ఇరాన్‌లో చేజారిపోయిన పరిస్థితి.. అమ్మాయిల వెరైటీ నిరసనకు కారణమిదే!

ఇరాన్‌లో ఇస్లామిక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మహిళల పోరాటం మరోసారి ఉదృతమైంది. 2022లో మహ్సా అమీనీ మరణంతో మొదలైన 'ఉమెన్-లైఫ్-ఫ్రీడమ్' ఉద్యమం, ఇప్పుడు మరింత తీవ్రరూపం దాల్చింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది.

New Update
Iran protest

ఇరాన్‌లో ఇస్లామిక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మహిళల పోరాటం మరోసారి ఉదృతమైంది. 2022లో మహ్సా అమీనీ మరణంతో మొదలైన 'ఉమెన్-లైఫ్-ఫ్రీడమ్' ఉద్యమం, ఇప్పుడు మరింత తీవ్రరూపం దాల్చింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. అందులో యువతులు ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ ఫోటోలను తగలబెడుతూ, ఆ మంటతో సిగరెట్లు వెలిగిస్తున్నారు. నియంత పదవి నుంచి దిగిపోవాలని డిమాండ్ చేస్తూ నినాదాలు ఇస్తున్నారు అక్కడి యువతులు. ఈ చర్య వెనుక ఉన్న అర్థం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అమెరికాకు చెందిన హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్స్ న్యూస్ ఏజెన్సీ (HRANA) ప్రకారం, ఇటీవలి అల్లర్లలో కనీసం 34 మంది నిరసనకారులు, నలుగురు సెక్యురిటీ అధికారులు మరణించారు. దాదాపు 2,200 మందిని అరెస్టు చేశారు. ఈ నిరసనలు ఇరాన్ రాజకీయ, మతపరమైన వ్యవస్థపై అక్కడి ప్రజలకు ఉన్న అసంతృప్తికి నిదర్శనమని విశ్లేషకులు భావిస్తున్నారు. 

వెరైటీ నిరసన 

ఇరాన్ చట్టాల ప్రకారం ఈ చర్యలో రెండు ప్రధాన అంశాలు ఉన్నాయి. ఇరాన్‌లో సుప్రీం లీడర్ ఫోటోను అవమానించడం లేదా తగలబెట్టడం అత్యంత తీవ్రమైన నేరం. దీనికి కఠినమైన జైలు శిక్ష లేదా ఉరిశిక్ష పడే అవకాశం ఉంది. అలాగే, ఇరాన్ సమాజంలో మహిళలు బహిరంగంగా సిగరెట్ తాగడం అనేది నిషేధం కాకపోయినా, అది సామాజికంగా తీవ్రమైన అగౌరవంగా, 'మత విరుద్ధమైన' పనిగా పరిగణించబడుతుంది. ఈ రెండింటినీ కలిపి చేసి, మహిళలు తాము కేవలం హిజాబ్ చట్టాలనే కాదు, ప్రభుత్వ అధికారానికే భయపడటం లేదని సంకేతాలిస్తున్నారు.

మహ్సా అమీనీ నుంచి హిజాబ్ 2.0 వరకు

2022 సెప్టెంబర్‌లో మహ్సా అమీనీ అనే 22 ఏళ్ల యువతిని 'హిజాబ్ సరిగ్గా ధరించలేదనే' కారణంతో మోరాలిటీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆమె పోలీసు కస్టడీలో మరణించడం దేశవ్యాప్త ఆగ్రహానికి దారితీసింది. అప్పట్లో మహిళలు జుట్టు కత్తిరించుకుని, హిజాబ్‌లను తగలబెట్టి నిరసనలు తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న నిరసనలను హిజాబ్ 2.0 గా పిలుస్తున్నారు. దేశంలో పెరిగిన ద్రవ్యోల్బణం, ఆర్థిక సంక్షోభం, ప్రభుత్వ అణిచివేత ధోరణి దీనికి ఆజ్యం పోశాయి. ఇరాన్ కరెన్సీ (రియల్) విలువ పడిపోవడంతో సామాన్యుల జీవితాలు దుర్భరమయ్యాయి. దీనితో కేవలం హిజాబ్ కోసమే కాకుండా, పూర్తి మత రాజ్య మార్పు కోరుతూ ప్రజలు వీధుల్లోకి వస్తున్నారు.

భద్రతా దళాల అణిచివేత

ఈ నిరసనలను అడ్డుకునేందుకు ఇరాన్ ప్రభుత్వం ఇంటర్నెట్‌ను నిలిపివేయడంతో పాటు, టియర్ గ్యాస్, బుల్లెట్లతో విరుచుకుపడుతోంది. ఇప్పటికే పలువురు నిరసనకారులు మరణించగా, వందలాది మందిని జైల్లో పెట్టారు. అయినప్పటికీ, మహిళలు "నేను భయపడను, నేను చనిపోయి 47 ఏళ్లయింది" (1979 విప్లవం తర్వాత తమ స్వేచ్ఛ పోయిందని అర్థం) వంటి నినాదాలతో తమ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు.

ఖమేనీ ముందున్న సవాళ్లు

ప్రాంతీయంగా ఇరాన్ స్థానాన్ని బలహీనపరిచింది. ఇటీవలి నెలల్లో, ఇజ్రాయెల్ గాజాలోని హమాస్, లెబనాన్‌లోని హిజ్బుల్లా, యెమెన్‌లోని హౌతీలు మరియు ఇరాక్‌లోని మిలీషియా వంటి ఇరాన్ మద్దతుగల గ్రూపులపై దాడులు చేసింది. అంతేకాకుండా, టెహ్రాన్‌కు సన్నిహితుడైన సిరియా నాయకుడు బషర్ అల్-అసద్‌ను పదవీచ్యుతి చేయడం వల్ల ఇరాన్ ప్రభావం తగ్గింది. ఇరాన్ ప్రస్తుతం అధిక ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, పెరుగుతున్న ఆహార ధరలు, బలహీనపడుతున్న కరెన్సీతో పోరాడుతోంది. రియాల్ విలువ తగ్గడం సాధారణ ప్రజల కొనుగోలు శక్తిని తీవ్రంగా ప్రభావితం చేసింది. ఆర్థిక నిరాశ మరోసారి అనేక నగరాల్లో నిరసనలకు ఆజ్యం పోసింది. తాజా నిరసనలు టెహ్రాన్‌లోని గ్రాండ్ బజార్‌లో ప్రారంభమయ్యాయి, అక్కడ దుకాణదారులు తగ్గుతున్న కరెన్సీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత నిరసనలు దేశంలోని ఇతర ప్రాంతాలకు వ్యాపించి, మొత్తం 31 ప్రావిన్సులకు చేరుకున్నాయి.

Advertisment
తాజా కథనాలు