Venezuela : వెనెజువెలాలో ఉద్రిక్తత.. భారత విదేశాంగశాఖ కీలక ప్రకటన

వెనెజువెలా పై అమెరికా దాడుల నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. అత్యవసరమైతే తప్ప ఆ దేశానికి వెళ్లొద్దని పేర్కొంది. అనవసర ప్రయాణాలు మానుకోవాలని సూచించింది.

New Update
FotoJet (77)

Tension in Venezuela

Venezuela: వెనెజువెలా పై అమెరికా దాడుల నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. అత్యవసరమైతే తప్ప ఆ దేశానికి వెళ్లొద్దని పేర్కొంది. వెనెజువెలా అధ్యక్షుడు మదురోను అమెరికా నిర్బంధించి న్యూయార్క్‌ తరలించిన  నేపథ్యంలో శనివారం రాత్రి ఈ అడ్వైజరీ జారీ చేసింది. అనవసర ప్రయాణాలు మానుకోవాలని సూచించింది. ‘‘వెనెజువెలాలో ఉన్న భారతీయులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలను నియంత్రించుకోవాలి. కారకాస్‌లోని భారత రాయబార కార్యాలయంతో కాంటాక్ట్‌లో ఉండాలి’’ అని తెలిపింది. 

ప్రపంచ దేశాల భిన్న స్పందన

కాగా వెనెజువెలాపై అమెరికా దాడుల మీద మిశ్రమ స్పందన వ్యక్తమైంది. రష్యా, చైనా, క్యూబా, ఇరాన్‌ వంటి దేశాలు దాడులను ఖండించగా.. అర్జెంటీనా మద్దతు తెలిపింది. స్పెయిన్‌ మధ్యవర్తిత్వం వహిస్తామని  ముందుకొచ్చింది. 
‘వెనెజువెలాపై అమెరికా వైమానిక దాడులు సైనిక దురాక్రమణ కిందకే వస్తాయి. విధ్వంస చర్యలకు తావులేకుండా.. విదేశీ సైనిక జోక్యం లేని విధంగా వెనెజువెలా తన సొంత భవితను నిర్ణయించుకునే హక్కుండాలి. పరిస్థితి మరింత దిగజారకుండా సంప్రదింపుల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలి. వెనెజువెలా ప్రజలకు, ప్రభుత్వానికి మా మద్దతు ఉంటుంది. ఈ విషయమై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండు చేస్తున్నాం’ అని రష్యా విదేశాంగశాఖ స్పష్టం చేసింది.

అంతర్జాతీయ చట్టాలను అమెరికా ఉల్లంఘించిందని చైనా  ఆరోపించింది. ఆ దేశం జరిపిన వైమానిక దాడులను ఖండించింది. ఈ ఘటనతో దిగ్భ్రాంతి చెందామని చైనా విదేశాంగశాఖ వ్యాఖ్యానించింది. వెనెజువెలాతో తమకు వ్యూహాత్మక భాగస్వామ్యం ఉందని  చైనా స్పష్టం చేసింది. గత రెండు దశాబ్దాలుగా వెనెజువెలాకు అతి పెద్ద చమురు కొనుగోలుదారుగా చైనా ఉంది. 

వెనెజువెలాపై దాడులమీద అంతర్జాతీయ సమాజం స్పందించాలని అమెరికా వ్యతిరేకి, వెనెజువెలాకు చిరకాల మిత్రుడిగా ఉన్న క్యూబా డిమాండు చేసింది. ఇది నేరపూరిత దాడి అని ఆ దేశాధ్యక్షుడు మిగెల్‌ డియాజ్‌-కానెల్‌ బెర్ముడెజ్‌ స్పష్టం చేశారు. తమ ప్రాంతంలో శాంతిని అమెరికా దారుణంగా భగ్నం చేసిందని ఆయన ఆరోపించారు. 

దీనికి భిన్నంగా అమెరికా దాడులను అర్జెంటీనా ప్రశంసించింది. ‘లాంగ్‌ లివ్‌ ఫ్రీడం’ అంటూ ఆ దేశాధ్యక్షుడు జేవియర్‌ మిలే వ్యాఖ్యానించారు. 
 
వెనెజువెలాకు శాంతియుత, ప్రజాస్వామ్యయుత, సమ్మిళిత పరిష్కారాన్ని కోరుకుంటున్నామని ఐరోపా కూటమి అధ్యక్షులు ఆంటోనియో కోస్టా పేర్కొన్నారు.  

ప్రజాస్వామిక మార్పు కోసం వెనెజువెలా ప్రజల వెంట నిలుస్తామని ఐరోపా కమిషన్‌ అధ్యక్షురాలు ఉర్సులా వాండర్‌ లెయెన్‌ పేర్కొన్నారు.

‘వెనెజువెలాపై అమెరికా జరిపిన ఆపరేషన్‌తో బ్రిటన్‌కు సంబంధం లేదు. ఈ విషయంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ నుంచి మరిన్ని వివరాలు తెలుసుకుంటాం. అంతర్జాతీయ చట్టాలను సమర్థించాలని నేను విశ్వసిస్తాను. శరవేగంగా మారుతున్న పరిస్థితుల్లో ముందు వాస్తవాలను తెలుసుకుందాం’ అని బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌ వ్యాఖ్యానించారు. 
‘ఉద్రిక్తతలను తగ్గించాలని, బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిస్తున్నాం. అంతర్జాతీయ చట్టాలను, ఐరాస చార్టర్‌ను గౌరవించాలి’ అని స్పెయిన్‌ ప్రధాని పెడ్రో సాంచెజ్‌ స్పష్టం చేశారు.  

‘వెనెజువెలా సరిహద్దుల్లో సైన్యాన్ని మోహరిస్తున్నాం. ఓఏఎస్‌ (ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ అమెరికన్‌ స్టేట్స్‌), ఐక్యరాజ్య సమితిని వెంటనే సమావేశం కావాలని కోరుతున్నాం’ అని కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో పేర్కొన్నారు. 
 

Advertisment
తాజా కథనాలు