/rtv/media/media_files/2026/02/28/us-is-real-2026-02-28-14-23-46.jpg)
మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు ఒక్కసారిగా కమ్ముకున్నాయి. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దళాలు సంయుక్తంగా విరుచుకుపడ్డాయి. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌తో పాటు పలు ప్రధాన నగరాలపై క్షిపణుల వర్షం కురుస్తోంది. ఇరాన్ ప్రెసిడెంట్ ప్యాలెస్, గూఢచారి సంస్థ హెడ్‌క్వార్టర్స్‌ను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దాడులు చేయగా, అమెరికా తన యుద్ధనౌక 'అబ్రహం లింకన్' ద్వారా గగనతలం నుంచి బాంబుల వర్షం కురిపిస్తోంది.
ఇరాన్ అధికారిక వార్తా సంస్థ తస్నిమ్ సమాచారం ప్రకారం.. దేశ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ నివాసంపై, అలాగే రాష్ట్రపతి భవనంపై సుమారు 7 క్షిపణులు పడ్డాయి. ఈ దాడుల్లో భారీ నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. అయితే, ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టిన అధికారులు ఖమేనీని సురక్షిత ప్రాంతానికి తరలించారు. టెహ్రాన్, ఖోమ్, ఇస్ఫహాన్ వంటి ప్రధాన నగరాల్లో భారీగా పొగ మేఘాలు కమ్ముకున్నాయి. రక్షణ శాఖ కార్యాలయం, అటామిక్ ఎనర్జీ కేంద్రాలే లక్ష్యంగా ఈ దాడులు కొనసాగుతున్నాయి.
ఈ ఆపరేషన్‌కు ఇజ్రాయెల్ షీల్డ్ ఆఫ్ జుడా అని పేరు పెట్టింది. దీనిపై ఇజ్రాయెల్ ప్రధాని స్పందిస్తూ.. ఇది సింహం గర్జన అని అభివర్ణించారు. అటు అమెరికా కూడా రంగంలోకి దిగి తన నౌకాదళం, వాయుసేనతో ఇరాన్‌పై విరుచుకుపడుతోంది. ప్రస్తుతం ఇజ్రాయెల్‌లో కూడా హై అలర్ట్ ప్రకటించారు. పాఠశాలలకు సెలవులు ఇచ్చి, ప్రజలందరినీ సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని ఆదేశించారు.
డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
ఈ దాడిపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ ఎప్పటికీ అణుబాంబు తయారు చేయలేదని, ఆ దేశం తయారు చేస్తున్న క్షిపణులు అమెరికాకు, ప్రపంచానికి ముప్పుగా మారాయని ఆయన అన్నారు. గత 47 ఏళ్లుగా ఇరాన్ అమెరికా వ్యతిరేక నినాదాలతో హింసను ప్రేరేపిస్తోందని మండిపడ్డారు. ఇరాన్ సైన్యం తక్షణమే లొంగిపోవాలని, లేకపోతే వారిని నామరూపాలు లేకుండా చేస్తామని ట్రంప్ హెచ్చరించారు.
మరోవైపు ఇరాన్ కూడా వెనక్కి తగ్గడం లేదు. యుద్ధం మీరు మొదలుపెట్టారు, కానీ దీన్ని మేమే ముగిస్తాం అంటూ ఇరాన్ పార్లమెంటరీ కమిటీ చైర్మన్ హెచ్చరించారు. ఈ దాడులకు ప్రతికారంగా ఇజ్రాయెల్‌ను మట్టి కరిపిస్తామని ఇరాన్ ప్రతినబూనింది. ఇరాన్ సరిహద్దు దేశమైన ఇరాక్ కూడా అప్రమత్తమై తన గగనతలాన్ని మూసివేసింది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఈ గొడవ మరింత ముదిరి మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా అనే భయం ప్రపంచ దేశాల్లో నెలకొంది.
Follow Us