Israel:
యుద్దం కారణంగా కార్మికుల కొరత ఎదుర్కొంటున్న ఇజ్రాయెల్..భారత్ నుంచి వేల సంఖ్యలో ఉద్యోగ నియామకాలు చేసుకుంటోంది. ఇందులో భాగంగా మరోసారి వేల సంఖ్యలో కార్మికులను నియమించుకునేందుకు భారత్ ను ఇటీవల సంప్రదించిందని నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ తెలిపింది.
వీటిలో 10 వేల నిర్మాణ కార్మికులు, ఐదు వేల ఆరోగ్య సంరక్షకుల కోసం నియామకాలు చేపట్టనున్నట్లు తెలిపింది. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందంలో భాగంగా ఉద్యోగుల ఎంపిక విధానంలో తప్పిదాల పై మీడియాలో వచ్చిన కథనాలపై ఎన్‌ఎస్‌డీసీ స్పందించింది. ఫ్రేమ్ వర్క్, ఐరన్ బెండింగ్, ప్లాస్టరింగ్, సిరామిక్ టైలింగ్ విభాగాల్లో ఉద్యోగాల కోసం ఇజ్రాయెల్ కు చెందిన పాపులేషన్, ఇమ్మిగ్రేషన్ బార్డర్ అథారిటీ ఇటీవల మరోసారి సంప్రదించిందని పేర్కొంది.
ఈ నియామకాలకు సంబంధించి స్కిల్ టెస్ట్ నిర్వహించేందుకు మరికొన్ని వారాల్లోనే పీఐబీఏ బృందం భారత్ కు రానుందని వెల్లడించింది. తొలి దఫాలో యూపీ, హరియాణా, తెలంగాణాల్లో 10,349 నిర్మాణ కార్మికులను నియమించుకున్న ఇజ్రాయెల్..ఈ సారి మహారాష్ట్రలో వీటి నియామకాలు చేపట్టనున్నట్లు తెలిపింది.
ఎంపికైన వారికి నెలకు రూ. 1.92 లక్షల జీతంతో పాటు బీమా, ఆహారం, వసతి కల్పిస్తారు. వీటితో పాటు రూ. 16,515 బోనస్ కూడా ఇస్తారు. కేవలం నిర్మాణ రంగంలోనే కాకుండా వైద్య రంగంలో ఐదు వేల వైద్య సంరక్షకులను ఇజ్రాయెల్ నియమించుకోనుంది. ఇందుకు 10 వ తరగతి విద్యార్హత , వైద్య సంరక్షణ కోర్సు పూర్తి చేసి ఉండాలి.సంబంధిత విభాగంలో శిక్షణ పొందిన వారు ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చని ఎన్‌ఎస్‌డీసీ వెల్లడించింది.
ఇదిలా ఉంటే, తాత్కాలిక ఉద్యోగ నియామకాలకు సంబంధించి ఇజ్రాయెల్ – భారత్ లు 2023 లో ఒప్పందాలు చేసుకున్న విషయం తెలిసిందే.
Also Read : ఉధృత గోదావరి.. 50 అడుగులు దాటి నిలకడగా వరద!