Epstein files: ట్రంప్ కంపు పనులు కవర్ చేస్తూ.. 30,000 పేజీల డాక్యుమెంట్ రిలీజ్

అమెరికాలో సంచలనం సృష్టించిన జెఫ్రీ ఎప్‌స్టీన్ సెక్స్ కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికా న్యాయశాఖ దాదాపు 30,000 పేజీల డాక్యుమెంట్స్ విడుదల చేసింది. అందులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ఆరోపణలు అవాస్తవమని న్యాయశాఖ స్పష్టం చేసింది.

New Update
trump

అమెరికా అంతటా సంచలనం సృష్టించిన జెఫ్రీ ఎప్‌స్టీన్ సెక్స్ కుంభకోణం కేసులో తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ విచారణకు సంబంధించి అమెరికా న్యాయశాఖ దాదాపు 30,000 పేజీల డాక్యుమెంట్స్ విడుదల చేసింది. అయితే, ఈ పత్రాల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ఉన్న ఆరోపణలు అవాస్తవమని న్యాయశాఖ స్పష్టం చేయడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.

30వేల పేజీల డాక్యుమెంట్ రిలీజ్ చేస్తూ జుడిష్యియల్ డిపార్ట్‌మెంట్ సోషల్ మీడియాలో ఓ వివరణ ఇచ్చింది. అందులో.. "ఈ ఫైల్స్‌లో కొన్ని డొనాల్డ్ ట్రంప్‌కు వ్యతిరేకంగా అబద్ధపు ఆరోపణలు ఉన్నాయి. ఇవి 2020 ఎన్నికలకు ముందు ఉద్దేశపూర్వకంగా FBI కి అందిన సమాచారం. ఈ ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవి, తప్పు. వాటిలో కనీసం నిజం ఎంత ఉన్నా, అవి ఎప్పుడో ట్రంప్‌పై ఆయుధాలుగా ఉపయోగపడేవి." పారదర్శకత కోసం చట్టప్రకారం ఈ పత్రాలను యథాతథంగా విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

డాక్యుమెంట్లలో కీలక అంశాలు..

విమాన ప్రయాణాలు: 1990లో ట్రంప్ సుమారు 8 సార్లు ఎప్‌స్టీన్ పర్సనల్ జెట్ విమానంలో ప్రయాణించినట్లు కొన్ని ఈమెయిల్స్ ద్వారా వెల్లడైంది. అయితే ఇది కేవలం ప్రయాణం మాత్రమేనని, ఎటువంటి నేరాలు అక్కడ జరిగాయని ఆధారాలు లేవని అధికారులు పేర్కొన్నారు.
ఫేక్ లెటర్స్: ఎప్‌స్టీన్ మరణించిన తర్వాత రాసినట్లుగా భావిస్తున్న ఒక లేఖలో ట్రంప్ పేరును ప్రస్తావించారు. అయితే ఆ లేఖలో హ్యాండ్ రైటింగ్ ఎప్‌స్టీన్‌ది కాదని, అది పూర్తిగా నకిలీ అని ఎఫ్‌బీఐ తేల్చి చెప్పింది.
ఫోటోల వివాదం: గతంలో విడుదల చేసిన ఫైల్స్ నుండి ట్రంప్ ఫోటోలను తొలగించారని డెమోక్రాట్లు విమర్శించగా, బాధితుల గోప్యత కోసమే అలా చేశామని, ఇప్పుడు ఆ ఫోటోలను మళ్ళీ పునరుద్ధరించామని న్యాయశాఖ వివరించింది.

రాజకీయ దుమారం
ఈ పత్రాల విడుదల అమెరికా రాజకీయాల్లో వేడిని పెంచింది. అధ్యక్షుడు ట్రంప్ స్పందిస్తూ.. తనపై వస్తున్న ఆరోపణలను కొట్టిపారేశారు. రిపబ్లికన్ పార్టీ సాధిస్తున్న విజయాల నుండి ప్రజల దృష్టిని మళ్ళించేందుకే డెమోక్రాట్లు ఈ అంశాన్ని అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. మరోవైపు, ఈ ఫైల్స్‌లో మరిన్ని కీలక విషయాలను ఎడిట్ చేశారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. మొత్తానికి, ఎప్‌స్టీన్ ఫైల్స్ విడుదల ద్వారా అమెరికా ప్రభుత్వం పారదర్శకతను చాటుకోవాలని చూస్తున్నప్పటికీ, ట్రంప్ పేరు చుట్టూ తిరుగుతున్న వివాదాలు మాత్రం ఇప్పట్లో సద్దుమణిగేలా లేవు.

Advertisment
తాజా కథనాలు