PM Modi: కెనడాలో హిందూ భక్తులు, దేవాలయంపై జరిగిన దాడిని భారత ప్రధాని మోదీ ఖండించారు. సోమవారం బ్రాంప్టన్ లో ఉన్న హిందూ సభా మందిర్‌లోని భక్తులపై ఖలిస్థానీలు దాడి చేసిన ఘటనపై ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు 'ఉద్దేశపూర్వకంగా జరిగిన దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. మన దౌత్యవేత్తలను బెదిరించేందుకే ఈ పిరికి ప్రయత్నాలూ. ఇవి భయంకరమైనవి కూడా. ఇలాంటి హింసాత్మక చర్యలు భారతదేశ నిర్ణయాన్ని ఎప్పటికీ బలహీనపరచలేవు. కెనడియన్ ప్రభుత్వం న్యాయాన్ని, చట్ట నియమాన్ని పాటిస్తుందని మేము ఆశిస్తున్నాం' అంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు ప్రధాని మోదీ.
హింసాత్మక ఘటనలకు చోటు లేదు..
ఇక విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ.. ఉగ్రవాదులు, వేర్పాటువాదుల హింసాత్మక చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. ఈ తరహా దాడుల నుంచి అన్ని ప్రార్థనాస్థలాలను సంరక్షించాలని కెనడా ప్రభుత్వాన్ని కోరారు. కారకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కెనడాలో భారతీయుల భద్రత గురించి భారత ప్రభుత్వం తీవ్ర ఆందోళన చెందుతోందన్నారు. భారతీయులకు కాన్సులర్ సేవలు అందించే దౌత్యవేత్తలు ఈ తరహా బెదిరింపులకు తలొగ్గదని సూచించారు. అలాగే ఈ ఘటనను కెనడియన్ ప్రధాని జస్టిన్ ట్రూడో తప్పుబట్టారు. దేశంలో ఇలాంటి హింసాత్మక ఘటనలకు చోటు లేదని, ప్రతి దేశ పౌరుడు తమ విశ్వాసాన్ని స్వేచ్ఛగా, సురక్షితంగా ఆచరించే హక్కు ఉందని చెప్పారు.