి వస్తోందని పండితులు చెబుతున్నారు. ఈ రెండురోజుల్లో 8 శుభయోగాలు ఉన్నాయని అంటున్నారు. అందుకే ఈ రెండురోజుల్లో బంగారం ఆభరణాల రూపంలో కొనుక్కున్నా.. బంగారంలో ఇన్వెస్ట్ చేసినా అది మంచి ప్రయోజనాన్ని ఇస్తుందని చెబుతున్నారు. మీరు ఒకవేళ ఈ పండుగ శుభ సమయంలో బంగారం కొనాలంటే ఈ రెండురోజుల్లోనూ ప్లాన్ చేసుకోవడం మంచి చేస్తుందని పండితుల ఉవాచ. అందువల్ల ఈ రోజుల్లో బంగారంలో ఇన్వెస్ట్ చేయాలంటే ఉన్న ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయనేది ఇప్పుడు చెక్ చేద్దాం..

భౌతికంగా బంగారం కొనడం కంటే.. డిజిటల్ గా బంగారం పై ఇన్వెస్ట్ చేయడం కోసం చాలా ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. ఇవి ఇప్పటికే చాలామందికి మంచి రిటర్న్స్ కూడా ఇచ్చాయి. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

1. గోల్డ్ ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్స్ (గోల్డ్ ఇటిఎఫ్):

షేర్ల లానే బంగారాన్ని కొనడం కోసం ఉన్న ఆన్ లైన్ ఆప్షన్ ఉంది. అదే గోల్డ్ ఇటిఎఫ్. అంటే ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్స్, వీటిని స్టాక్ ఎక్స్ఛేంజీలలో కొనుక్కోవచ్చు.. అలానే అమ్ముకోవచ్చు. గోల్డ్ ఇటిఎఫ్ బెంచ్‌మార్క్ స్పాట్ గోల్డ్ రేట్స్ అందువల్ల.. మనం వాటిని బంగారం నిజమైన ధర వద్ద కొనుక్కునే అవకాశం ఉంటుంది.

ఇందులో ఇన్వెస్ట్ చేయడానికి డీమ్యాట్ ఎకౌంట్ అవసరం: గోల్డ్ ఈటీఎఫ్ కొనాలంటే డీమ్యాట్ ఖాతా ఓపెన్ చేయాలి. డీమ్యాట్ ఎకౌంట్ ద్వారా NSE లేదా BSEలో అందుబాటులో ఉన్న గోల్డ్ ETF యూనిట్లను కొనుగోలు చేయవచ్చు అలాగే మీ డీమ్యాట్ ఎకౌంట్ కు లింక్ అయిన బ్యాంక్ ఎకౌంట్ నుంచి సమానమైన మొత్తం డిడక్ట్ అవుతుంది.

2. పేమెంట్ యాప్స్ నుంచి కూడా ఇన్వెస్ట్ చేయవచ్చు:

ఇప్పుడు మీరు మీ స్మార్ట్‌ఫోన్ నుంచి డిజిటల్ బంగారంలో పెట్టుబడి పెట్టవచ్చు. దీనికోసం పెద్దగా ఖర్చు చేయాల్సిన పనిలేదు. మీరు మీ సౌలభ్యం ప్రకారం ఏ ధరకైనా బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు. ఈ సదుపాయం Amazon Pay, Google Pay, Paytm, PhonePe అలాగే MobiKwik వంటి ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉంది.

3. సావరిన్ గోల్డ్ బాండ్ కూడా ఎంచుకోవచ్చు:

గోల్డ్ బాండ్ అనేది ప్రభుత్వ బాండ్, ఇది ప్రభుత్వం ఎప్పటికప్పుడు జారీ చేస్తుంది. దీని విలువ రూపాయల్లోనో, డాలర్లలోనో కాదు, బంగారం తూకంలో ఉంటుంది. బాండ్ 1 గ్రాము బంగారం అయితే, బాండ్ ధర 1 గ్రాము బంగారం ధరతో సమానంగా ఉంటుంది. సావరిన్ గోల్డ్ బాండ్ ఇష్యూ ధరపై ప్రతి సంవత్సరం 2.50% స్థిర వడ్డీని అందిస్తుంది. ఇందులో ఇన్వెస్ట్ చేయడానికి డీమ్యాట్ ఎకౌంట్ అవసరం.

