BREAKING: పాకిస్తాన్‌లొ రక్తపాతం.. రాజధానిలో భారీ పేలుడుకి 25 మంది మృతి

పాకిస్థాన్‌ రాజధాని ఇస్లామాబాద్‌లో శుక్రవారం దర్గా టార్గెట్‌గా జరిగిన ఆత్మాహుతి దాడిలో కనీసం 25 మంది ప్రాణాలు కోల్పోయారు. బ్లాస్ట్‌లో 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని స్థానిక మీడియా, రక్షణ వర్గాలు వెల్లడించాయి.

New Update
pak blast

పాకిస్థాన్‌లో ఉగ్రవాదులు మరోసారి ఘాతుకానికి ఒడిగట్టారు. రాజధాని ఇస్లామాబాద్‌లో శుక్రవారం దర్గా టార్గెట్‌గా జరిగిన ఆత్మాహుతి దాడిలో కనీసం 25 మంది ప్రాణాలు కోల్పోయారు. బ్లాస్ట్‌లో 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని స్థానిక మీడియా, రక్షణ వర్గాలు వెల్లడించాయి.

శుక్రవారం ప్రార్థనల సమయంలో ఇస్లామాబాద్‌లోని షెహజాద్ టౌన్ ప్రాంతంలో ఉన్న తర్లై ఇమామ్ దర్గా వద్ద ఈ బ్లాస్ట్ సంభవించింది. భారీగా ప్రార్థనల్లో పాల్గొంటున్న సమయంలో ఓ సూసైడ్ బాంబర్ జనంలోకి చొరబడి తనను తాను పేల్చుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. పేలుడు ధాటికి ఆ ప్రాంతమంతా రక్తసిక్తమైంది. భయంతో జనం పరుగులు తీయడంతో అక్కడ తొక్కిసలాట వంటి పరిస్థితి నెలకొంది. పేలుడు సమాచారం అందిన వెంటనే పాక్ భద్రతా దళాలు, పోలీసులు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. గాయపడిన వారిని సమీపంలోని 'పాకిస్థాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్', ఇతర ఆసుపత్రులకు తరలించారు. ఇస్లామాబాద్‌లోని అన్ని ప్రధాన ఆసుపత్రుల్లో ప్రభుత్వం 'హెల్త్ ఎమర్జెన్సీ' ప్రకటించింది. రక్తదానం చేయాల్సిందిగా యువతకు విజ్ఞప్తి చేశారు.

పాకిస్థాన్‌లో గత కొన్ని రోజులుగా ఉగ్ర దాడులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా బలూచిస్థాన్‌లో, సరిహద్దు ప్రాంతాల్లో మిలిటెంట్లు వరుస దాడులకు పాల్పడుతున్నారు. ఇప్పుడు ఏకంగా రాజధాని నడిబొడ్డున, అది కూడా అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ఇస్లామాబాద్‌లో ఈ స్థాయి దాడి జరగడం భద్రతా వైఫల్యాలను ఎత్తిచూపుతోంది. పాక్ అంతర్గత వ్యవహారాల మంత్రి ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. "మతపరమైన ప్రదేశాలను లక్ష్యంగా చేసుకోవడం ఉగ్రవాదుల పిరికిపంద చర్య" అని ఆయన మండిపడ్డారు. దోషులను కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. ఈ దాడికి బాధ్యత వహిస్తూ ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థ అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.

Advertisment
తాజా కథనాలు