/rtv/media/media_files/2026/03/02/gulf-countries-2026-03-02-17-53-59.jpg)
తమలో తమకు ఎన్ని గొడవలున్నా.. బయటవాడు ఫ్యామిలి జోలికి వస్తే అందరూ ఒక్కటవుతారు. ఇలాంటి తీరు అంతర్జాతీయంగా కొన్ని దేశాల కూటముల మధ్య ఉంటుంది. కానీ భౌగోళికంగా, మతమరమైన ఒకే లక్షణాలు ఉన్న గల్ఫ్ దేశాలు మాత్రం ఒక్క దేశాన్ని జీర్ణించుకోలేవు. తామంతా గల్ప్ ఫ్యామిలీ అని చెప్పుకుంటూనే.. ఇరాన్‌ను దూరం పెడతాయి. దశాబ్దాలుగా మధ్యప్రాచ్యంలో ఇరాన్, గల్ఫ్ దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. ఇవన్నీ ముస్లీం దేశాలైనప్పటికీ.. ఇరాన్ తీరును గల్ఫ్ దేశాలు తప్పబడుతున్నాయి. తాజాగా ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణం తర్వాత జరిగిన దాడులు గల్ఫ్ దేశాలను మరింత ఆందోళనకు గురిచేశాయి. తటస్థంగా ఉండాలని ప్రయత్నించిన దేశాలను కూడా ఇరాన్ తన దాడులతో శత్రువులుగా మార్చుకుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
గల్ఫ్ దేశాలివే
పశ్చిమ ఆసియాలోని పర్షియన్ గల్ఫ్ తీరాన్ని ఆనుకుని ఉన్న దేశాలను "గల్ఫ్ దేశాలు" అంటారు. ఇవి ప్రధానంగా చమురు, సహజ వాయువు నిల్వలకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినవి. సాధారణంగా GCC (Gulf Cooperation Council)లో సభ్యులుగా ఉన్న 6 అరబ్ దేశాలను గల్ఫ్ దేశాలుగా పిలుస్తారు. సౌదీ అరేబియా గల్ఫ్ దేశాలలో అతిపెద్దది. తర్వాత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE), కువైట్, ఖతార్, ఒమన్, బహ్రెయిన్ దేశాలు ఈ కూటమిలో ఉన్నాయి. భౌగోళికంగా ఇరాక్, ఇరాన్ కూడా గల్ఫ్ తీరంలోనే ఉన్నప్పటికీ, రాజకీయంగా గల్ఫ్ దేశాల ప్రస్తావన వచ్చినప్పుడు పైన పేర్కొన్న ఆరు అరబ్ దేశాలనే ప్రధానంగా గుర్తిస్తారు. ప్రధానంగా ఐదు కారణాల వల్ల గల్ఫ్ దేశాలు ఇరాన్‌ను తమకు ముప్పుగా భావిస్తున్నాయి.
సున్నీ vs షియా
ఇది శతాబ్దాల నాటి సమస్య. ఇరాన్ మెజారిటీ షియా ముస్లిం దేశం కాగా, సౌదీ అరేబియా, యూఏఈ వంటి గల్ఫ్ దేశాలు సున్నీ ముస్లిం మెజారిటీ కలిగినవి. ఈ రెండు వర్గాల మధ్య ఉన్న ప్రాధాన్యత పోరు పశ్చిమాసియా రాజకీయాలను ప్రభావితం చేస్తోంది.
అమెరికాతో సంబంధాలు
సౌదీ, యూఏఈ వంటి దేశాలకు అమెరికా ప్రధాన రక్షణ భాగస్వామి. ఇరాన్‌కు అమెరికా అంటే బద్ధశత్రువు. గల్ఫ్ దేశాలలో అమెరికా సైనిక స్థావరాలు ఉండటాన్ని ఇరాన్ సహించదు. అందుకే ఆ దేశాలను అమెరికా 'ఏజెంట్లు'గా ఇరాన్ చూస్తుంది, ఫలితంగా ఉద్రిక్తతలు పెరుగుతాయి.
ప్రాంతీయ ఆధిపత్యం
పశ్చిమాసియాలో ఎవరు శక్తివంతులుగా ఉండాలనే విషయంలో ఇరాన్, సౌదీ అరేబియా మధ్య ఎప్పుడూ పోటీ ఉంటుంది. ఇరాన్ తన ప్రభావాన్ని పెంచుకోవడానికి లెబనాన్ (హిజ్బుల్లా), యెమెన్ (హౌతీలు), సిరియా వంటి దేశాల్లోని సాయుధ గ్రూపులకు మద్దతు ఇస్తుంది. దీనిని గల్ఫ్ దేశాలు తమ భద్రతకు ముప్పుగా భావిస్తాయి.
ప్రాక్సీ యుద్ధాలు
యెమెన్ అంతర్యుద్ధంలో ఇరాన్ మద్దతు ఇచ్చే హౌతీ రెబల్స్ తరచుగా సౌదీ అరేబియాపై దాడులు చేస్తుంటారు. ఇలా పొరుగు దేశాల్లో అశాంతిని సృష్టించడం ద్వారా ఇరాన్ తమను ఇబ్బంది పెడుతోందని గల్ఫ్ దేశాల ఆరోపణ.
తాజా దాడులు
ఫిబ్రవరి 2026లో అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ తన క్షిపణులను కేవలం ఆ దేశాలపైనే కాకుండా, గల్ఫ్ దేశాలైన యూఏఈ (దుబాయ్, అబుదాబి), కువైట్, ఖతార్, బహ్రెయిన్ లపైకి కూడా ప్రయోగించింది. తమ దేశాల్లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ చేసిన ఈ దాడులు గల్ఫ్ దేశాల సార్వభౌమాధికారాన్ని దెబ్బతీశాయి. ఇది ఆయా దేశాల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమైంది.
Follow Us