/rtv/media/media_files/2026/01/25/trump-2026-01-25-06-34-17.jpg)
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరో సంచలన ప్రకటన చేశారు. చైనాతో కెనడా కుదుర్చుకున్న కొత్త వాణిజ్య ఒప్పందంపై ట్రంప్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఒకవేళ కెనడా చైనాతో కనుక ఈ కొత్తవాణిజ్య ఒప్పందాన్ని ముందుకు తీసుకువెళ్తే మాత్రం.. ఆ దేశం నుంచి అమెరికాకు వచ్చే అన్ని రకాల వస్తువులపై ఏకంగా 100 శాతం టారిఫ్‌లు విధిస్తామంటూ హెచ్చరించారు.
తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్రూత్ సోషల్ వేదికగా ట్రంప్ స్పందిస్తూ కెనడా ప్రధాని మార్క్ కార్నీ తీరును ట్రంప్ తప్పుబట్టారు. చైనా తన వస్తువులను అమెరికాలోకి చేరవేసేందుకు కెనడాను ఒక ట్రాన్సిట్ పాయింట్‌గా వాడుకోవాలని చూస్తే అది సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. ఈ క్రమంలో చైనా తన వ్యాపార జిత్తులతో కెనడా సామాజిక వ్యవస్థను, అక్కడి జీవన విధానాన్ని పూర్తిగా నాశనం చేస్తుందని ట్రంప్ హెచ్చరించారు.
అమెరికా తీరుతో విసిగిపోయిన కెనడా, తాజాగా చైనాతో ఒక చారిత్రాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం కెనడా నుంచి ఎగుమతి అయ్యే కెనోలా ఉత్పత్తులపై చైనా భారీగా పన్నులను తగ్గించింది. దీనికి ప్రతిగా చైనాకు చెందిన సుమారు 49 వేల ఎలక్ట్రిక్ వాహనాలను తక్కువ పన్నుతో దిగుమతి చేసుకోవడానికి కెనడా అంగీకరించింది. గతంలో హువావే యజమాని కుమార్తె అరెస్ట్ వ్యవహారంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నప్పటికీ, ఇప్పుడు మళ్ళీ ఆర్థిక బంధాన్ని బలపరుచుకోవాలని కెనడా ప్రధాని కార్నీ భావిస్తున్నారు. అయితే అమెరికా ఇప్పటికే కెనడియన్ ఉత్పత్తులపై పన్నులు పెంచడంతో, వేరే గత్యంతరం లేక కెనడా చైనా వైపు మొగ్గు చూపడం గమనార్హం.
వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో
అయితే ఈ వ్యవహారం అమెరికా, కెనడాల మధ్య పెద్ద మాటల యుద్ధానికే దారితీసింది. ఇటీవల దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో మార్క్ కార్నీ మాట్లాడుతూ అమెరికా నాయకత్వంలోని ప్రపంచ వ్యవస్థ విచ్ఛిన్నమవుతోందని పరోక్షంగా విమర్శలు చేశారు. దీనికి కౌంటర్‌గా ట్రంప్ స్పందిస్తూ, అంతర్జాతీయ వివాదాల పరిష్కారం కోసం తాను ఏర్పాటు చేస్తున్న 'బోర్డ్ ఆఫ్ పీస్' నుండి కెనడా ప్రధానికి ఇచ్చిన ఆహ్వానాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. కెనడా కేవలం అమెరికా వల్లే బతుకుతోందని ట్రంప్ వర్గం విమర్శించగా, కెనడా తన సొంత శక్తితో ఎదుగుతోందని మార్క్ కార్నీ ధీటుగా బదులిచ్చారు. ప్రస్తుతం ఈ రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచ వాణిజ్య రంగంలో కొత్త అలజడిని సృష్టిస్తున్నాయి.
Follow Us