పీటీఐ మద్దతుదారులు పాకిస్తాన్ రాజధానిని రణరంగంగా మార్చేశారు. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను విడుదల చేయాలంటూ వారు ఆందోళనలు చేశారు. భారీ స్థాయిలో భద్రతా దళాలు అడ్డుకున్నప్పటికీ.. నిరసనకారులు కరాచీలోని డీ-చౌక్‌ను చేరుకున్నారు. ఈ క్రమంలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల్లో ఇప్పటివరకు ఆరుగురు భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోగా.. దాదాపు 100 మంది గాయపడినట్లు పాక్ ప్రభుత్వం తెలిపింది. రాజధానిలో శాంతి భద్రతల పరిస్థితి చేయిదాటిపోవడంతో సైన్యాన్ని రంగంలోకి దించింది ప్రభుత్వం. దీంతో పాక్ గవర్నమెంట్ హింసాత్మక ఘటనలకు పాల్పడేవారిని కాల్చివేయాలని ఆదేశించింది.
పాకిస్తాన్ మాజీ ప్రధాని, క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ మీద 200 కేసులు నమోదయ్యాయి. ఆయన ప్రస్తుతం జైల్లో ఉన్నారు. ముందే పీటీఐ మద్దతుదారులకు ఆయన పిలుపునిచ్చారు. నవంబర్ 24న సమాన్యుల అక్రమ అరెస్టులు, ప్రస్తుత ప్రభుత్వ నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా నిరసనలు చేప్టటాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే నిరసనకారులు ఆందోళనలు చేశారు. దీంతో రాజధానిలో లాక్‌డౌన్ ఆంక్షలు విధించిన పోలీసులు.. నగరంలోకి నిరసనకారులు ప్రవేశించకుండా అడ్డుకున్నారు. కానీ వారు భద్రతా సిబ్బంది మీద దాడులు చేశారు. చివరకు అధ్యక్ష, ప్రధాని కార్యాలయాలతోపాటు పార్లమెంటు, సుప్రీం కోర్టులున్న డీ-చౌక్ వద్దకు చేరుకున్నారు. ఇమ్రాన్ ఖాన్‌ను విడుదల చేసేంతవరకు ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.