Donald Trump: అమెరికా ప్రెసిడెంట్ రేసులో మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమొక్రాటిక్ పార్టీ నుంచి కమలా హ్యారిస్ ఉన్న సంగతి తెలిసిందే. కాగా నూతన అధ్యక్షుడి ఎన్నికకు ఇంకా 40 రోజుల సమయం ఉండడంతో ప్రచారాల్లో వీరు దూసుకుపోతున్నారు. ఒకరిపై ఒకరు విమర్శలు, ఆరోపణలు చేస్తూ ప్రచారాలు చేస్తున్నారు. ఎన్నికకు సమయం దగ్గర పడుతుండడంతో అమెరికాలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.
ట్రంప్‌ను చంపేందుకు కుట్ర...
అమెరికాలో రాజకీయ వేడి రగులుతోంది. ఇటీవల మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను చంపేందుకు ఆయనపై ఆగంతకుడు కాల్పులు జరిపిన విషయం విదితమే. ట్రంప్ ను ఎన్నికల బరిలో నుంచి తప్పించేందుకు ఇరాన్ కుట్ర పన్నుతోందని అమెరికా నిఘా వర్గాలు చెప్పినట్లు రిపబ్లికన్ పార్టీ పేర్కొంది. ట్రంప్ ను హత్య చేసేందుకు ఇరాన్ వ్యూహాలు రచిస్తోందని.. ఇందుకోసం ఇప్పటికే కార్యాచరణ రూపొందించినట్లు తమకు టెలిజెన్స్ కార్యాలయం హెచ్చరించిందని ట్రంప్ బృందం చెప్పింది. కాగా దీనిని డెమొక్రాటిక్ పార్టీ ఖండించింది.
ఇది మొదటిసారి కాదు..
తనపై ఇరాన్ హత్యకు కుట్ర పన్నడంపై ట్రంప్ స్పందించారు. ట్విట్టర్(X)లో తన స్పందనను పోస్ట్ చేశారు. తనను చంపేందుకు ఇరాన్ ప్రయత్నించడం ఇది తొలిసారి కాదు అని అన్నారు. గతంలో తాను అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనూ తనను హత్య చేసేందుకు పలుమార్లు ఇరాన్ ప్రయత్నాలు చేయగా.. అమెరికా సైన్యం దాన్ని తిప్పి కొట్టిందని చెప్పారు. వారి హత్య ప్రయత్నాలను అమెరికా సైన్యం విఫలం చేస్తున్న క్రమంలో మరోసారి వారు తనను చంపేందుకు ప్రయత్నాలు ఆపడం లేదని పేర్కొన్నారు. ఎటువంటి వ్యతిరేకత లేకుండా సీక్రెట్ సర్వీసెస్‌కు ఎక్కువ నిధులు కేటాయించినందుకు కాంగ్రెస్‌కు కృతజ్ఞతలు తెలిపారు. రిపబ్లికన్లు, డెమోక్రాట్లు ఈ విషయంలో కలిసిరావడం ఆనందంగా ఉందని చెప్పారు. ఓ మాజీ అధ్యక్షుడిపై హత్యాయత్నం అంటే నిందితుడికి మరణమే అని స్వీట్ అండ్ మాస్ వార్నింగ్ ఇచ్చారు.