వీటిలో ఉండే సౌలభ్యం ఏమిటంటే వీటిని కొండడం చాలా సులభం. బంగారు బాండ్లను కొనుగోలు చేయడానికి, మీరు బ్రోకర్ ద్వారా డీమ్యాట్ ఎకౌంట్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. దీనిలో, మీరు NSEలో అందుబాటులో ఉన్న గోల్డ్ బాండ్ల యూనిట్స్ కొనవచ్చు. నేరుగా బ్యాంక్ ఎకౌంట్ నుంచి మీరు కొన్న యూనిట్స్ కి సంబంధించిన డబ్బు డిడక్ట్ అయిపోతుంది. వీటిలో ఆఫ్‌లైన్‌లో కూడా పెట్టుబడి పెట్టవచ్చు.

4. ఫిజికల్ గా బంగారంలో పెట్టుబడి పెట్టడం..

ఫిజికల్ గోల్డ్ లో పెట్టుబడి పెట్టడం అంటే ఆభరణాలు లేదా బంగారు బిస్కెట్లు-నాణేలు కొనడం. బంగారంపై పెట్టుబడులు పెట్టేందుకు ఆభరణాలు కొనడం సరైన మార్గంగా నిపుణులు భావించడం లేదు, ఎందుకంటే దానిపై జీఎస్టీ, మేకింగ్ చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే దీని కోసం ముందుగా ఎక్కువ డబ్బు చెల్లించాలి. ఆభరణాలు తయారు చేసేటప్పుడు, మీరు 24 క్యారెట్ల బంగారంలో పెట్టుబడి పెట్టరు, ఎందుకంటే ఆభరణాలు 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ తో తయారు కావు. అయితే, మీరు బంగారు బిస్కెట్లు లేదా నాణేలలో పెట్టుబడి పెట్టవచ్చు.

బంగారంపై పెట్టుబడితో ఎంత లాభం వస్తుంది అనే అనుమానం చాలా మందికి ఉంటుంది. ఈ ఏడాది ఇప్పటివరకు బంగారం ధరలో విపరీతమైన పెరుగుదల కనిపించింది. జనవరి 1, 2023న 10 గ్రాముల బంగారం ధర రూ.55,359గా ఉంది, అది ఇప్పుడు (అక్టోబర్ 31) రూ.61,238కి చేరుకుంది. అంటే, కేవలం 10 నెలల్లో, బంగారం దాదాపు 11% రాబడిని ఇచ్చింది.

ఇది బ్యాంక్ ఎఫ్‌డి, పిపిఎఫ్ - ఆర్‌డి వంటి పథకాలపై వచ్చే వడ్డీ కంటే ఎక్కువ. ఇది కాకుండా, స్టాక్ మార్కెట్ (సెన్సెక్స్) కూడా ఈ సంవత్సరం (అక్టోబర్ 31) ఇప్పటివరకు దాదాపు 4.50% మాత్రమే రాబడిని ఇచ్చింది, ఇది బంగారం రాబడిలో సగం కూడా కాదు.

స్టాక్ మార్కెట్‌లో కొనసాగుతున్న ఒడిదుడుకుల కారణంగా బంగారానికి మద్దతు లభిస్తోందని నిపుణులు చెబుతున్నారు. దీపావళి నాటికి 10 గ్రాముల బంగారం రూ.62 వేలకు చేరుకుంటుందనే అంచనాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా, భవిష్యత్తులో కూడా దీని ధర పెరగవచ్చు.

అదీ విషయం బంగారంలో పెట్టుబడికి ఎప్పుడూ గ్యారెంటీ ఉంటుంది. అందుకే బంగారంలో డిజిటల్ గా పెట్టుబడి పెట్టినా.. ఫిజికల్ గా బంగారం కొనుక్కున్న ఎప్పటికీ అది లాభదాయకమైన డీల్ అవుతుందని ఇప్పటివరకూ బంగారం ధరల పెరుగుదల సూచిస్తుంది. దీపావళి పండుగ కోసం గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయాలంటే అన్ని ఆప్షన్స్ పరిశీలించి నిపుణుల సలహా తీసుకుని ప్రొసీడ్ అయిపోండి. అన్నట్టు పండితులు చెబుతున్న నవంబర్ 4, 5 తేదీలను కూడా దృష్టిలో పెట్టుకోవడం మర్చిపోకండి.

#gold #investment #diwali
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe