/rtv/media/media_files/2026/01/04/fotojet-72-2026-01-04-07-27-11.jpg)
US lightning strike on Venezuela... arrest of president
Venezuela: దక్షిణ అమెరికా దేశం వెనెజువెలాపై అమెరికా మెరుపు దాడులకు దిగింది. ఊహించని ఈ దాడులతో రాజధాని కారకాస్ దద్దరిల్లింది. డ్రగ్స్ సరఫరాను అడ్డుకోవాలంటూ గత కొన్ని నెలలుగా మదురో ప్రభుత్వంపై అమెరికా ఒత్తిడి తెస్తోంది. అదే సమయంలో తూర్పు పసిఫిక్, కరీబియన్ సముద్ర జలాల్లో సైన్యాన్ని అమెరికా మోహరిస్తోంది. ఇటీవలి కాలంలో పలుమార్లు వెనెజువెలా ఓడలపై దాడులు చేసింది. డ్రగ్ స్మగ్లర్లకు సహకరించే డాకింగ్ ప్రాంతంపై గత వారం దాడులకు దిగింది. అలాంటిది శనివారం ఏకంగా ఆ దేశంపైనే డాడులు చేసింది.
వరుస పేలుళ్లతో జనం భయపడి ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఆ దేశ సైనిక స్థావరాల్లో పొగ, అంధకారం అలముకున్నాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో చీకట్లు కమ్ముకున్నాయి. కారకాస్‌లోని లా కార్లోటా ఎయిర్‌ఫీల్డ్, ప్యూర్టే లియునా మిలిటరీ బేస్, లా గ్వైరా నౌకాశ్రయం మొదలైన కీలక సైనిక స్థావరాలపై అమెరికా దళాలు దాడులు కొనసాగాయి. దేశం మేల్కొనేలోగానే అధ్యక్షుడు నికొలస్ మదురోను, ఆయన భార్య సిలియా ఫ్లోర్స్‌ను అమెరికా సైన్యం.. బంధించి న్యూయార్క్‌కు తరలించింది. అయితే అంతకుముందే మదురో దేశంలో అత్యవసర పరిస్థితిని విధించారు.
ఎలాంటి సమాచారం లేకుండానే..
వెనెజువెలాపై దాడులకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాంగ్రెస్ అనుమతి తీసుకోలేదు. దాడులకు సంబంధించిన వివరాలను తన సొంత సోషల్ మీడియా వేదిక ‘ట్రూత్’ద్వారా శనివారం తెల్లవారుజామున 4.30 గంటల తర్వాత ప్రకటించారు. అనంతరం దాడులు నిర్వహించారు. రాజధాని కారకాస్‌లో పలు చోట్ల పేలుళ్లు జరిగాయని, తక్కువ ఎత్తులో విమానాలు చక్కర్లు కొట్టాయని, ఆ వెంటనే పౌరులు, సైనిక స్థావరాలపై అమెరికా దాడులకు పాల్పడిందని వెనెజువెలా ప్రభుత్వం ప్రకటించింది. ఇది అమెరికా సామ్రాజ్యవాద దాడని, ప్రజలు వీధుల్లోకి వచ్చి ఆందోళనలు నిర్వహించాలని పిలుపునిచ్చింది. వెనెజువెలాపై అమెరికా దాడిని పలు దేశాలు ఖండించగా.. మరికొన్ని దేశాలు మధ్యవర్తిత్వం వహిస్తామని ముందుకొచ్చాయి. మరికొన్ని దేశాలు దాడులను సమర్థించాయి. దాడిని మన దేశంలోని లెఫ్ట్ పార్టీలైన సీపీఎం, సీపీఐ, సీపీఐ (ఎంఎల్) లిబరేషన్‌లు ఖండించాయి.
2013లో హ్యూగో చావెజ్ మరణానంతరం దేశాధ్యక్షుడిగా మదురో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. 2018లో మళ్లీ ఎన్నికయ్యారు. అయితే ప్రతిపక్షాలు పోటీ చేయకుండా నిషేధం విధించడంతో ఆ ఎన్నికపై తీవ్రవిమర్శలొచ్చాయి. మరోవైపు వెనెజువెలా దేశాధ్యక్ష బాధ్యతలను ఎవరు చేపట్టారన్న అంశం తేలలేదు. వెనెజువెలా చట్టాల ప్రకారం ఉపాధ్యక్షులుగా ఉన్నవారు అధ్యక్షులవుతారు. కానీ తాను బాధ్యతలు చేపట్టినట్లు ఉపాధ్యక్షురాలిగా ఉన్న డెల్సీ రోడ్రిగ్స్ ప్రకటించలేదు. 1990లో పనామాపై దాడిచేసి అప్పటి అధ్యక్షుడు మాన్యుయెల్ ఆంటోనియో నోరీగాను బందీగా చేసుకున్న 36 ఏళ్ల తర్వాత మళ్లీ ఓ దక్షిణ అమెరికా దేశంపై అమెరికా దాడి చేయడం ఇదే కావడం గమనార్హం.
కాగా, బంధీగా చేసుకున్న మదురో, ఆయన భార్యను ఎక్కడికి తరలించిందీ వెల్లడించాలని రోడ్రిగ్స్ డిమాండు చేశారు. వారు బతికే ఉన్నారనే ఆధారాలను చూపించాలని డిమాండ్ చేశారు. మదురో చివరిసారిగా శుక్రవారం టీవీలో కనిపించారు. కారకాస్‌లో చైనా బృందంతో భేటీ అయ్యారు.ఈ దాడులను వెనెజువెలా రక్షణ మంత్రి వ్లాదిమిర్ పాడ్రినో ఖండించారు. ఇది సామ్రాజ్యవాద దాడిగా అభివర్ణించారు. దేశ రక్షణ కోసం విదేశీ బలగాలను ఎదిరించాలని పౌరులకు ఆయన పిలుపునిచ్చారు. మదురోను వెనక్కి పంపించాలని కారకాస్ మేయర్ కార్మెన్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన జరిగింది.
న్యూయార్క్‌లో విచారణ
కాగా మదురో, ఆయన భార్య సిలియాను న్యూయార్క్‌కు తరలించిన సైన్యం అమెరికా చట్టాల ప్రకారం న్యూయార్క్‌లోని కోర్టుల్లో విచారిస్తామని అమెరికా అటార్నీ జనరల్ పామ్ బోండీ తెలిపారు. మదురోపై అమెరికా 2020లో ‘నార్కో-టెర్రరిజం’ కుట్ర అభియోగాలను మోపింది. తాజాగా అదే కేసులను మోపారు. వెనెజువెలాపై దాడి చేసిన అమెరికా బలగాలు సైనిక స్థావరంలోని ఇంట్లో ఉన్న మదురో దంపతులను పట్టుకుని.. వారిని బెడ్‌రూం నుంచి లాక్కెళ్లినట్లు ఆరోపిస్తున్నారు. అర్ధరాత్రి సమయంలో వారు నిద్రిస్తుండగా ఒక్కసారిగా అమెరికా బలగాలు దాడి చేశాయని సైనిక వర్గాలు తెలిపాయి. వారిని అమెరికా యుద్ధ నౌక ఐవో జిమా ఎక్కించారని అది న్యూయార్క్‌కు బయలుదేరిందని విశ్వాసనీయవర్గాలు వెల్లడించాయి.
చమురు నిల్వల కోసమే కుట్ర: మదురో
‘అమెరికాకు కావాల్సింది డ్రగ్స్ నియంత్రణ కాదని. వెనెజువెలాలో ఉన్న అపారమైన చమురు నిల్వలను దక్కించుకోవడమే వారి అసలు లక్ష్యం అని మదురో అంతకు ముందు ఆరోపించారు. అందుకే నా ప్రభుత్వాన్ని కూల్చాలని చూస్తున్నారన్నారు. మాదక ద్రవ్యాల అడ్డుకట్టకు అమెరికాతో చర్చించేందుకు నేను సిద్ధంగానే ఉన్నా. కానీ వారు చర్చలకు రాకుండా యుద్ధానికి దిగుతున్నారన్నారు. ఆగస్టులో కరీబియన్ సముద్రంలో భారీగా సైన్యాన్ని మోహరించడం ఇందులో భాగమే’ అని ఓ ఇంటర్వ్యూలో మదురో స్పష్టం చేశారు. ఆయన అన్నట్లుగానే అమెరికా దాడులు చేసింది.
Follow Us