/rtv/media/media_files/2024/12/07/pfUPgMiu6fbhJGhG1rTL.jpg)
సిరియాలో కల్లోలం అంతకంతకూ పెరిగిపోతోంది. తిరుగుబాటుదారులు కొంచెం కొంచెంగా మొత్తం దేశాన్ని హస్తగతం చేసుకుంటున్నారు. ప్రస్తుతం రెబల్స్ రాజధాని అయిన డమాస్కస్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. మరికొద్ది సేపట్లో వీరు రాజధానిని సొంత చేసుకుంటారని అంతర్జాతీయ మీడియా చెబుతోంది. డమాస్కస్‌కు 20 కిలోమీటర్ల దూరంలోనే తిరుగుబాటుదారులు ఉన్నారు. రాజధానిని చుట్టుముట్టడం ప్రారంభించినట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే మరోవైపు నగరంలో ఉన్న సైన్యం పారిపోయినట్లు చెబుతున్నారు. అయితే ఈ వార్తలను సిరియా రక్షణ మంత్రిత్వ శాఖ మాత్రం ఖండించింది. డమాస్కస్‌లో సాయుధ బలగాలు ఉపసంహరించుకున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని తెలిపింది. అలాగే దేశాధ్యక్షుడు బషర్ అల్-అసద్ రాజధానిని వీడినట్లు వస్తున్న వార్తలను కూడా అధ్యక్ష కార్యాలయం కొట్టిపారేసింది. ఆయన డమాస్కస్‌ను వీడేందుకు లేదా వేరే దేశం వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారన్నది అవాస్తవం అని చెప్పింది. ఆయన రాజధానిలోనే ఉన్నట్లు స్పష్టం చేసింది.
ఇక రాజధానే మిగిలింది..
దక్షిణ సిరియాలోని దారా, స్వీడియా ప్రాంతాలను ఇప్పటికే రెబ్లస్ స్వాధీన చేసుకున్నారు. అక్కడ సిరియా సైన్యం వైదొలిగింది. డమాస్కస్ శివారు ప్రాంతాలైన మదామియా, జరామానా, దరాయాల్లో ప్రస్తుతం తిరుగుబాటుదారులు దండెత్తారు. తూర్పు సిరియా నుంచి డమాస్కస్ శివారు ప్రాంతమైన హరస్తా దిశగానూ మరికొంతమంది సాగుతున్నట్లు బ్రిటన్‌కు చెందిన ‘సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ చెబుతోంది. రాజధానిని వశం చేసకుంటే తమ ఆపరేషన్ పూర్తవుతుందని హయాత్ తహరీర్ అల్ షమ్ తిరుగుబాటుదళాల ప్రతినిధి హసన్ అబ్దుల్ ఘనీ ప్రకటించారు. దక్షిణ సిరియా నుంచి డమాస్కస్ వైపు పయనిస్తున్నట్లు తెలిపారు. తిరుగుబాటుదారులు దేశ రాజధాని శివార్లకు చేరుకోవడం 2018 తర్వాత ఇదే మొదటిసారి.